సినిమా చూస్తే థియేటర్‌లోనే చూడాలి. థియేటర్‌లో చూడటంలో ఉన్న ఆనందం వేరే ఏ మాధ్యమంలోనూ ఉండదు. సినీ తారలు, దర్శకులు, నిర్మాతలు అంటున్న మాటలివీ. ఏళ్ల తరబడి థియేటర్‌లోనే సినిమాను చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులు నెమ్మదిగా ఓటీటీ బాట పడుతున్నారు. కానీ ఏదో వెలితి. త్వరలోనే సినిమాను థియేటర్‌లో చూస్తామనే ఆశ. తొందర్లోనే తెరపై బొమ్మ పడి తీరుతుందని చిత్రసీమ కూడా ఆశగా చూస్తోంది.
'వచ్చే నెల థియేటర్లు తెరుస్తారు' అనే ప్రచారం సాగుతుంది. వీలైనంత తొందరగా తెరవాలని చిత్రసీమ నుంచి కేంద్రానికి సినీ ప్రముఖులు విన్నవించుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగి థియేటర్లు తెరుచుకుంటే ప్రేక్షకులు వస్తారా? అనే సందేహం చాలా రోజులుగా ఉంది. ఇప్పటికే థియేటర్లు తెరిచిన కొన్ని దేశాల్లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదంటున్నారు కొందరు. భారీ అంచనాలతో విడుదలైన హాలీవుడ్ చిత్రాలు 'టెనెట్', 'ములన్'ల వసూళ్లు భారతీయ ఎగ్జిబిటర్లను ఒకింత ఆలోచనలో పడేస్తున్నాయి.
- క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'టెనెట్' ఉత్తర అమెరికాలో ఈ నెల 3న విడుదలైంది. అక్కడ తొలి రెండు వారాల్లో 29.5 మిలియన్ డాలర్ల వసూళ్లు మాత్రమే దక్కించుకుంది. అదే సమయంలో 'ములన్' చిత్రం తొలి ఎనిమిది రోజుల్లో చైనాలో 31.17 మిలియన్ డాలర్ల వసూళ్లను అందుకుంది. ఈ చిత్రాలకు ఈ స్థాయి వసూళ్లు అంటే చాలా తక్కువనే చెప్పాలి. మరి ఇది త్వరలో తెరవబోయే భారతీయ థియేటర్ రంగానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్టు? అంటే ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.
- "టెనెట్', 'ములన్' చిత్రాల వసూళ్లు చూస్తుంటే భారతీయ చిత్ర పరిశ్రమకు మంచి పరిణామంగా కనిపించడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. ఇప్పుడు దేశంలో పరిస్థితులు అంత బాగా లేవు. ప్రజలు రక్షణ, భద్రత కోసమే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు తప్పితే వినోదానికి కాదు" అంటున్నారు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్.
జాగ్రత్తలు పాటిస్తే వస్తారు
హాలీవుడ్ చిత్రాల వసూళ్లను మన సినిమాలకు, థియేటర్లకు ముడిపెట్టి చూడలేం అంటున్నారు కొందరు ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లు. "వసూళ్లు ఒక్కటే లెక్కలో తీసుకోలేం. ఎందుకంటే అమెరికాలో ఇంకా చాలా చోట్ల థియేటర్లు తెరవలేదు. అది కూడా వసూళ్ల తగ్గడానికి కారణమే. ఇవే హాలీవుడ్ చిత్రాలు యూరప్‌లో విడుదలై మంచి కలెక్షన్లు రాబడుతున్నాయి. యూరప్‌లో ఎక్కువశాతం థియేటర్లు తెరచుకోవడమే దానికి కారణం.
'టెనెట్' రివ్వ్యూస్ అంత గొప్పగా ఏమీ లేవు. అందుచేత వసూళ్లు తగ్గడం సహజమే" అంటున్నారు ఓ ప్రముఖ ఎగ్జిబిటర్. థియేటర్లలో సరైన జాగ్రత్తలు చేపడితే కచ్చితంగా ప్రేక్షకులు వస్తారు అని ధీమాగా చెబుతున్నారు బాలీవుడ్ ఎగ్జిబిటర్ అక్షయ్ రతి.
థియేటర్లు తెరవాల్సిందే!
సుమారు ఆరు నెలలుగా థియేటర్లు మూతపడ్డాయి. ఎందరో జీవనోపాధిని కోల్పోయారు. రోజువారీ కార్మికుల అవస్థలు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. థియేటర్లు తెరిస్తే ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలు 'ఇందూ ఖీ జవానీ', 'సూర్యవంశీ', '83' చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లు తెరిస్తే ప్రేక్షకుల వస్తారా? లేదా? భారీ వసూళ్లు వస్తాయా? లేదా? ఇలాంటి సందేహాలు అనవసరం అంటున్నారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనీష్ బజ్మీ.
"ఎక్కువశాతం ప్రజలకు ఆరునెలలుగా సరైన ఉపాధి లేదు. ఈ పరిస్థితుల్లో థియేటర్లు తెరిచినా ఎక్కువశాతం మంది తమవద్ద ఉన్న డబ్బులను సినిమాల కోసం వెచ్చించడం కంటే పొదుపు చేయడానికే ప్రాధాన్యం ఇస్తారు. అలాగని థియేటర్లు తెరవకుండా ఉండటం సరైంది కాదు. ఏది ఏమైనా థియేటర్లు తెరవడం చాలా అవసరం. వీటిపై ఆధారపడి లక్షలాది మంది బతుకుతున్నారు" అంటున్నారు అనీష్ బజ్మీ.
దేశవ్యాప్తంగా థియేటర్లసంఖ్య : 10,000 (సుమారు)
ప్రత్యక్షంగా ఆధారపడిన వారు: 2 లక్షలకుపైగా
ఆరు నెలల్లో పరిశ్రమ నష్టం: రూ.9000 కోట్లు
థియేటర్లు తెరిచిన ముఖ్య దేశాలు: చైనా, అమెరికా, బ్రిటన్, కొరియా, ఇటలీ, స్పెయిన్, సింగపూర్, మలేషియా, శ్రీలంక...