'ఫలానా పాత్ర చేయాలని ఉంది...' అంటూ హీరోయిన్లు అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతుంటారు. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకునే ఈ భామలకు అలాంటి కొన్ని డ్రీమ్‌రోల్స్ ఉన్నాయట. అవేంటంటే?
'నీలాంబరి' ఒక్కటి చాలు
కొన్నేళ్ల క్రితం విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన 'నరసింహ'లోని నీలాంబరి పాత్ర అనగానే ఎవరైనా రమ్యకృష్ణ ఎంత బాగా చేసిందని అనకుండా ఉండలేరు. త్వరలో రాబోతున్న 'నారప్ప' సినిమాలో నటిస్తున్న ప్రియమణి రమ్యకృష్ణను మెచ్చుకునే వారిలో ముందుంటుంది. తనకు కూడా నీలాంబరి లాంటి పాత్ర చేయాలనే కోరిక ఉందట. అలాంటి ఒక్క అవకాశం వస్తే చాలు... తన కెరీర్‌కు వందశాతం న్యాయం చేసినట్లేనని చెబుతుంది ప్రియమణి. అలాగే పూర్తి స్థాయిలో కామెడీ ప్రాధాన్యమున్న పాత్ర చేయడమూ తన డ్రీమ్‌రోల్ అని అంటుంది.
లేడీ విలన్‌గా...
'వకీల్‌సాబ్'తోపాటూ మరో రెండు సినిమాల్లో నటిస్తూ... గుర్తింపు తెచ్చుకుంటున్న కేరళ కుట్టి నివేదా థామస్‌కు మొదటి నుంచీ ఒక్క సినిమాలో అయినా లేడీవిలన్ పాత్ర చేయాలని ఉందట. పైగా దాన్ని చూసిన అభిమానులు తనను విపరీతంగా అసహ్యించుకోవాలట. ఇప్పటివరకూ తన పాత్రలతో క్యూట్‌గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకున్న నివేదా ఒక్కసారైనా అలా బ్యాడ్‌గర్ల్ అనిపించుకోవాలని కల కంటోంది. అంతేకాదు... తన డ్రీమ్‌రోల్‌లో నటించే అవకాశం వస్తే ఎలా చేయాలో కూడా ముందే ఆలోచించుకుని పెట్టుకుందట. అది నెరవేరుతుందో లేదో మరి.
కల్పనా చావ్లా పాత్ర
త్వరలో విడుదల కాబోతున్న 'రెడ్', 'విరాటపర్వం'లలో నటిస్తున్న నివేదా పేతురాజ్‌కు దర్శకుడు మణిరత్నం సినిమాలో నటించాలని ఉందట. ఇప్పటికే రెండుసార్లు మణిరత్నం సినిమా ఆడిషన్లకు వెళ్లిన నివేదా... చివరి నిమిషంలో ఆ అవకాశాల్ని కోల్పోయిందట. అందుకే ఇక మీదట అలాంటి ఛాన్స్ వస్తే గనుక అస్సలు వదులుకోనని అంటుంది. కుదిరితే కల్పనా చావ్లా బయోపిక్ చేయాలనేది నివేదా కల. తాను ఇప్పటికే అంతరిక్షం కథాంశంతో వచ్చిన 'టిక్ టిక్ టిక్' సినిమా చేసింది కాబట్టి... కల్పనా చావ్లాలా చేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదని చెబుతుంది.
జెస్సీలా మెప్పించాలి
ఫిట్‌నెస్‌కు మారుపేరుగా నిలిచే రకుల్ సినిమా రంగంలోకి వచ్చిన కొత్తల్లోనే ఒకటిరెండు డ్రీమ్‌రోల్స్ చేయాలని అనుకుందట. వాటిల్లో ఒకటి 'ఏ మాయ చేశావే'లో సమంత చేసిన జెస్సీ పాత్ర. అలాంటి ప్రేమకథా చిత్రాన్ని చేసే అవకాశం వస్తే వదులుకునే ప్రసక్తే లేదని చెబుతుంది రకుల్. అలాగే కుదిరితే ఒక్కటైనా సరే పూర్తిగా మహిళా ప్రాధాన్యమున్న సినిమా చేయాలని ఉందట. విభిన్నమైన పాత్రను చేస్తేనే అభిమానులు కొన్నేళ్ల పాటు గుర్తుపెట్టుకుంటా రనేది రకుల్ అభిప్రాయం.
డాన్సర్‌గా చేయాలని...
మోడలింగ్‌తో తన కెరీర్‌ను మొదలుపెట్టి ఆ తరువాత సినిమా రంగంలోకి వచ్చి... తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్న నటి పూజా హెగ్డే. కెరీర్ ప్రారంభం నుంచీ పూజకు హృతిక్‌ను ఒక్కసారైనా చూడాలనీ అతనితో కలిసి స్క్రీన్ పంచుకోవాలనీ ఉండేదట. అయితే కెరీర్ మొదట్లోనే 'మొహెంజొదారో'తో తన కల నెరవేరినప్పుడు ఎగిరి గంతేసినంత పనిచేసిందట. చాలామంది హీరోయిన్లు జీవితాంతం ఎదురుచూసినా రాని అవకాశం తనకు వచ్చిందని చెప్పే పూజకు మరో డ్రీమ్‌రోల్ కూడా ఉంది. అన్నీ అనుకూలిస్తే పూర్తిగా డాన్స్ ప్రాధాన్యం ఉన్న సినిమాలో చేయాలని కలలు కంటోంది.
శ్రీదేవి బయోపిక్‌లో...
నటీనటులెవరికైనా బయోపిక్‌లు చేసే అవకాశం వస్తే దాదాపుగా వదులుకోరు. తనకు కూడా అలాంటి డ్రీమ్‌రోల్స్ ఉన్నాయని చెబుతుంది రష్మిక మందన్న. ఒకప్పుడు వెండితెరను ఏలిన శ్రీదేవి, సౌందర్యల బయోపిక్‌లు చేసే అవకాశం కోసం ఈ ముద్దుగుమ్మ ఎదురుచూస్తోందట. తనకు మొదటినుంచీ శ్రీదేవి అంటే ఇష్టమనీ భవిష్యత్తులో అవకాశం వస్తే తాను వెండితెర శ్రీదేవిగా గుర్తింపు పొందాలనుకుంటున్నాననీ చెబుతోంది.