యాక్షన్‌తో పాటు కామెడీ కూడా చేసే అతికొద్ది మంది కథానాయకుల్లో అగ్ర కథానాయకుడు వెంకటేశ్ ముందు వరుసలో ఉంటారు. సరైన పాత్ర పడితే, ఆయన కామెడీ టైమింగ్‌ను ఎవరూ అందుకోలేరు. అలా ఆయన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అలాంటి వాటిలో 'నువ్వు నాకు నచ్చావ్' ఒకటి. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతోనే ఆర్తి అగర్వాల్ కథానాయికగా పరిచయం అయింది. ఈ సినిమా విడుదలై నేటికి(సెప్టెంబరు 6) 20 ఏళ్లు.
కథేంటంటే: ఉద్యోగం కోసం తండ్రి శేఖరం(చంద్రమోహన్) స్నేహితుడైన మూర్తి (ప్రకాశ్‌రాజ్) ఇంటికి వస్తాడు వెంకీ అలియాస్ వెంకటేశ్వర్లు. అదే సమయంలో మూర్తి కుమార్తె(నందు)కు అమెరికా కుర్రాడితో నిశ్చితార్థం జరుగుతుంది. అది సజావుగా సాగడంలో వెంకీ వాళ్లకు సహాయపడతాడు. ఆ తర్వాత వెంకీకి మూర్తి ఒక ఉద్యోగం చూపిస్తాడు. ఇక గొడవలతో ప్రారంభమై వెంకీ, నందులు స్నేహితులవుతారు. ఒకరినొకరు అభిమానించుకోవడం మొదలవుతుంది. వెంకీకి నందు తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. కానీ తమ కుటుంబాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా , కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్లను వదిలి వచ్చేయాలనుకుంటాడు వెంకీ. అయితే రైల్వే స్టేషను దాకా వెళ్లిన వెంకీని మూర్తి నచ్చజెప్పి మళ్లీ ఇంటికి తీసుకుని వస్తాడు. అయితే నందు మాత్రం తనకు చెప్పకుండా వెంకీ వెళ్లిపోయినందుకు అతనితో మాట్లాడదు. అయితే ఒక పెళ్లిలో మళ్లీ ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత అందరూ కలిసి వాటర్ వరల్డ్‌కి వెళతారు. అక్కడ బ్రహ్మానందం(ఫొటోగ్రాఫర్) వెంకీ, నందూ చేతులు కలిపి ఉండగా ఒక ఫొటో తీస్తాడు. ఆ ఫొటో నందూ పెళ్లి సమయంలో పెళ్లి కొడుక్కి చేరుతుంది. దాంతో వాళ్లు నందు శీలాన్ని అవమానించి పెళ్లి పందిరి నుంచి వెళ్లిపోతుంటారు. అయితే ఎలాగైనా పెళ్లి జరిపించాలని వెంకీ వాళ్లను బ్రతిమాలుకుంటాడు. అదే సమయానికి మూర్తి అక్కడికి వస్తాడు. వెంకీ పెద్ద మనసును గమనించి నందును అతనికిచ్చి పెళ్లి చేయటంతో కథ సుఖాంతమవుతుంది.
తెర వెనుక జరిగింది ఇదీ: 'నువ్వేకావాలి' ఇచ్చిన విజయంతో కె.విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ కాంబోతో మరో సినిమా ప్లాన్ చేశారు నిర్మాత స్రవంతి రవికిషోర్. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా కథ చెప్పమని అడిగితే, 'నువ్వు నాకు నచ్చావ్' వినిపించారు. ఇది కూడా తరుణ్‌తోనే తీస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. అయితే, కాస్త కామెడీ టైమింగ్, ఎమోషనల్ సబ్జెక్ట్ కావటం వల్ల మరో హీరోతో ప్రయత్నిద్దామనుకున్నారు. అదే సమయంలో నిర్మాత సురేశ్‌బాబు స్రవంతి రవికిషోర్‌కు ఫోన్ చేసి వెంకటేశ్ డేట్స్ ఉన్నాయని చెప్పారు. దీంతో దర్శకుడు విజయ్ భాస్కర్, రచయిత త్రివిక్రమ్‌లు వెంకటేశ్‌ను కలిసి కథ వినిపించారు. ఆయనకు కూడా నచ్చడం వల్ల సినిమా పట్టాలెక్కింది. అప్పటికీ కుటుంబ కథా చిత్రాలతో పాటు, మాస్ ఆడియన్స్‌ను అలరించేలా వెంకీ సినిమాలు ఉండటం మూలంగా పూర్తి హాస్యభరిత చిత్రమంటే ఒకరకంగా సాహసమనే చెప్పాలి. ఇక కథానాయికగా త్రిష, గజాలా పేర్లు వినిపించాయి. కానీ, ఒక హిందీ సినిమా చేసిన ఆర్తి అగర్వాల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కథానాయిక తండ్రి పాత్ర కోసం నాజర్ అయితే బాగుంటుందని దర్శకుడు విజయ్ భాస్కర్ సూచించారు. కానీ, స్రవంతి రవికిషోర్ మాత్రం ప్రకాశ్‌రాజ్‌ను తీసుకుందామని గట్టిగా పట్టుబడ్డారు. అదే సమయంలో ఆయనపై నిషేధం ఉండటం వల్ల ప్రకాశ్‌రాజ్ లేకుండా ఉన్న పార్ట్‌ను పూర్తి చేశారు. ప్రకాశ్‌రాజ్‌పై నిషేధం ఎత్తివేసిన మరుక్షణం 'నువ్వునాకు నచ్చావ్'లో ఆయన సన్నివేశాలు తీశారు. అదే విధంగా వాటర్ వరల్డ్‌లో బ్రహ్మానందం పాత్ర కూడా లేదు. వెంకటేశ్ సూచనల మేరకు ఆయన పాత్రను రాసుకున్నారు. అందుకు మిస్టర్ బీన్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారు.
ఎవర్‌గ్రీన్ టెక్నికల్ టీమ్: ఈ సినిమాలో నటీనటులు ఎంత బాగా చేశారో.. అంతకుమించి సాంకేతిక బృందం కష్టపడింది. దర్శకుడు కె.విజయ్ భాస్కర్ టేకింగ్, త్రివిక్రమ్ రచన సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి. కోటి అందించిన సంగీతం, పాటలు ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. కె.రవీంద్రబాబు ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా చూపించారు. సినిమా బాగుంటే మూడు గంటలు ఉన్నా హాయిగా చూస్తారనడానికి 'నువ్వు నాకు నచ్చావ్' ఒక నిదర్శనం.
సెప్టెంబరు 6, 2001లో విడుదలై 'నువ్వు నాకు నచ్చావ్' బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. వెంకటేశ్ కామెడీ టైమింగ్, ఆర్తి అగర్వాల్ అందం, బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్, ఎం.ఎస్.నారాయణల సన్నివేశాలు విపరీతంగా నవ్వులు పంచాయి. కుటుంబ ప్రేక్షకులు థియేటర్‌కు క్యూ కట్టారు. ఒక్కొక్కరూ రెండు, మూడు సార్లు సినిమా చూశారంటే అతిశయోక్తి కాదు. 93 సెంటర్‌లలో 50 రోజులు, 57 సెంటర్‌లలో 100 రోజులు, మూడు కేంద్రాల్లో 175 ఆడి ఆ సమయానికి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది.
త్రివిక్రమ్ కామెడీ పంచ్‌లకు జనాలు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ప్రకాశ్‌రాజ్ కుటుంబం అంతా భోజనానికి కూర్చొన్న సమయంలో దేవుడిపై వెంకటేశ్ చేసే ప్రార్థన.. ఆ తర్వాత అమ్మపై ప్రకాశ్‌రాజ్ చదివే కవిత ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. టీవీలో ఎప్పుడు ప్రసారమైనా బోరు కొట్టని సినిమాల జాబితాలో 'నువ్వు నాకు నచ్చావ్' ఉంటుంది.
" దేవుడా ఓ మంచి దేవుడా..!
నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పిచ్చావ్
బంగాళ దుంప ఫ్రై ఇచ్చావ్..
చారు కూడా ఇచ్చావ్..
ఇలాగే మన స్టేట్ లో ఉన్న
ఏడు కోట్ల మందికి కూడా ఇవ్వాలి..
అలాగే మన కంట్రీలో ఉన్న
తొంబై కోట్ల మందికి
అదే చేత్తో ప్రపంచంలో ఉన్నా..
హ్..నాకు నెంబర్ కరెక్ట్ గా తెలీదు..
ఎంతమందుంటే వాళ్లందరికీ కూడా
ఇదే భోజనం ఇస్తావని..
హా..అంటే.. యాజ్ ఇట్ ఈజ్‌గా ఇదే కాదు
వాళ్ళు ఏం తింటే అది..
బ్రెడ్డు, బటరు, జాము అలాగన్న మాట
అలా ఇస్తావని కోరుకుంటున్నాను..
నువ్విస్తావు నాకు తెలుసు..
ఎందుకంటే బేసికల్లీ యు ఆర్ గాడ్.. యు ఆర్ వెరీ గుడ్ గాడ్
ప్రార్థన మీ అందరికి
కొంచెం కొత్తగా అనిపించొచ్చు" అని వెంకటేశ్ అనగానే అమ్మపై ప్రకాశ్‌రాజ్ కవిత ఇలా చెప్పుకొస్తారు..
"అమ్మా! అడక్కుండానే జన్మనిచ్చావ్. ఏడిస్తే పాలిచ్చావ్...వానోస్తే గొడుగు ఇచ్చావ్.. ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చావ్.. వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావ్.. వేసుకోవడానికి బట్టలు ఇచ్చావ్.. చూసుకోవడానికి అద్దం ఇచ్చావ్.. రాసుకోవడానికి పలకనిచ్చావ్.. గీసుకోవడానికి గడ్డం ఇచ్చావ్.. అందుకే.. అందుకే.. నువ్వు నాకు నచ్చావ్.. కానీ, ఎందుకమ్మా ఇంత ఎర్లీగా చచ్చావ్.. అయినా, నువ్వు నాకు నచ్చావ్.."
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: South indian movies on OTT: ఓటీటీల వైపు దక్షిణాది స్టార్ హీరోలు..