గతేడాది 'గద్దలకొండ గణేష్'గా ప్రేక్షకులను అలరించాడు మెగాహీరో వరుణ్ తేజ్. ప్రస్తుతం బాక్సర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇందులో వరుణ్.. ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అందుకోసం ముంబయిలో ఫిట్నెస్ ట్రైనర్ రాకేష్ ఉడయార్, ప్రముఖ బాక్సర్ నీరజ్ గోయత్ల వద్ద రెండు వారాలుగా శిక్షణ తీసుకుంటున్నాడీ మెగా హీరో.
ఈ సందర్భంగా బాలీవుడ్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగా ... షారుక్ ఖాన్‌కు తను పెద్ద అభిమానినని అన్నాడు. "ఓసారి షారుక్.. చరణ్ ఇంటికి వచ్చారు. కానీ, నేను అతడిని దూరం నుంచి చూస్తూ ఉండిపోయాను. షారుక్‌తో కాఫీ తాగుతూ మాట్లాడాలనిపించింది. అతడి నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఓ విధంగా చెప్పాలంటే అతడితో కలిసి పని చేయాలని ఉంది. అయినా అలా ఎవరికి ఉండదు" అని చెప్పుకొచ్చాడు.
"నాకు ఇప్పటికీ బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. షెడ్యూల్ సహకరించక కొన్ని, కథలు నచ్చక మరికొన్ని చిత్రాలకు నో చెప్పా. నాకు బాలీవుడ్ చిత్రాలలో నటించడమంటే చాలా ఆసక్తి. కంటెంట్ బాగుంటే ఏ భాషలోనైనా నటిస్తాను. మంచి కథలకు భాషా, ప్రాంతీయ భేదాలు అడ్డురావు అనటానికి 'బాహుబలి' ఓ ఉదాహరణ" అని వరుణ్‌తేజ్ అన్నాడు.
ఇదీ చూడండి.. తెలుగులో ఓ రోజు ముందుగా 'బ్లాక్ విడో' సర్ప్రైజ్