చిత్రీకరణ ఆపకూడదన్న పట్టుదల.. సినిమా పూర్తి చేయాలన్న తపనుంటే.. ఆ ప్రయాణాన్ని ఎవరూ అడ్డుకోలేరు. నిలువెల్ల జాగ్రత్త.. అనుక్షణం అప్రమత్తత.. ఆయుధాలుగా కరోనా మహమ్మారిని దరిచేరనీయకుండా లక్ష్యం నెరవేర్చుకుంటున్నాయి సినీ బృందాలు. కష్టకాలంలో పలువురికి ఉపాధి చూపుతున్నాయి. కరోనా భయపెడుతున్నా చిత్రీకరణలో బాలకృష్ణ గర్జన కొనసాగుతోంది. అల్లు అర్జున్ 'తగ్గేదే లే' అంటున్నాడు. మరి కొద్దిమంది యువ హీరోలదీ అదే మాటే. సీనియర్ హీరో రజనీకాంత్ అదే ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. దాంతో టాలీవుడ్‌లో సినిమాల చిత్రీకరణలతో కొంచెం సందడి కనిపిస్తోంది.
కరోనా భయాలు లేకపోయుంటే తెలుగులో అసలు సిసలు వేసవి సీజన్ మొదలైపోయేది. రూ.వందల కోట్ల వ్యాపార లావాదేవీలు ఊపందుకునేవి. పరిస్థితులు తలకిందులైపోయాయి. ఏ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో తెలియని పరిస్థితి. అందుకే షెడ్యూళ్లు ఆగిపోయాయి. చిత్రీకరణలకు తాత్కాలిక విరామం ప్రకటించేసి పరిస్థితుల్ని అంచనా వేసే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు. కొన్ని చిత్రబృందాలు మాత్రం 'ముందు పని పూర్తి చేసేద్దాం' అంటూ రంగంలోకి దిగాయి. చిత్రీకరణల్ని శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డాయి.
* అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రీకరణ కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లోనే ప్రతినాయకుడిగా నటిస్తున్న ఫాహద్ ఫాజిల్, అనసూయ తదితరులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా చిత్రబృందం శ్రమిస్తోంది.
* బాలకృష్ణ 'అఖండ' చిత్రీకరణ రెండు వారాలుగా వికారాబాద్‌లో జరుగుతోంది. త్వరలోనే హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు.
* నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ‘థ్యాంక్‌యూ’ కోసం చిత్రబృందం ఇటలీలోని మిలాన్ వెళ్లింది. అక్కడ ఇప్పటికే చిత్రీకరణను షురూ చేశారు. శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా నటిస్తున్న 'మహా సముద్రం' చిత్రీకరణ విశాఖపట్నంలో జరుపుకొంటోంది.
* నాని కథానాయకుడిగా నటిస్తున్న 'శ్యామ్ సింగరాయ్' చిత్రీకరణా సాగుతోంది. ఆయన నటిస్తున్న మరో చిత్రం 'అంటే సుందరానికి...!'కి కూడా షురూ అయ్యింది.
* చిత్రసీమ కరోనా పరిస్థితులకు అలవాటుపడింది. సెట్స్‌లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణలు చేస్తున్నారు. దాంతో నటీనటులూ వెనకడుగు వేయకుండా ధైర్యంగా చిత్రీకరణల్లో పాల్గొంటున్నారు. కరోనా రెండో దశ ఉద్ధృతి దృష్ట్యా చలన చిత్ర వాణిజ్య మండలి యాభై మంది కార్మికులు మించకుండా చిత్రీకరణలు చేసుకోవాలని ఆంక్షలు విధించింది. అయితే కొన్ని సినిమాలకు అది సాధ్యం కావడం లేదని తెలుస్తోంది.
"భారీ స్థాయి చిత్రాలు తెరకెక్కిస్తున్నప్పుడు ఎక్కువ మంది నటులు, ఎక్కువ మంది సిబ్బంది అవసరం అవుతారు. ఇలాంటి సందర్భాల్లో నిబంధనల ప్రకారం చిత్రీకరణ జరపడం అసాధ్యం. కానీ చిత్రబృందాలు సెట్స్‌లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అన్ని చిత్రీకరణలూ ఆగిపోతే చాలా మందికి ఉపాధి దొరకడం కష్టమవుతుంది" అని ఓ నిర్మాత చెప్పారు.