ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల జయంతి వేడుకలు గురువారం.. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆమె కాంస్య విగ్రహాన్ని సూపర్‌స్టార్ కృష్ణ, గిన్నిస్ రికార్డ్ ఫలకాన్ని హీరో మహేశ్‌బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటే కృష్ణ, నరేశ్, మహేశ్ దంపతులు, హీరో సుధీర్‌బాబు, ఎంపీ గల్లా జయదేవ్, ఇతర కుటుంబ సభ్యులతోపాటు కృష్ణంరాజు దంపతులు, పరిచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా మహేశ్ బాబు మాట్లాడుతూ విజయనిర్మల గొప్ప వ్యక్తి అని అన్నారు.
"నాకు తెలిసింత వరకూ విజయనిర్మల గొప్ప వ్యక్తి. నా సినిమాలు విడుదలైనప్పుడు మార్నింగ్ షో చూసి నాన్న నాకు ఫోన్ చేసి అభినందించేవారు. ఆ సమయంలో నాన్న తర్వాత ఆమె నాతో మాట్లాడి అభినందించేవారు. 'సరిలేరు నీకెవ్వరు' విడుదలైన రోజు నాన్న ఫోన్ చేసి అభినందించారు. వెంటనే నేను ఆమె మాట్లాడుతుందని అనుకున్నాను. ఆ తర్వాత ఆమె లేదని గుర్తుకు వచ్చింది. వెంటనే తేరుకున్నాను. ఆమె లేని లోటు మాలో ఉండిపోయింది. ఆమెను మేం మిస్ అవుతున్నాం. ప్రతిఏటా ఆమె పుట్టినరోజును ఘనంగా నిర్వహించేవాళ్లం. ఈ ఏడాది విగ్రహావిష్కరణతో ఆమెకు మేము ఇస్తున్న చిన్న నివాళి"
-మహేశ్, కథానాయకుడు
ఇదీ చూడండి : మీసాల కృష్ణుడు సతీమణి నిర్మలమ్మ సినీ ప్రస్థానం