బాలీవుడ్ దిగ్గజ నటి సైరా భాను తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రక్త పోటు, షుగర్ లాంటి వృద్ధాప్య సంబంధింత రుగ్మతలతో ముంబయిలోని హిందూజా ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం ఆమె చేరారు. అయితే ఆరోగ్యం మెరుగవ్వకపోవడం వల్ల ఆమెను ఐసీయూలో ఉంచినట్లు వైద్యులు తెలిపారు.
ఈ క్రమంలో సైరా భానుకు సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది హిందూజా ఆస్పత్రి వైద్య బృందం.
"లో బీపీతో మూడు రోజు క్రితం ఆమె ఆస్పత్రిలో చేరారు. సైరా ఆరోగ్యం ప్రస్తుతం స్థిమితంగా ఉంది. ఎలాంటి అందోళన అవసరం లేదు."
- హిందూజా ఆస్పత్రి వైద్యులు
సైరాభానుకు కరోనా పరీక్షలు కూడా చేసినట్లు వైద్యులు తెలిపారు. నెగిటివ్‌గా నిర్ధరణ అయినట్లు వెల్లడించారు. అంతా బాగుంటే రెండు రోజుల్లో ఆమె డిశ్చార్జ్ కావొచ్చుని చెప్పారు.
సైరా భర్త, మొదటి తరం బాలీవుడ్ స్టార్ దిలీప్ కుమార్ జులై 7న మరణించారు. అప్పటి నుంచి సైరాభాను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.
ఐసీయూలో చికిత్స పొందుతున్న సైరాభాను త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.