"ఒక ప్రేక్షకుడిగానూ.. ఒక పంపిణీదారుడిగానూ 'తొలిప్రేమ' సినిమాను ఎంతగానో ఆస్వాదించా. ఆ సినిమా నుంచే పవన్‌కల్యాణ్‌పై అభిమానం నా గుండెల్లో అలా ఉండిపోయింది. నేను నిర్మాతనైతే ఈయనతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరింది" అన్నారు దిల్‌రాజు. నిర్మాతగా యాభై సినిమాల మైలురాయిని చేరుకున్నారు. ఇటీవల శిరీష్‌తో కలిసి ఆయన నిర్మించిన చిత్రం 'వకీల్‌సాబ్'. పవన్ కల్యాణ్ కథానాయకుడు. ఇది శుక్రవారం విడుదలవుతోన్న సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మీడియాతో ముచ్చటించారు.
"హీరో డేట్లు ఉన్నాయనో.. దర్శకుడు ఓ కథ చెప్పాడనో.. నేనెప్పుడూ సినిమాలు చేయను. స్టార్ కథానాయకుడితో ఫక్తు వాణిజ్య సినిమా చేయడం కంటే, అందులో ఓ ఆత్మ ఉండాలనుకుంటా. అలా నా కలల హీరో పవన్‌కల్యాణ్‌తో 'వకీల్‌సాబ్' లాంటి బలమైన ఆత్మ ఉన్న సినిమా చేయడం నాకు బోనస్. ఇలాంటి కథ దొరకడం నా అదృష్టం. పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయాలనే నా కల నెరవేరింది. దాంతో నిర్మాతగా ఎంతో సంతృప్తి ఉంది. ఇక విజయాన్ని ఆస్వాదించడమే మిగిలి ఉంది. చాలా వేగంగా సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నాం. కరోనాతో ఏడాది ఆలస్యమైంది. అయినాలో మాలో అదే ఉత్సాహం. పవన్‌కల్యాణ్‌ను ఈ రోజూ కలిశా. ఆయనతో నా ప్రయాణం మరో స్థాయికి వెళ్లింది. 'వకీల్‌సాబ్' తర్వాతా మా ప్రయాణం కొనసాగుతుంది".
- దిల్‌రాజు, నిర్మాత
* "ప్రతి స్టార్ కథానాయకుడికీ ఓ ఇమేజ్, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. పవన్‌కల్యాణ్‌కూ ఓ స్టైల్ ఉంది. ఈ కథను ఆయన చేస్తేనే మజా వస్తుందనుకున్నాం. అయితే 'పింక్' రీమేక్‌లో పవన్‌కల్యాణ్ నటిస్తున్నారనగానే చాలా మంది చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇంత సున్నితమైన కథ ఎందుకు అన్నవాళ్లూ ఉన్నారు. కానీ మేం ఈ కథను చూసిన విధానం వేరు. కథకు ఎలాంటి అంతరాయం కలగకుండా, అదే సమయంలో సాధారణ ప్రేక్షకులు సినిమాను ఆద్యంతం ఆస్వాదించేలా చేశాం. దర్శకుడు శ్రీరామ్ వేణు ఎంతో హోమ్ వర్క్ చేసి, ఓ ఫార్ములా రాసుకుని అందుకు అనుగుణంగా చేశారు. నేను ఊహించనంత గొప్పగా 'వకీల్‌సాబ్' చిత్రాన్ని చేసిన తనకు వందకి వంద మార్కులు పడతాయి".
"స్టార్ కథానాయకులు సినిమాలు చేస్తున్నప్పుడు చిత్రీకరణ సమయంలో సమస్యలు వస్తుంటాయి. వాళ్లపై ఒత్తిడి పడకుండా.. జాగ్రత్తలు తీసుకోవడమనేది నిర్మాతలుగా మాకు ఎదురయ్యే ఓ పెద్ద సవాల్. నాకు సినిమాపై ఉన్న తపన గురించి వేరొకరు చెప్పడం వేరు, దాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా చూడటం వేరు కదా. ఈ ప్రయాణంలో మా పనితీరు దగ్గర్నుంచి చూశారు. అందుకే మాతో ముందే సినిమా చేసుంటే బాగుండేదని ఆయన ముందస్తు విడుదల వేడుకలో చెప్పారు. ఆయనతో తదుపరి సినిమా గురించి తొందర పడటం లేదు. మంచి కథ కుదిరినప్పుడు కచ్చితంగా ఉంటుంది".
* "సినిమా చాలా మారిపోయింది. విడుదలకు నాలుగు రోజుల ముందే దాని భవితవ్యం ఏమిటో తెలిసిపోతోంది. కొంచెం సినిమాలోని ముడి సరుకుని చూపించి, ప్రేక్షకుల్ని ఉత్సాహ పరిస్తే చాలు.. వాళ్లు అందులో ఏముందో పసిగట్టేస్తున్నారు. ఆన్‌లైన్ బుకింగ్స్‌తోనే ఆ సినిమా ఎలా ఉండనుందో చెప్పేస్తున్నారు. అమెరికా మొదలుకొని మన రాష్ట్రాల్లోని చిన్న పట్టణాల వరకు 'వకీల్‌సాబ్' సినిమాపై ప్రత్యేకమైన క్రేజ్ కనిపిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా ఓ మేజిక్ చేస్తుందని మాత్రం చెబుతా".
* "మన రాష్ట్రాల్లో కరోనా నియంత్రణలోనే ఉంది కాబట్టి.. ఇప్పట్లో 50 శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు చేయాలనే నిబంధనలు విధించే పరిస్థితి లేదు. భవిష్యత్తులో తెలియదు. మా సంస్థలో ప్రస్తుతం 'ఎఫ్3', 'థ్యాంక్యూ', 'పాగల్', 'రౌడీ బాయ్స్' చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. బాలీవుడ్‌లో 'జెర్సీ', 'హిట్' సినిమాల్ని రీమేక్ చేస్తున్నాం. అల్లు అర్జున్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ఆ సినిమాను అల్లు అర్జునే ప్రకటిస్తారు. రామ్‌చరణ్ - శంకర్ కలయికలో సినిమా జులైలో చిత్రీకరణ మొదలవుతుంది".
ఇదీ చూడండి: 'ఈ సినిమా తర్వాత బన్నీని 'పుష్ప' అంటారు!'