సంక్రాంతి మొదలు క్రిస్మస్ వరకు కాసుల వర్షం కురిపించే సీజన్లు టాలీవుడ్‌కు బోలెడన్ని ఉన్నాయి. కానీ కరోనా దెబ్బకు రెండేళ్లుగా సంక్రాంతి తప్ప.. మరో సీజన్‌ని సొమ్ము చేసు కోలేకపోతోంది తెలుగు చిత్రసీమ. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వచ్చిన హిట్లు.. వాటికి దక్కిన వసూళ్లు చూశాక పరిశ్రమలో కొత్త ఉత్సాహం కనిపించింది. వేసవి.. దసరా.. సీజన్లపై ఆశలు చిగురించాయి. మునుపటిలా ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమైంది సినీ పరిశ్రమ.
అయితే కొవిడ్ రెండోసారి పంజా విసరడం వల్ల ఆ ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. మరో వేసవి సీజన్ తుడిచి పెట్టుకుపోయింది. అయితే ఈసారి చిత్ర పరిశ్రమ త్వరగానే కోలుకుంటోంది. ఇప్పటికే తెలంగాణలో లాక్‌డౌన్ పూర్తిగా తొలగించిన కారణంగా చిత్రీకరణల సందడి మొదలైంది. ఈనెల మధ్య నాటికి ఆంధ్రప్రదేశ్‌లోనూ లాక్‌డౌన్ ఎత్తివేస్తే.. వెంటనే థియేటర్లు తెరచుకుంటాయన్న నమ్మకం దర్శక నిర్మాతల్లో కనిపిస్తోంది. ఇప్పుడీ నమ్మకమే దసరా సీజన్‌పై ఆశలు పెంచుకునేలా చేస్తోంది.
త్వరలోనే థియేటర్లు ఓపెన్!
ప్రస్తుతం చిత్రసీమతో పాటు సినీప్రియుల చూపు దసరా సీజన్‌పైనే ఉంది. 100శాతం ఆక్యు పెన్సీతో థియేటర్లు తెరచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనుమతులిచ్చేసింది. ఈనెల 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనూ థియేటర్లు తెరచుకునే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే సినిమాల విడుదలకు మార్గం సుగమమైనట్లే. ప్రేక్షకులూ మునుపటిలా థియేటర్ల వైపు అడుగులు వేస్తే.. కొత్త చిత్రాలు ఊపందుకుంటాయి. రానున్న రోజుల్లో పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా ఉన్నా.. దసరాకి రెట్టింపు సందడి కనిపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదల అక్టోబరులోనే అని చిత్రబృందం చెప్పేసింది. దీంతో దసరా సీజన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ చిత్రంతో పాటు దసరాకు బాక్సాఫీస్ ముందు పోటీ పడే సినిమాలు ఇంకేమైనా ఉంటాయా?.. ఉంటే.. ఆ దసరాబుల్లోళ్లు ఎవరు?
రేసులో బోలెడన్ని..
ప్రస్తుతం విడుదలకు ముస్తాబవుతున్న అగ్ర తారల చిత్రాల్లో.. చిరంజీవి 'ఆచార్య', బాలకృష్ణ 'అఖండ', వెంకటేష్ 'ఎఫ్ 3', ప్రభాస్ 'రాధేశ్యామ్', యష్ 'కేజీఎఫ్', అల్లు అర్జున్ 'పుష్ప', నాని 'శ్యామ్ సింగరాయ్', నాగచైతన్య 'థ్యాంక్యూ' వంటివి ఉన్నాయి. కరోనా రెండో దశ ఉద్ధృతి వల్ల తుది దశ చిత్రీకరణలో ఆగిన ఈ సినిమాలన్నీ.. ఇప్పుడిప్పుడే తిరిగి సెట్స్‌పైకి వెళ్తున్నాయి. చిరంజీవి-కొరటాల కలయికలో రూపొందుతోన్న 'ఆచార్య'.. ఈనెల రెండో వారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. 12రోజులు చిత్రీకరణ జరిపితే సినిమా పూర్తవుతుంది. వెంటనే నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రారంభించినా.. దసరా నాటికి చిత్రం సిద్ధమవుతుంది.
- బాలకృష్ణ 'అఖండ'ను పూర్తి చేయడానికి 20రోజులు సమయం చాలని బోయపాటి శ్రీను ఇప్పటికే ప్రకటించారు. ఈనెలాఖరు నాటికి చిత్రీకరణ పూర్తి చేసినా..దసరా సమయానికి విడుదలకు రెడీ అయిపోతుంది.
- ప్రభాస్ 'రాధేశ్యామ్' తుది మెరుగులు దిద్దుకునేందుకు ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లింది. మరో వారంలో చిత్రీకరణ పూర్తి కానుందని సమాచారం. ఆగస్టు నాటికి నిర్మాణాంత కార్యక్రమాలు పూర్తి చేసినా.. దసరాకి బొమ్మ సిద్ధమైపోతుంది.
- వెంకటేష్ నుంచి 'నారప్ప', 'దృశ్యం 2', 'ఎఫ్ 3' విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటిలో 'నారప్ప', 'దృశ్యం 2' ఈ రెండు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. 'ఎఫ్ 3'ని దసరా బరిలో నిలిపేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇప్పటికే 70శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. ఈనెల నుంచి చిత్రీకరణ ప్రారంభించినా.. దసరా నాటికి సినిమా రెడీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
- చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'కేజీఎఫ్ 2' దసరానే లక్ష్యంగా చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
- అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'.. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం చిత్రీకరణ మరో పది శాతమే మిగిలి ఉంది. ఈ వారంలోనే దాని కోసం చిత్ర బృందం సెట్స్‌పైకి వెళ్లనుంది. సెప్టెంబరు నెలాఖరు కల్లా తొలి కాపీ సిద్ధమయ్యే అవకాశాలున్నాయి.
- నాగచైతన్య ప్రస్తుతం 'లవ్‌స్టోరీ' చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశారు. ఇది దసరాలోపే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఆయన నటించిన మరో సినిమా 'థ్యాంక్యూ' నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఇది దసరాను లక్ష్యంగా చేసుకోవడానికి అనువుగానే ఉంటుంది.
- ఇప్పటికే విడుదలకు ముస్తాబయిన నాని 'టక్ జగదీష్', రానా 'విరాటపర్వం', నితిన్ 'మాస్ట్రో', అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' తదితర చిత్రాలు దసరాలోపే విడుదలయ్యే అవకాశాలున్నాయి. వీటికి దక్కే ఆదరణతో పాటు మూడో దశ కరోనా పరిస్థితుల్ని బట్టి దసరా సినిమాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.