బాలీవుడ్ నటి డ్రీమ్ గర్ల్ హేమ మాలినిపై మధ్యప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పీసీ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుంతలతో ఉన్న భోపాల్ రోడ్లు త్వరలోనే హేమ మాలిని బుగ్గల్లాగా అందంగా మారతాయని పేర్కొన్నారు. హబీబ్‌గంజ్ రైల్వేస్టేషన్ సమీపంలోని రహదారులను మంత్రి వర్మతో కలిసి పరిశీలించిన పీసీ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.
"ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆదేశాలతో ప్రజాపనుల మంత్రి సజ్జన్ ఆధ్వర్యంలో 15 రోజుల్లోనే రోడ్ల మరమ్మతులు పూర్తిచేస్తాం. 15 నుంచి 20 రోజుల్లో ఈ రోడ్లు హేమ మాలిని బుగ్గల్లా అందంగా తయారవుతాయి."
- పీసీ శర్మ, మధ్యప్రదేశ్ న్యాయశాఖమంత్రి
స్పోటకం మచ్చల్లా
భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయపైనా శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్లు.. కైలాష్ బుగ్గలపైన ఉన్న స్పోటకం మచ్చల్లా ఉన్నాయని అన్నారు.
వాషింగ్టన్ రోడ్లకు ఏమైంది?
"రాష్ట్రంలో వాషింగ్టన్, న్యూయార్క్ తరహాలో రోడ్లు నిర్మించామని మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చెప్పారు. అలా అయితే కేవలం ఒక్క వర్షంతోనే ఈ రోడ్లకు ఎందుకు గుంతలు పడ్డాయి" అని శర్మ ప్రశ్నించారు. గత భాజపా ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయాలని మంత్రి వర్మ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'బ్యాంకింగ్' పతనానికి వారిద్దరే కారణం: నిర్మల