తన విలక్షణ నటనతో ప్రతినాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అమ్రిష్ పురి. ప్రముఖ దర్శకుడు స్పీల్బర్గ్ 1984లో తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం 'ఇండియానా జోన్స్ అండ్ టెంపుల్ ఆఫ్ డూమ్'లో విలన్ మోలా రామ్‌గా నటించి మెప్పించారు. అయితే, ఈ సినిమా ఆఫర్‌ను మొదట్లో అమ్రిష్ తిరస్కరించారట.
తన ఆత్మకథ 'ది యాక్ట్ ఆఫ్ లైఫ్' ప్రకారం...టెంపుల్ ఆఫ్ డూమ్‌ను భారత్‌లో చిత్రీకరించేందుకు స్పీల్‌బర్గ్‌కు అనుమతి లభించలేదు. అందుకు ప్రత్యామ్నాయంగా ఈ సినిమాను శ్రీలంక, మకావ్, లండన్లలో తెరకెక్కించారు. ఈ క్రమంలోనే కాస్టింగ్ డైరెక్టర్ డాలీ ఠాక్రే.. 'గెహ్రాయీ' హారర్ చిత్రంలోని అమ్రిష్ పురి స్టిల్స్‌ను స్పీల్‌బర్గ్‌కు పంపారు. అనంతరం అమెరికా నుంచి కాస్టింగ్ సిబ్బంది భారత్‌కు వచ్చి అమ్రిష్ను కలిసి ఆడిషన్‌కు రావాలని కోరారు. అయితే, అందుకు నిరాకరించిన నటుడు.. బదులుగా తన కొత్త సినిమాలో సెట్స్‌పై ప్రదర్శనను చూసుకోవాలని తెలిపారు. "స్పీల్ బర్గ్‌కు నా భాష తెలియదు. అతనికి నేను కేవలం ఒక నటుడిగా మాత్రమే తెలుసు" అంటూ కాస్టింగ్ బృందానికి సమాధానమిచ్చారు.
![When Amrish Puri refused to audition for Steven Spielberg](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7890227_dfd.jpg)
అలా హాలీవుడ్ చిత్రంలో..
చివరకు స్పీల్బర్గ్ చిత్రంలో నటించేందుకు అంగీకరించారు అమ్రిష్. తన నటనతో అందరినీ మాయ చేశారు. ఈ క్రమంలోనే స్పీల్బర్గ్ గురించి మాట్లాడుతూ "అతను చిన్నపిల్లల మనస్తత్వం కలవాడు. నిస్సంకోచమైన వ్యక్తి" అని అభివర్ణించారు. ఇక సిబ్బందిపై స్పందించిన అమ్రిష్.. "నేను భారతీయుడినైనా అక్కడ ఎవరికీ అహం, సమస్యలు ఇలాంటివేవీ లేవు. మన దేశంలోని నటీనటుల్లా కాకుండా.. అన్ని రంగాల్లో నైపుణ్యత కలిగి ఉన్నారు." అంటూ వెల్లడించారు.
![When Amrish Puri refused to audition for Steven Spielberg](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7890227_dsd.jpg)
వివాదాల చుట్టూ తిరిగిన చిత్రం..
హింసాత్మక దృశ్యాలను చిత్రీకరించినందుకు భారత్‌లో వివాదాలను మూటగట్టుకుందీ చిత్రం. అమ్రిష్ పురిని దేశ వ్యతిరేకి అని కూడా ఆరోపించారు. ఈ విషయంపై దిగ్గజ నటుడు స్పందిస్తూ.. "స్పీల్బర్గ్ వంటి దిగ్గజ దర్శకులతో పనిచేసే అరుదైన అవకాశం ఇది. ఈ విషయంలో నేను ఎంతమాత్రం చింతించను. దేశానికి వ్యతిరేకమైన పని నేను చేశానని అనుకోను. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం నిజంగా మూర్ఖత్వం." అని వివరించారు.