వెండితెరపై మరో ఆసక్తికర చిత్రానికి రంగం సిద్ధమవుతోంది. ఇటీవలే 'ఉరీ' చిత్రంలో భారత జవాన్లు చేసిన మెరుపు దాడులను కళ్లకు కట్టినట్లు చూపించారు. జమ్ము కశ్మీర్ బాలాకోట్‌లో ఫిబ్రవరిలో జరిగిన ఉగ్రదాడుల ఆధారంగా ఇప్పుడు ఓ సినిమా రానుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ కథపై పూర్తి హక్కుల్ని సొంతం చేసుకున్నాడు.
'బాలాకోట్- ద ట్రూ స్టోరీ' అనే టైటిల్‌తో రానున్న ఈ చిత్రాన్ని... తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ప్రారంభంకానుంది. జమ్ముకశ్మీర్, దిల్లీ, ఆగ్రా తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరపుకోనుంది. ఇందులోని నటీనటుల పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
అభినందన్ పాత్ర..
బాలాకోట్ దాడుల్లో భాగంగా పాక్ విమానాలను తరిమికొట్టే ప్రయత్నంలో విమానం కూలి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పడ్డారు భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్. అప్పుడు పాక్ సైనికులు ఆయనను బందీగా తీసుకున్నారు. మూడు రోజులు శత్రువుల చెరలో ఉన్నప్పటికీ ఏ క్షణంలోనూ ధైర్యాన్ని వీడని అభినందన్ తెగువను ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నారు.
ఈ సినిమా గురించి మాట్లాడిన వివేక్ ఒబెరాయ్... ఓ భారతీయుడిగా ఈ కథను తెరకెక్కించడం తన బాధ్యతని చెప్పుకొచ్చాడు.
"భారతీయుడిగా, దేశభక్తి కలిగిన వ్యక్తిగా మన సాయుధ బలగాల శక్తి సామర్థ్యాలను... ప్రజలకు చాటి చెప్పడం నా బాధ్యత. అభినందన్ లాంటి ధైర్యమైన అధికారులను, మన సైన్యం సాధించిన విజయాలను ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. పుల్వామా దాడి నుంచి బాలాకోట్ దాడుల వరకు ప్రతి విషయాన్ని... నేను వార్తల్లో చూసి తెలుసుకున్నాను. ఆ సమయంలో వెలువడ్డ అనేక ఊహాగానాలకు ఈ చిత్రం సమాధానమిస్తుంది. మాపై నమ్మకం ఉంచి సినిమా చేసేందుకు అనుమతిచ్చిన వాయుసేనకు కృతజ్ఞతలు. ఈ కథకు పూర్తి న్యాయం చేస్తామని విశ్వాసంగా ఉన్నాం" --వివేక్ ఒబెరాయ్, బాలీవుడ్ నటుడు
ఇటీవల మోదీ బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు వివేక్ ఒబెరాయ్. ఈ కొత్త చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
ఇది చదవండి: 'మొక్కలు నాటి... అమెజాన్ అడవులకు ఊపిరిపోద్దాం'