తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోల మధ్య సత్సంబంధాలు మరింత బలపడ్డాయి. ఒకరి సినిమా ప్రమోషన్ల వేడుకలకు మరొకరు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం మరో ట్రెండ్ స్టార్టయింది. అదే ఒక హీరో సినిమా కోసం మరొకరు విడుదల తేదీని త్యాగం చేయడం. ఇటీవల సాహో సినిమా కోసం విడుదలను వాయిదా వేసుకున్నాడు నాని. తాజాగా నేచురల్ స్టార్ సినిమాకు దారిచ్చాడు వరుణ్ తేజ్.
సెప్టెంబరు 13న 'గ్యాంగ్ లీడర్', 'వాల్మీకి' ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే వరుణ్‌తేజ్ సినిమా నిర్మాతలు మనసు మార్చుకున్నారు. నాని సినిమా కోసం సెప్టెంబరు 20వ తేదీకి విడుదలను మార్చుకున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే నాయిక. హరీష్ శంకర్ దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.
మంగళవారం హైదరాబాద్‌లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో 'వాల్మీకి' కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొనే కొత్త సంప్రదాయంపై దిల్‌రాజు స్పందించాడు.
" ఒకేరోజు రెండు సినిమాలు విడుదల అవ్వడం మంచి పద్ధతి కాదని.. రెండు చిత్రాలూ నష్టపోకుండా నిర్మాతలిద్దరూ మాట్లాడుకుని ఈ నిర్ణయం తీసుకోవడం మంచి సంప్రదాయం ".
-- దిల్‌రాజు, సినీ నిర్మాత
పండగ రోజులు మినహా మిగతా రోజుల్లో సినిమాల మధ్య ఈ తరహా పోటీ మంచిది కాదని ప్రొడ్యూసర్ గిల్డ్ సభ్యులు కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. అయితే విడుదల తేదీ మార్చుకోమని గిల్డ్ ఎవ్వరినీ బలవంతం చేయదని స్పష్టం చేశారు. ఈ కార్య క్రమంలో గోపీ ఆచంట, రామ్ ఆచంట, నవీన్ ఎర్నేని, దామోదర ప్రసాద్, రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి...'ఎవరు' ట్రైలర్ లాంచ్‌లో 'గ్యాంగ్‌లీడర్'