ఈ మధ్య బాలీవుడ్లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ప్రజల నీరాజనాలందుకున్న ప్రముఖుల జీవితాధారంగా కథలు ఎంపిక చేసుకుని విజయాల బాట పడుతున్నారు హీరోహీరోయిన్లు. ముఖ్యమైన వారు కావడం, వారి జీవితం గురించి తెలుసుకోవాలనే ఆత్రుత ఉండటం వల్ల బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లకూ కారణమవుతున్నాయి ఈ చిత్రాలు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో తెరకెక్కుతోన్న బయోపిక్‌లు ఏంటో చూద్దాం.
కంగనా రనౌత్ - ఇందిరాగాంధీ
భారత రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ. ఆమె కథతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్ పోషించేది ఎవరో తెలుసా? నిత్యం వివాదాల్లో ఉంటూ 'నేనింతే' అంటూ అందరినీ గడగడలాడించే కంగనా రనౌత్. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
గంగూబాయ్ కతియావాడి
హీరోయిన్ ఆలియాభట్ ప్రధాన పాత్రలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా 'గంగూబాయ్ కతియావాడి'. ఈ చిత్రంలో ముంబయికి చెందిన రౌడీ రాణి గంగూబాయ్ కతియావాడి పాత్రలో కనిపించనుంది ఆలియా. జులై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
83
1983లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమ్ఇండియా.. ప్రపంచ కప్ సాధించిన నేపథ్యంలో 83 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ యువహీరో రణ్వీర్ సింగ్ కనిపించనున్నాడు. అతడి భార్యగా దీపికా పదుకొణె చేస్తోంది. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది.
శభాష్ మిథు
భారత స్టార్ క్రికెటర్లు ధోనీ, సచిన్ తెందూల్కర్ల బయోపిక్‌లు ఇప్పటికే వెండితెరపై సందడి చేశాయి. ఈ జాబితాలోకి మరో సినిమా వచ్చి చేరింది. అదే హీరోయిన్ తాప్సీ నటిస్తున్న 'శభాష్ మిథు'. భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తీస్తున్నారు.
సర్దార్ ఉద్ధమ్ సింగ్
మరో దేశభక్తి చిత్రానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ నటుడ విక్కీ కౌశల్. ఇటీవలే 'యురీ' చిత్రంతో విజయం సాధించిన ఈ వర్థమాన నటుడు తాజాగా స్వాతంత్య్ర పోరాట యోధుడు సర్దార్ ఉద్ధమ్ సింగ్ పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రానికి సుజీత్ సర్కార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
తలైవి
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'తలైవి'. ఏఎల్ విజయ్ దర్శకుడు. కంగనా రనౌత్ జయలలిత పాత్రలో, అరవింద స్వామి ఎంజీఆర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తమిళ, హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ ఏడాది ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రానుందీ మూవీ.
షేర్షా
బాలీవుడ్ యువ నటుడు సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా విష్ణువర్ధన్ తెరకెక్కిస్తోన్న చిత్రం షేర్షా. ఇందులో కార్గిల్ హీరో విక్రమ్ బత్రా పాత్రలో కనిపించనున్నాడు సిద్దార్థ్. ఈ చిత్రం జులై 2న విడుదల కానుంది.
సైనా
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథతో తెరకెక్కుతోన్న చిత్రం 'సైనా'. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. పరిణీతి చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మైదాన్
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా 'మైదాన్'. ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అమిత్ రవీంద్రనాథ్ దర్శకుడు. ఈ చిత్రం అక్టోబర్ 15న విడుదలకానుంది.
పిప్పా
బాలీవుడ్ యువ నటుడు ఇషాన్ ఖట్టర్, మృణాల్ ఠాకూర్ ప్రధాపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'పిప్పా'. వెటరన్ బ్రిగేడియర్ బలరామ్ సింగ్ మెహతా పుస్తకం 'ద బర్నింగ్ చప్ఫీస్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1971 యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు.
ధ్యాన్‌చంద్ బయోపిక్
భారత హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ జీవితాధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. బాలీవుడ్ చిత్రనిర్మాణ సంస్థ ఆర్ఎల్వీపీ మూవీస్ ఈ సినిమాను నిర్మించనుంది. అభిషేక్ దూబే దర్శకత్వం వహించబోతున్న ఈ మూవీకి సుప్రతిక్ సేన్, అభిషేక్ చౌబే సంయుక్తంగా కథను అందించనున్నారు. ధ్యాన్‌చంద్ పాత్ర కోసం ఓ ప్రముఖ నటుడ్ని ఎంచుకోనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
సరోజ్‌ఖాన్ బయోపిక్
దిగ్గజ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్, ఇటీవలే గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో ఆమె జీవితం ఆధారంగా సినిమా రూపొందించనున్నారు ప్రముఖ దర్శకుడు రెమో డిసౌజా. ఓ మహిళ, గ్రూప్ డ్యాన్సర్ స్థాయి నుంచి దేశం గర్వించదగ్గ కొరియోగ్రాఫర్‌గా ఎలా మారింది అనేది ముఖ్య ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మూడు జాతీయ అవార్డులు గెల్చుకోవడాన్నీ ఈ బయోపిక్‌లో చూపించనున్నారు.