ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'అల.. వైకుంఠపురములో' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇదే జోరులో తన తర్వాతి సినిమా యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణలో తారక్ బిజీగా ఉన్న కారణంగా.. ఆ షూటింగ్ పూర్తయిన తర్వాత కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించాలని భావించింది చిత్రబృందం. కానీ, అనుకోకుండా కరోనా లాక్డౌన్ రావడం వల్ల ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. ఈ క్రమంలో తారక్-త్రివిక్రమ్‌ల కొత్త సినిమా ఆలస్యంగా మొదలు కావచ్చని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఎన్టీఆర్‌తో చిత్రం పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా తెరకెక్కించనున్నాడనే విషయమై సినీ పరిశ్రమలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మాటల మాంత్రికుడి దర్శకత్వంలో నటించేందుకు పవన్ కల్యాణ్, రామ్‌చరణ్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు తారక్ చిత్రం తర్వాత త్రివిక్రమ్ చెర్రీని డైరెక్ట్ చేస్తాడని చిత్రసీమలో చర్చ జరుగుతోంది. కానీ, తన తదుపరి సినిమా కోసం పవన్ కల్యాణ్ ఇప్పటికే హారికా, హాసినీ నిర్మాణ సంస్థ నుంచి అడ్వాన్స్ తీసుకున్నాడని సమాచారం. దీన్ని బట్టి చూస్తే పవన్ కల్యాణ్తోనే త్రివిక్రమ్ తన కొత్త సినిమా ప్రారంభిస్తాడని తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.