మార్చి 24.. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండు మూడు రోజులు ఎవరికీ ఏం అనిపించలేదు. కానీ ఆ తర్వాత చిరాకు మొదలైంది! థియేటర్లు, మాల్స్, టూర్స్‌కు వెళ్లలేక ఇంట్లో ఉండేసరికి ఇబ్బందిగా అనిపించింది. అలాంటి సమయంలో అపద్భాంధవుడిలా కనిపించింది ఓటీటీ.
అప్పటివరకు లక్షల మందికి మాత్రమే తెలిసిన 'ఓటీటీ'.. లాక్డౌన్ దెబ్బకు కొన్ని కోట్ల మందికి సుపరిచితమైంది. ఇంతకీ ఓటీటీ అంటే ఏంటి? భారత్‌లోకి ఎప్పుడు వచ్చింది? ఎంతమంది ఓటీటీని ఉపయోగిస్తున్నారు? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
ఓటీటీ అంటే?
ఓటీటీ అంటే 'ఓవర్ ది టాప్'. మనకు నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలను పలు యాప్స్‌లో నచ్చిన సమయంలో, ఎప్పుడైతే అప్పుడు చూడొచ్చు. ఇందుకోసం కేవలం కొంత మొత్తం చెల్లించి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే సరిపోతుంది.
భారత్‌లోకి ఓటీటీ ఎప్పుడు వచ్చింది?
2008లో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్కు చెందిన 'బిగ్‌ఫ్లిక్స్' ఫ్లాట్‌ఫామ్ మొదటగా మనదేశంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత కాలంలో నెక్స్ జి టీవీ, డిటో టీవీ, సోనీ లివ్ వచ్చాయి. 2016లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వచ్చిన తర్వాత మనకు ఓటీటీ కల్చర్ బాగా అలవాటైపోయింది.
ఓటీటీల్లో మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది?
ఈ ఏడాది మార్చిలో 22.2 మిలియన్ల మందికి పైగా ఉన్న సబ్స్క్రైబర్స్.. జులై నాటికి 29 మిలియన్లకు చేరుకున్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 30 మిలియన్లకు పైనే ఉండొచ్చని తెలుస్తోంది.
ఓటీటీ పరిస్థితి ఎలా ఉంది?
2012లో కేవలం రెండు యాప్స్ మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 40కి చేరింది. ముందు ముందు మరిన్ని యాప్స్ వచ్చే అవకాశముంది. భారత్‌లో ఓటీటీ వ్యూయర్షిప్ ప్రస్తుతం ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉందని నాస్కామ్ ఇటీవల వెల్లడించింది.
ఏయే యాప్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు?
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌లను వీక్షకులు ఎక్కువ సంఖ్యలో ఉపయోగిస్తున్నారు. దాని తర్వాత పలు ప్రాంతీయ ఓటీటీ యాప్‌లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.
వాటి కోసం ఖర్చు ఎలా?
ఈ యాప్‌ల కోసం సంవత్సర చందాలతో పాటు నెలవారీ చందాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి తగ్గట్లు వారు సంబంధిత యాప్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుని నచ్చిన సమయంలో ఇష్టమైన వీడియోల్ని(సినిమాలు, వెబ్ సిరీస్‌లు etc..) చూడొచ్చు.
ఏ భాష వీడియోల్ని ఎక్కువగా చూస్తున్నారు?
భారతీయుల్లో కేవలం ఏడు శాతం మందే ఇంగ్లీష్ కంటెంట్‌ను వీక్షిస్తున్నారని ఐబీఈఎఫ్ అంచనా వేసింది. మిగిలిన వారందరూ ప్రాంతీయ భాషల వీడియోలనే ఎక్కువగా చూస్తున్నట్లు తెలిపింది. లాక్డౌన్ ప్రభావంతో కేవలం యువతరమే కాకుండా గృహిణులు, వృద్ధులు కూడా ఓటీటీలపై ఇష్టం పెంచుకున్నారు. వారందరూ ఓటీటీలో ప్రాంతీయ భాషలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.
ఓటీటీలపై నిర్మాతల ఆలోచన ఎలా ఉంది?
మొన్న మొన్నటి వరకు థియేటర్లు తెరిచే పరిస్థితి కనిపించకపోవడం వల్ల చాలామంది చిన్న, అగ్ర నిర్మాతలు తమ సినిమాల్ని నేరుగా పలు ఓటీటీ యాప్స్‌లో విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో దక్షిణాది కంటే బాలీవుడ్ చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి!
ఓటీటీల్లో నేరుగా వచ్చిన సినిమాలేంటి?
ఓటీటీల్లో నేరుగా వచ్చిన హిందీ చిత్రాల్లో 'దిల్ బెచారా', 'గులాబో సితాబో', 'శకుంతలా దేవి', 'గుంజన్ సక్సేనా', 'బుల్ బుల్', 'ఖాలీ పీలీ', 'సడక్ 2', 'లక్ష్మి' ఉన్నాయి. మరికొన్ని విడుదలకు సిద్ధమవుతున్నాయి. దక్షిణాది విషయానికొస్తే అగ్రహీరోలు సినిమాలు ఏవి దాదాపుగా రాలేదు. చిన్న చిన్న సినిమాలే ఎక్కువగా ఓటీటీలో విడుదలయ్యాయి.
థియేటర్లు తెరుచుకుంటే ఓటీటీ పరిస్థితి?
దాదాపు 10 నెలల నుంచి ఓటీటీకి బాగా అలవాటు పడిన ప్రజలు.. తిరిగి తెరుచుకున్న థియేటర్లకు మళ్లీ అంతకు ముందులా వెళ్తారా అంటే సందేహమే! ఎందుకంటే ఖర్చు విషయంలో ఓటీటీతో పోల్చితే థియేటర్‌కు వెళ్లడం చాలా ఎక్కువ!
టాలీవుడ్‌కు ఓటీటీతో రిలేషన్ ఎలా ఉంది?
ఈ ఏడాది ఓటీటీలో నేరుగా విడుదలైన వాటిలో దాదాపు అన్ని తక్కువ బడ్జెట్ తెలుగు చిత్రాలే ఉన్నాయి. అగ్రహీరోల సినిమాలను థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు భీష్మించుకు కూర్చున్నారు. ఓటీటీలు భారీ మొత్తంలో ఆఫర్లు ఇచ్చినా సరే వాటిని తిరస్కరించారు. ఈనెల 25 నుంచి సినిమా హాళ్లు తెరుచుకోనుండటం, సంక్రాంతి దగ్గర్లో ఉండటం వల్ల వారిలో కొత్త జోష్ మొదలైంది.
ఇవీ చదవండి:
- 2020.. ఓటీటీ నామ సంవత్సరం!
- ఓటీటీ వేదికలపై వీళ్లే నయా 'గేమ్ ఛేంజర్లు'
- ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు, సిరీస్‌లు.. మీకోసమే
- ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్ కత్తెర సాధ్యమేనా?
- ఓటీటీకే ఓటేస్తున్న అగ్రతారల సినిమాలు!
- ఓటీటీ సర్వీసులపై ఆదా చేసుకోండి ఇలా..
- ఔను.. 'ఓటీటీ'పై మనసు పడుతున్నారు!
- ఓటీటీల్లో రాజ్యమేలుతున్న అలాంటి వెబ్‌సిరీస్‌లు