జయాపజయాలు.. ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి రంగంలో సర్వ సాధారణమైన అంశాలే. కానీ, చిత్ర పరిశ్రమకివి మరింత ప్రత్యేకం. కచ్చితంగా చెప్పాలంటే రంగుల తెరపై కాంతులీనేందుకు విజయాలే అతి పెద్ద కొలమానం. ఇక్కడ ఒక్క హిట్టుతో ఆకాశమంత ఎత్తుకెదిగినా.. ఒక ఫ్లాప్ ఎదురైతే మళ్లీ తొలి మెట్టు నుంచే సినీ ప్రయాణం మొదలు పెట్టినట్లే లెక్క. మరో విజయంతో తమని తాము నిరూపించేకునేంత వరకు నిరాశ నిస్పృహలు వెంటాడుతూనే ఉంటాయి. కానీ ఓటమెరుగని ప్రయాణం అన్ని వేళలా సాధ్యం కాదు. "ఓటమిని అంగీకరించే ధైర్యం ఉన్నవాడికే గెలిచే హక్కుంది" అన్నట్లు ఇక్కడ ఫ్లాపుల్ని తట్టుకుని నిలబడగలిగిన వాళ్లకే స్టార్‌డమ్‌ను అందుకునే అర్హత ఉంటుంది. వెండితెరపై స్టార్లుగా వెలిగిపోతున్న కథానాయకుల్లో కొందరు తమ సినీ జీవితంలో ఎదురయ్యే జయాపజయాల్ని ఎలా స్వీకరిస్తుంటారో వారి మాటల్లోనే తెలుసుకుందాం..
ఫలితమేదైనా... ప్రయాణంలోనే కిక్
"నా దృష్టిలో ప్రతి చిత్రం ఓ గొప్ప ప్రయాణమే. కొన్నిసార్లు సినిమా కోసం చేసిన ప్రయాణం బాగుంటుంది. ఫలితం సరిగా ఉండదు. కొన్నిసార్లు ప్రయాణాలు చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఫలితం బాగుంటుంది. అందుకే నాకు సినిమా ఫలితం కంటే, ఆ చిత్రం కోసం చేసిన ప్రయాణంలోనే కిక్ ఉంటుంది. ఇలాంటి ప్రయాణాలు నాకెన్నో పాఠాలు నేర్పించాయి. 'టెంపర్' లాంటి కథ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. 'నాన్నకు ప్రేమతో', 'జై లవకుశ'.. ఇవన్నీ నా తరహా కథలు కాదు. కానీ, నా ప్రయోగాలు ఫలించాయి. ఎన్టీఆర్ ఇలాంటి చిత్రాలు చెయ్యగలడా అనే షాకింగ్ వాల్యూ నాకు కావాలి. దాని కోసమే నా ఎదురు చూపులు". - ఎన్టీఆర్
పరాజయాలకు నాదే బాధ్యత
"ఒక్కో చిత్రం ఒక్కో అనుభవాన్ని పంచుతుంది. ప్రతి సినిమానీ ఒక తపనతో చేస్తా. కానీ, ఎంత కష్టపడినా కొన్నిసార్లు కోరుకున్న ఫలితం రాకపోవచ్చు. నా పరాజయాలకు నేనే బాధ్యత తీసుకుంటా. క్రికెట్ టీమ్‌లో కెప్టెన్ ఎలా బాధ్యత తీసుకుంటాడో, సినిమా విషయంలో హీరో అంతే. నేను చూసిన ప్రతి పరాజయం నాకు కొత్త పాఠాన్ని నేర్పింది. జాగ్రత్తగా ఆలోచించి ఎలా నిర్ణయం తీసుకోవాలో తెలియజేసింది." - సాయితేజ్
ఫ్లాప్ ఓ మేల్కొలుపు
"ప్రతి చిత్రానికీ ఒకేలా కష్టపడతాం. అన్నిసార్లు అనుకున్న ఫలితాలు రావు. 'జగడం', 'ఎందుకంటే ప్రేమంట' సినిమా ఫలితాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టాయి. ఎందుకంటే ఆ రెండు చిత్రాల్ని చాలా ప్రేమించా. ఫ్లాప్ అంటే.. అదో మేల్కొలుపు. 'ఎక్కడో తప్పు జరుగుతోంది, చూసుకో' అని చెప్పడమే" - రామ్
సక్సెస్‌కు అర్థమే లేదు..
"నా దృష్టిలో సక్సెస్ అనే పదానికి అర్థమే లేదు. 10 సినిమాలు హిట్టయిన తర్వాత ఒకటి ఫ్లాప్ అయితే, నాని కష్టాల్లో ఉన్నాడు అంటుంటారు. ఓ దశలో 'జెండాపై కపిరాజు', 'పైసా', 'ఆహా కల్యాణం' .. ఇలా వరుస పరాజయాలొచ్చాయి. తర్వాత రెండేళ్లు నా నుంచి సినిమా రాలేదు. కానీ, ఏ దశలోనూ ఒత్తిడికి గురికాలేదు. సక్సెస్ రేటు గురించి పట్టించుకోకుండా నా దగ్గరకొచ్చిన కథల్ని ఎంపిక చేసుకుని.. అలా చేసుకుంటూ వెళ్లిపోతున్నా. అదే నాకు కలిసొస్తోంది". - నాని
తర్వాత ఏంటి?
"సినిమా హిట్టయితే అందరికీ సంతోషమే. దాన్ని అంత వరకే తీసుకోవాలి. అంతే తప్ప భుజాలు ఎగరేస్తూ పొంగిపోకూడదు. ఫ్లాప్ అయితే కుంగిపోకూడదు. 'తర్వాత ఏంటి' అని ఆలోచించాలి. నేను అదే చేస్తా. ఫలితం తేడా వచ్చినప్పుడు మనసులో దాని తాలూకూ ప్రభావం ఉంటుంది. కానీ, అంత సీరియస్‌గా తీసుకోకూడదు. నేనెప్పుడూ ఇంతే. నేనే కాదు అందరూ ఇలానే ఉండాలని కోరుకుంటా". - రవితేజ
అది చూస్తే.. తప్పులు గుర్తొస్తాయి
"గెలుపు కంటే ఓటమే జీవితాలకు గొప్ప పాఠాల్ని బోధిస్తుంది. 'అంతరిక్షం' చిత్ర ఫలితం నాకలాంటి గొప్ప పాఠం నేర్పించింది. బడ్జెట్ పరిమితులు కాస్త ఇబ్బంది పెట్టాయి. సినిమా చేస్తున్నప్పుడే ఆ విషయం అర్థమైంది. ఆ చిత్రంలో వాడిన స్పేస్ సూట్‌ని ఆఫీస్ రూమ్ ముందు పెట్టుకున్నా. కొత్త కథలు వింటున్నప్పుడు ఆ సూట్ వంక ఓసారి చూస్తుంటా. అప్పుడైనా నా తప్పులు గుర్తొస్తాయి". - వరుణ్ తేజ్
ఆ రెండూ మంచివి కావు..
"జీవితం, సినిమా....ఈ రెండింటిలో మూడు దశలుంటాయి. ముందు పని చేయాలి. ఆ తర్వాత ఫలితం గురించి ఆలోచించకుండా అందులోంచి మనం బయటకు వచ్చెయ్యాలి. ఇక మూడోది స్వీకరణ. ఫలితం ఏదైనా స్వీకరించడానికి మనసుని సిద్ధంగా ఉంచుకోవాలి. మంచో చెడో ఏదైనా కావొచ్చు. మనల్ని మనం సిద్ధంగా ఉంచుకోకపోతే చాలా కష్టం. ఓ అట్టర్ ఫ్లాప్ వస్తే.. 'అరె మన పని అయిపోయింది' అనే భయం వెంటాడుతుంది. సడన్‌గా హిట్ వస్తే.. 'మనల్ని మించిన వాడు లేడేమో' అన్న అతి విశ్వాసం మొదలవుతుంది. రెండూ మంచివి కావు. అందుకే ఓ సినిమా చివరి దశలో ఉన్నప్పుడే నేను మానసికంగా బయటకు వచ్చేస్తా. అందుకే హిట్లు, ఫ్లాపులు నన్ను ఎప్పుడూ మార్చలేకపోయాయి". - వెంకటేష్