మీటూ ఆరోపణలు ఎదుర్కొంటోన్న హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టీన్... ఫిర్యాదుదారులతో సుమారు 18.8 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్, షికాగో అటార్నీ ఎలిజబెత్ ఎ.ఫెగన్ ప్రకటించారు.
ఈ ఒప్పందాన్ని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తులు ఆమోదిస్తే.. 18.8 మిలియన్ డాలర్లలో బాధితులు ఒక్కొక్కరు సుమారు 7,500-750,000 డాలర్ల వరకు పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ పరిష్కారం వీన్‌స్టీన్‌పై మీటూ ఉద్యమంతో కొన్ని సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తోన్న వారందరి కష్టానికి ప్రతిఫలమని షికాగో అటార్నీ ఎలిజబెత్ పేర్కొన్నారు. తన యజమాని ద్వారా లైంగిక వేధింపులు, వివక్ష, ప్రతీకారానికి గురైన ప్రతి మహిళకు ఇది విజయమేనని చెప్పారు.
" అన్యాయాన్ని బయటపెట్టినప్పుడే నాకు తెలుసు న్యాయం నేరుగా దొరకదని. దశాబ్దాలుగా నేరాన్ని అంగీకరించేందుకు హార్వే నిరాకరించాడు. మోసాన్ని దాచేందుకు తన అధికారాన్ని ఉపయోగించాడు. అతని బారిన పడి అన్యాయానికి గురైన వారికి సరైన న్యాయం జరిగేలా చూడాలని నేను అప్పుడే నిర్ణయించుకున్నా. "
- కైట్లిన్ దులానీ, బాధితురాలు
అయితే.. కొందరు బాధితుల తరఫు న్యాయవాదులు మాత్రం ఈ ఒప్పందాన్ని తప్పుపట్టారు. ప్రతిపాదిత పరిష్కారం వీన్‌స్టీన్ బాధితులను పూర్తిగా అమ్మేయటమేనని పేర్కొన్నారు. ఇది పూర్తిగా అన్యాయమైన చర్య అని అభిప్రాయపడ్డారు.
23 ఏళ్ల జైలు శిక్ష..
మీటూ ఆరోపణల్లో భాగంగా గత నెల 11న హార్వేకు 23 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇతడు దాదాపు 90 మంది మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2013లో న్యూయార్క్ నగరంలోని ఓ హోటల్లో ఓ నటిపై అత్యాచారం, 2006లో మిమి హలేయీపై లైంగిక దాడుల కేసుల్లో ఇతడిని దోషిగా తేల్చింది కోర్టు. శిక్ష వేసిన వారం రోజులకు సిటీ ప్రిజన్ రైకర్స్ ఐలాండ్ జైలుకు తరలించారు. ఆ తర్వాత కొద్దిరోజులకు హార్వేకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
ఇవీ చూడండి: