విజయ్ సేతుపతి ఒకేరోజు రెండు సినిమాల కబుర్లు వినిపించారు. ఆ వివరాల్లోకి వెళితే.. వెట్రిమారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా 'విడుదలై' పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సంచలన విజయం సాధించిన అసురన్ తర్వాత వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈసారి మరో భిన్నమైన కథతో అనూహ్యమైన మలుపులు, థ్రిల్లింగ్ అంశాలతో 'విడుదలై' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు వెట్రిమారన్. విద్యుత్తు, టెలిఫోన్ లాంటి సౌకర్యాలు అందుబాటులో లేని దట్టమైన అడవుల్లో, గిరిజన ప్రజలతో కలిసి నివసిస్తూ ఈ సినిమాని చిత్రీకరించారు. నిర్మాత ఎల్‌రెడ్ కుమార్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మరో కబురు ఏమిటంటే.. విజయ్ సేతుపతి హీరోగా నటించిన తమిళ చిత్రం తుగ్లక్ దర్బార్ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. రాజకీయం నేపథ్యంలో తెరకెక్కిన తుగ్లక్ దర్బార్‌ను కరోనా కారణంగా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం స్పష్టం చేసింది.