ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దొరస్వామి రాజు కన్నుమూశారు. గుండెపోటు రావడం వల్ల ఆయనను బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. సోమవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
వీఎంసీ ఆర్గనైజేషన్స్‌ను(వీఎంసీ ప్రొడక్షన్స్, వీఎంసీ పిక్చర్స్, వీఎంసీ ఫిల్మ్స్, వీఎంసీ1 కంపెనీ, వీఎంసీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, వీఎంసీ పిక్చర్ ప్యాలెస్) స్థాపించి ఎన్నో సినిమాలకు నిర్మాతగా, పంపిణీదారుడిగా దొరస్వామి రాజు వ్యవహరించారు. టాలీవుడ్‌లో ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. వాటిల్లో 'కిరాయిదాదా', 'సీతారామయ్య గారి మనవరాలు', 'ప్రెసిడెంట్ గారి పెళ్లాం', 'అన్నమయ్య', 'భలే పెళ్లాం', 'వెంగమాంబ' తదితర చిత్రాలున్నాయి. దాదాపు 750 సినిమాలకు ఆయన పంపిణీదారుగా వ్యవహరించారు. గతంలో ఆయన తితిదే బోర్డు సభ్యుడిగా, నగరి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించారు.