టాలీవుడ్ హీరోయిన్లు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం చాలా అరుదుగా జరిగేది. కానీ ఈతరం కథానాయికలు మాత్రం ఈ పద్ధతిని మార్చేందుకు సిద్ధమవుతున్నారు. తమ పాత్రలకు సొంత గాత్రమందిస్తూ అభిమానులను ఫిదా చేస్తున్నారు. వారిలో కొందరి గురించి ఈ ప్రత్యేక కథనం.
సాయిపల్లవి
తెలుగమ్మాయి కాకపోయినా మొదటి సినిమాకే సొంత గొంతిచ్చి 'ఫిదా' చేసింది సాయి పల్లవి. ఆ తర్వాత 'ఎమ్సీఏ', 'పడి పడి లేచే మనసు' సినిమాల్లోనూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. అభిమానులను అలరించింది.
రాశీఖన్నా
మిగతా వారి కంటే భిన్నంగా చేసింది రాశీఖన్నా. తన రెండో చిత్రం 'జోరు'లో ఏకంగా ఓ పాట పాడి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటికి 'వరల్డ్ ఫేమస్ లవర్' కోసం డబ్బింగ్ చెప్పుకుంది. ఆ ఫొటోను ట్విట్టర్లో పంచుకుంది.
పూజా హెగ్డే
అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలతో కలిసి నటించింది పూజాహెగ్డే. ఎన్టీఆర్‌తో కలిసి నటించిన 'అరవింద సమేత వీర రాఘవ'లో తన పాత్రకు తానే గాత్రమందించింది. ప్రస్తుతం అల్లు అర్జున్, ప్రభాస్ సరసన నటిస్తోంది.
రష్మిక
తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా.. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక. విజయ్ దేవరకొండ సరసన చేసిన 'డియర్ కామ్రేడ్' చిత్రంతో తొలిసారి తన గొంతును సవరించుకుంది. ప్రస్తుతం మహేశ్‌బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు'లో నటిస్తోంది.
మెహ్రీన్
తొలి సినిమా 'కృష్ణ గాడి వీర ప్రేమకథ'లో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించి అలరించింది. కానీ ఆమె సొంత గొంతు వినేందుకు మాత్రం'ఎఫ్2' చిత్రం వరకు ఆగాల్సి వచ్చింది.
కీర్తి సురేశ్
గ్లామరస్ రోల్స్, డీగ్లామరస్ పాత్రలకైనా సిద్ధం అయిపోతుంది కీర్తి సురేశ్. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి'లో తొలిసారి తెలుగులో సంభాషణలు పలికింది.
సమంత
సినిమాల్లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన సమంతకు.. సొంతంగా డబ్బింగ్ చెప్పేందుకు చాలా కాలమే పట్టింది. ఆమె ప్రత్యేక పాత్రలో నటించిన 'మహానటి' చిత్రంలో మొదటిసారి తన గొంతును ప్రేక్షకులను వినిపించింది.