పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనన్య నాగళ్ల ఓ కీలక పాత్రలో నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. ఇందులో అంజలి, నివేదా థామస్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా ఏప్రిల్ 9న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న అనన్య నాగళ్ల తనకు ఆ సినిమా అవకాశం ఎలా వచ్చింది, తన పాత్రేమిటి, సెట్‌లో పవన్ ఎలా ఉండేవారు తదితర విషయాలపై మాట్లాడారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చింది?
ముందుగా దర్శకుడు వేణు శ్రీరామ్ నన్ను సంప్రదించారు. నేను అప్పటికే 'మల్లేశం' చిత్రంలో నటించాను. నెట్‌ఫ్లిక్స్‌లో ఆ సినిమా చూసిన వేణు సర్, ఈ అమ్మాయి అయితే ఈ పాత్రకి సరిపోతుందనుకుని ఫోన్ చేశారు. ఆ తర్వాత ఆడిషన్స్ జరిగాయి. నా నటన, డబ్బింగ్ చూసి ఓకే చేశారు.
ఈ చిత్రంలో మీ పాత్ర ఎలాంటిది?
ఇందులో నా పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది. మధ్యతరగతికి చెందిన ఓ సాధారణ అమ్మాయిని. మన మధ్య తిరిగే ఓ ముగ్గురు అమ్మాయిల్లో ఒకరికేమైనా అయితే ఎలా స్పందిస్తామో, ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందనేదే కథ. కాబట్టి నా పాత్ర ప్రేక్షకుల సానుభూతిని పొందేలా ఉంటుంది.
పవన్ కల్యాణ్‌తో నటించడం ఎలా అనిపించింది?
మొదట ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చిందంటే నమ్మబుద్ధి కాలేదు. ఏదైనా ఊహించని సంతోషకరమైన వార్త వింటే ఎలా ఆశ్చర్యానికి గురవుతామో అలాగే నాకూ జరిగింది. చిత్రసీమలో ఎన్నో చూశా. కానీ, ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు.. షూటింగ్ మొదలయ్యే వరకు నిజంగా అది జరుగుతుందా అనిపిస్తుంది. కానీ రెండు మూడు రోజుల తర్వాత అది వాస్తవమే అనిపించింది. చాలా సంతోషించాను.
ఆడిషన్స్ చేసేటప్పుడు పవన్ కల్యాణ్ నటిస్తున్నారని తెలుసా?
మొదట్లో ఆడిషన్స్‌లో దర్శకుడు వేణు సర్‌ను అడిగా.. 'ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారా?' అని. 'మీకు తెలియదా?' అని అడిగారాయన. 'లేదండి' అని చెప్పా.
సెట్స్‌లో పవన్ నుంచి ఏం నేర్చుకున్నారు?
సెట్లో ఎప్పుడూ చాలా సరదా వాతావరణం ఉండేది. ఆయన్నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయన మాట్లాడేటప్పుడు ఏ విషయంపైన అయినా చాలా లోతుగా చర్చిస్తారు. మా షూటింగ్ జరుతున్నప్పుడు ఆంధ్రాలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటనపై పవన్ పోరాటం చేశారు. ‘దిశ’లాంటి కేసు గురించి మాతో చాలా డీప్‌గా చర్చించారు. ఇలా ఆయనతో కొన్ని విషయాలపై చర్చించాం. ఇవన్నీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
మీ తోటి నటీమణులు నివేదా థామస్, అంజలి గురించి చెప్పండి..
నివేదా, అంజలిలతో పోల్చుకుంటే నా సినీ అనుభవం చాలా తక్కువ. వారి నుంచి చాలా నేర్చుకున్నా. పోటీగా మాత్రం భావించలేదు. అంజలి చాలా సరదాగా ఉంటుంది. సెట్లోకి వచ్చిందంటే ఇక సందడే సందడి. నివేదా నుంచి నేర్చుకోవడానికి చాలా అవకాశం కలిగింది. వీరిద్దరూ నాకెంతో అండగా నిలిచారు.
మొదట్లో పవన్‌తో నటించేటప్పుడు ఏమనిపించింది?
షూటింగ్ మొదట్లో పవన్‌తో ఏమీ మాట్లాడలేదు. నాలుగో సెషన్ వచ్చినప్పుడు దగ్గరగానే కూర్చున్నాం. అప్పుడు నేను సౌకర్యంగా లేననిపించింది పవన్‌కి. ఇది గమనించిన ఆయన నాతో 'నిన్ను మల్లేశంలో చూశాను' అని చెప్పారు. ఏం చదివారు? ఎక్కడి నుంచి వచ్చారు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత నేను పవన్ సర్‌తో సరదాగా కలిసిపోయాను. ఇక సెట్లో ప్రకాష్ రాజ్, అంజలి ఉంటే ఒకటే సరదా.
సెట్లో మీ నటన గురించి పవన్ మెచ్చుకున్నారా?
ఈ చిత్రంలో పవన్, ముగ్గురు అమ్మాయిల మధ్య కొన్ని సన్నివేశాలు ఉంటాయి. ఆయన కోర్టు సీన్‌లో ఉన్నప్పుడు మొదట నాతోనే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ సీన్స్‌లో ఇద్దరిపైనే కెమెరా క్లోజప్ షాట్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆ సన్నివేశాల్లో నటించాను. ఆ సందర్భంలో ఆయన 'నీ పాత్రలో చాలా ఎమోషన్ ఉంది. వాటిని ఎలా చేయగలుగుతున్నావ్?' అంటూ మెచ్చుకున్నారు.
మీరు నటించిన రెండు సినిమాలు రీమేక్. వాటి మాతృక చిత్రాలు ఏమైనా చూశారా?
ఆ సినిమాలు చాలా భిన్నమైనవి. చూసి చేసే విధంగా ఏమీ ఉండవు. 'పింక్' చిత్రాన్ని థియేటర్‌లోనే చూశాను.
కెరీర్ మొదట్లోనే మంచి ఛాలెంజింగ్ పాత్రలు వస్తున్నాయి. ఎలా అనిపిస్తోంది?
చాలా అదృష్టవంతురాలిని. ఎందుకంటే నేను ఇప్పుడు సరైన సమయంలో సరైన చోటనే ఉన్నాను. 'వకీల్ సాబ్'లో అవకాశం నేను కోరుకుంటే వచ్చింది కాదు. అనన్య ఒక పాత్ర చేస్తుందంటే బాగా చేసిందనిపించుకునేలా ఉండాలనుకుంటా.
తెలుగమ్మాయిలు రాణించడం చాలా కష్టమంటారు? దీనిపై మీ అభిప్రాయం?
తెలుగమ్మాయిలు నటనలో సహకరించరనే దురభిప్రాయం ఎందుకనో చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉంది. అలా అనుకోవడం వల్లే తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం లేదనుకుంటా. కానీ, అంతకు మించి ఇక్కడ మరెలాంటి సమస్యలూ లేవు.
తెలుగమ్మాయిలు అన్ని పాత్రలు చేయలేరనే అపోహ ఉంది?
నాకు నచ్చిన పాత్రయితే, నటించగలననుకుంటే తప్పకుండా చేస్తాను. ఆ పాత్రకు నేను సరిగ్గా సరిపోతాననిపిస్తే మరో ఆలోచన లేకుండా చేస్తాను.
'వకీల్ సాబ్' సమాజం మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది?
ఈ సినిమా సమాజం మీద ప్రభావం చూపించాలనుకుంటున్నా. మన కన్నా ముందుతరాలు, మా అమ్మానాన్నల తరంవాళ్లు ఆడపిల్లలంటే ఇలా ఉండాలి, అబ్బాయిలు అలా ఉండాలనుకునేవారు. కానీ మా తరం అలా కాదు. ఎవరికి తోచిన విధంగా వారు ఉంటే చాలనుకుంటున్నాం. అందుకే ఇప్పుడు ఇలాంటి చిత్రాలు రావాలి. అబ్బాయిలను మంచిగా పెంచాలి. అమ్మాయిలకు జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అబ్బాయిలకు కూడా అమ్మాయిల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాల్సి ఉంటుంది.
నిజ జీవితంలో మీరేమైనా ఈ సినిమాలో ఉన్నటువంటి అనుభవాలు ఎదుర్కొన్నారా?
నా నిజ జీవితంలో ఎలాంటి సంఘటనలూ లేవు. కానీ ఆలోచిస్తుంటే మన చుట్టూ ఇలాంటివి జరుగుతుంటాయా అనిపిస్తోంది.
ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడుతున్నారు?
సినిమా కథ బాగుండి, పాత్ర బాగుంటే చాలు ఏ సినిమాలోనైనా చేస్తాను. ఈ సమయంలో బబ్లీగా ఉండే పాత్రలు చేయాలనిపిస్తోంది. అభినయం కలిగిన పాత్రల్లోనూ నటించాలని ఉంది.
కొత్తగా ఎలాంటి సినిమాలు చేస్తున్నారు?
ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్నా. వాటి గురించి ఆ సినిమాలకు సంబంధించినవాళ్లు చెబితే బాగుంటుంది.
ఇదీ చూడండి: టాలీవుడ్లో పవన్ ఫిల్మ్ ఫెస్టివల్: క్రిష్