ఈ ఏడాది కాస్త సానుకూల వాతావరణమే కనిపిస్తోంది. దసరా, దీపావళి, క్రిస్మస్ సీజన్‌లపై భరోసా కనిపిస్తోంది. ఓ వైపు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరచుకోవడం.. మరోవైపు 'ఆర్‌ఆర్‌ఆర్', 'గని', 'పుష్ప', 'కెజీఎఫ్' వంటి చిత్రాలు ఆయా పండగల బరిలో నిలవనున్నట్లు ప్రకటించడం వల్ల నూతనోత్సాహం కనిపిస్తోంది. వీటన్నింటి కన్నా ముందు వచ్చే వినాయక చవితి సీజన్‌పై ఇంత వరకు ఏ స్పష్టత రాలేదు. ఇప్పుడీ పండగ బరిలో వినోదాలు పంచే కథానాయకులెవరన్నది ఆసక్తికరంగా మారింది..
ప్రస్తుతం దేశంలోని మిగతా చిత్రసీమలన్నీ స్తబ్దుగా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాల సందడి కనిపిస్తోంది. ప్రతివారం అరడజను వరకు చిన్న సినిమాలు థియేటర్లకు వరుస కడుతున్నాయి. అయితే ఇంత వరకు 'తిమ్మరుసు', 'ఎస్.ఆర్.కల్యాణమండపం' మినహా మిగిలినవి ఏవీ చెప్పుకోదగ్గ వసూళ్లు అందుకోలేకపోయాయి. రానున్న వారాల్లో 'రాజ రాజ చోర', 'శ్రీదేవి సోడా సెంటర్' వంటివి బాక్సాఫీస్ ముందుకు వస్తుండటం వల్ల.. థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 50శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుస్తుండటం.. దీనికి తోడు అక్కడ టికెట్ రేట్ల విషయంలోనూ కొన్ని సమస్యలుండటం కారణంగా ఈనెలలో పెద్ద చిత్రాలేవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేలా కనిపించడం లేదు. నెలాఖరు నాటికి ఈ సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పెద్ద చిత్రాల విడుదలకు మార్గం సుగమమైనట్లే. అందుకే ఇప్పుడు పలువురు కథానాయకులు వచ్చే నెలలో రానున్న వినాయక చవితిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
రేసులో చాలానే..
ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల్లో నాగచైతన్య 'లవ్‌స్టోరీ', నాగశౌర్య 'వరుడు కావలెను', గోపీచంద్ 'సిటీమార్', సాయితేజ్ 'రిపబ్లిక్', నాని 'టక్ జగదీష్', నితిన్ 'మాస్ట్రో' వంటివి ఉన్నాయి. వీటిలో 'టక్ జగదీష్', 'మాస్ట్రో' వంటివి ఓటీటీ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నా.. అటు ఇటుగా చవితి బరిలోనే పోటీపడనున్నట్లు సమాచారం. నాగచైతన్య - శేఖర్ కమ్ముల కలయికలో రూపొందిన తొలి చిత్రం 'లవ్‌స్టోరీ', సాయితేజ్ - దేవ్ కట్టాల 'రిపబ్లిక్', గోపీచంద్.. సంపత్ నందిల 'సిటీమార్' వంటివి ఇప్పటికే తొలి కాపీతో సిద్ధంగా ఉన్నాయి. ఈనెలాఖరు నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయన్నది అంచనా వేసుకునే.. వచ్చే నెలలో బరిలోకి దిగాలా లేదా? అన్నది నిర్ణయించుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నట్లయితే సెప్టెంబరు తొలి వారం నుంచే ఈ చిత్రాలన్నీ ఒకొక్కటిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య నటించిన 'వరుడు కావలెను' చిత్రం ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. సెప్టెంబరు తొలి వారం కల్లా తొలి కాపీ సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోన్న సంతోష్ శోభన్ - మారుతిల 'మంచి రోజులొచ్చాయి', రాఘవేంద్రరావు 'పెళ్లి సందడీ' వంటి చిన్న సినిమాలు వినాయక చవితినే లక్ష్యం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఓవైపు మూడో దశ కరోనా ముప్పు భయపెడుతున్న తరుణంలో.. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయన్నది కీలకంగా మారనుంది. దీన్ని బట్టే వినాయక చవితి సినిమాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.
ఇదీ చూడండి: 75th Independence Day: స్వాతంత్య్ర సంగ్రామంలో సినీమాతరం