స్టార్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు ప్రత్యేకత ఏమిటి? ఆయన ఇన్ని దశాబ్దాలుగా దర్శకుడిగా ఎలా రాణిస్తున్నారు? ఆ రహస్యమేంటి? ఆయనతో పాటు సినిమాలు తీసిన చాలామంది డైరెక్టర్లు కెరీర్ ముగిసిందని నిశ్చయించుకొని వేరే వ్యాపకాల్లో ఉన్నారు. కానీ రాఘవేంద్రరావు ఇప్పటికీ కొత్త చిత్రాలు ప్రకటించటమో, సమర్పించడమో చేస్తూ తన దర్శకసహచరులను ప్రోత్సహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.
రాఘవేంద్రరావు ప్రత్యేకత ఏంటంటే కేవలం ప్రకృతి అందాల ప్రదర్శనే కాదు. పూలన్నీ తలంబ్రాలు కావటమే కాదు. హీరోయిన్లు తుళ్లిపడేలా రకరకాల పండ్లు దొర్లిపడుతుంటాయి. సెంటిమెంటు పండించే దృశ్యాలు ఆయన సినిమాల్లో సర్వసాధారణం.
శోభన్ బాబు, శ్రీదేవి జంటగా నటించిన 'దేవత' సినిమాలో 'వెల్లువొచ్చి గోదారమ్మ' పాట వినూత్నంగా చిత్రీకరించారు. చక్రవర్తి సంగీతం, బాలు-సుశీల యుగళం, శోభన్, శ్రీదేవి అభినయం వేటికవే ఈ గీతంలో పోటీపడ్డాయి. బిందెల నడుమ చిత్రీకరించిన ఈ పాట తర్వాత చాలామంది దర్శకులకు స్ఫూర్తినిచ్చింది. వెండితెరమీద రసపుష్టిని, రిచ్ నెస్‌ను చూపించడంలో ఆయనది అందెవేసిన చేయి. ముందుగానే మనసుతో చూస్తారు. ఒకరూపం సంతరించుకోగానే వెండితెరమీద ప్రదర్శించటానికి ఉవ్విళ్లూరతారు. సౌందర్యానికి ప్రతీకలను రాఘవేంద్రరావు బాగా చూపిస్తారనే పేరు తెచ్చుకున్నారు. హీరోను ఉదాత్తంగా చూపిస్తారు. సినిమాలో కథానాయకుణ్ణి పరిచయం చేయటం వినూత్నంగా ఉంటుంది. హీరోయిన్లయితే రాఘవేంద్రుని దర్శకత్వంలో కనీసం ఒక్కసినిమా చేసినా చాలని తపించే వారే అధికం.
హీరో కృష్ణను వెండితెరపై ప్రజెంట్ చేయటంలో రాఘవేంద్రరావుది విలక్షణ శైలి. 'అగ్ని, జమదగ్ని.. అగ్గిపెట్టె ఉందా' అని అడిగే డైలాగ్ బాగా ప్రాచుర్యం పొందింది. కృష్ణ-శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు తీసిన చిత్రం 'వజ్రాయుధం' ప్రేక్షకులను మెప్పించింది.
ఇక బాలయ్య- రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 'రౌడీ రాముడు-కొంటె కృష్ణుడు' సినిమాలో తండ్రి ఎన్టీఆర్‌తో తనయుడు బాలకృష్ణ నటించారు. సోలో హీరోగా చేసిన పట్టాభిషేకం, దొంగరాముడు, అపూర్వ సహోదరులు హిట్ చిత్రాలుగా నిలిచాయి.
నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన 108 తెలుగు సినిమాలకు, 18 పరభాషా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఐదు తరాల నటులతో కలసి పనిచేశారు. ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో సినిమాలు తీశారు. ఎన్టీఆర్‌తో 12 సినిమాలు, చిరంజీవితో 10, శ్రీదేవితో 24 సినిమాలకు దర్శకత్వం వహించడం విశేషం. వెంకటేశ్, మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ను హీరోలుగా పరిచయం చేసింది ఈయనే.