టాలీవుడ్ సీనియర్ నటుడు రావి కొండలరావు కన్నుమూశారు. హైదరాబాద్ బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (28/7/2020) తుదిశ్వాస విడిచారు. 600కుపైగా సినిమాల్లో నటించిన ఆయన... సినీ రచయితగానూ అలరించారు. 'తేనె మనసులు', 'దసరా బుల్లోడు', 'రంగూన్ రౌడీ', 'ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం', 'భైరవ ద్వీపం', 'రాధాగోపాలం', 'మీ శ్రేయోభిలాషి', 'కింగ్', 'ఓయ్', 'వరుడు' తదితర చిత్రాల్లో రావికొండలరావు నటించారు. ఆయన భార్య రాధా కుమారి.. నటిగా ఎన్నో సినిమాల్లో నటించారు. వీరిద్దరూ జంటగా చాలా సినిమాల్లో కనిపించారు.
వ్యక్తిగతం
రావి కొండలరావు నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, జర్నలిస్టుగా, నిర్మాతగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగానూ తెలుగు సినీ పరిశ్రమలో విశేషాదరణ పొందారు. 1932, ఫిబ్రవరి 11న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా.. సామర్ల కోటలో జన్మించారు. ఈయన తండ్రి పోస్టుమాస్టర్ పదవీ విరమణ తర్వాత శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. పాఠశాల చదువు కాకినాడలో పూర్తయింది. చదువు పూర్తయిన తర్వాత మద్రాసులోని ఆనందవాణి పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 'కళాప్రపూర్ణ' బిరుదుతో కొండలరావును సత్కరించింది. 1958లో విడుదలైన 'శోభ' చిత్రంతో ఆయన సినీప్రయాణం మొదలైంది. సీనియర్ నటి రాధా కుమారిని కొండలరావు ప్రేమ వివాహం చేసుకున్నారు. రాధా కుమారి నటించిన తొలిచిత్రం 'తేనె మనసులు'.
రచయితగా..
రావి కొండలరావు.. రచయితగా 'భైరవ ద్వీపం', 'బృందావనం' (1992), 'పెళ్లి పుస్తకం', 'చల్లని నీడ' మొదలైన సినిమాలకు రచయితగా వ్యవహరించారు.
నిర్మాతగా..
'శ్రీకృష్ణార్జున విజయం' (1996), 'భైరవ ద్వీపం' (1994), 'బృందావనం' (1992) సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు రావి కొండలరావు.
జర్నలిస్టుగా..
సినిమా రచనలే కాకుండా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, జ్యోతి, రచన, యువ, ఉదయం, పుస్తకం, విపుల వంటి వివిధ పత్రికలలోనూ రచనలు చేశారు. హాస్యరచయితగా గుర్తింపు పొందారు కొండలరావు. 'సుకుమార్' అనే కలం పేరుతోనూ కొన్ని రచనలు చేశారు.