కరోనా చిత్రసీమను దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. అయినా దర్శక నిర్మాతలు.. కథానాయకుల్లో భరోసా చెదరడం లేదు. ఒడుదొడుకులు ఎన్ని ఎదురైనా వెండితెరపై వెలుగులు నింపగలమన్న ధీమా ఇప్పుడందరిలో కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన సినిమాలకు ప్రేక్షకుల నుంచి దక్కిన ఆదరణే వారందరికీ స్ఫూర్తినిస్తోంది. అందుకే ఇంతటి కఠిన పరిస్థితుల్లోనూ.. భవిష్యత్‌పై ఆశలతో వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు కథానాయకులు. ప్రస్తుతం ప్రతి అగ్ర హీరో చేతిలో రెండు, మూడేళ్లకు సరిపడా కథలున్నాయి. అయినా సరే మరో మంచి కథ దొరికితే పచ్చజెండా ఊపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇప్పుడు దర్శకులంతా పోటాపోటీగా కథలు సిద్ధం చేసే పనిలో పడ్డారు. కరోనాతో చిత్రీకరణలు దాదాపు ఆగిపోయిన నేపథ్యంలో కొత్త కథలు విని ఓకే చేసేందుకు హీరోలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పలు ఆకర్షణీయమైన కొత్త కలయికలు ప్రచారంలో వినిపిస్తున్నాయి. మరి ఆ క్రేజీ కాంబినేషన్లేంటో చూద్దామా!
ప్రభాస్ కోసం ఆ ఇద్దరు..
ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్', 'సలార్', 'ఆదిపురుష్' చిత్రాలతో సెట్స్‌పై తీరిక లేకుండా గడుపుతున్నారు. వీటితో పాటు ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలోనూ ఓ భారీ సైన్స్ ఫిక్షన్ చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన చేతిలోని ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి కావడానికి మరో రెండేళ్లు పట్టొచ్చు. అయినా సరే.. ఆయన కోసం కొత్త కథలు సిద్ధం చేసుకుంటున్న దర్శకుల జాబితా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఆయన మరో బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కథకు పచ్చజెండా ఊపారని ప్రచారం జరుగుతోంది. వీరి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయని, సిద్ధార్థ్ ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని బాలీవుడ్ వర్గాల మాట. సిద్ధార్థ్.. 'బ్యాంగ్ బ్యాంగ్', 'వార్'లాంటి భారీ యాక్షన్ చిత్రాలతో సినీప్రియుల్ని అలరించారు. అలాగే ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రభాస్ కోసం ఓ కథ సిద్ధం చేసిన్నట్లు ప్రచారంలో ఉంది.
పవన్ 'ఊ' అనడమే ఆలస్యం..
కథానాయకుడు పవన్ కల్యాణ్ రీఎంట్రీలో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' చిత్రంతో పాటు 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్‌లో నటిస్తున్నారు. వీటితో పాటు దర్శకులు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతోనూ ఆయన సినిమాలు చేయాల్సి ఉంది. అయినా ఇప్పుడాయన నుంచి మరోమారు గ్రీన్ సిగ్నల్ అందుకోవడం కోసం ఇద్దరు నిర్మాతలు ఎదురు చూస్తున్నట్లు సమాచారం. పవన్‌తో 'వకీల్‌సాబ్'ని నిర్మించి విజయం అందుకున్నారు దిల్‌రాజు. అయితే ఇప్పుడాయన పవన్‌తో మరో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక నిర్మాత బండ్ల గణేష్ పవన్‌తో సినిమా చేసేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు.
అందరి కళ్లు మహేష్ వైపే..
మహేష్‌బాబు కొన్నేళ్లుగా కథల ఎంపికలో వేగం పెంచారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చేస్తున్నారు. ఇది సెట్స్‌పై ఉండగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీని తర్వాత మహేష్ చేయనున్న ప్రాజెక్టు ఏదన్నది అందరిలోనూ ఆసక్తిరేకెత్తిస్తోంది. మహేష్‌బాబుతో ఒక సినిమా చేయాల్సి ఉందని దర్శకుడు రాజమౌళి గతంలోనే ప్రకటించారు. 'ఆర్‌ఆర్‌ఆర్' పూర్తయిన వెంటనే మహేష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని ప్రచారంలో ఉంది. అలాగే మహేష్‌తో సినిమా చేసేందుకు సందీప్ రెడ్డి వంగా, బుచ్చిబాబు సాన లాంటి యువ దర్శకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.
బాలకృష్ణ కోసం..
'అఖండ' చిత్రం పూర్తయిన వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు బాలకృష్ణ. ఇది త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. దీని తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన బాలయ్యకు కథ వినిపించారని, పూర్తి స్క్రిప్ట్‌తో ఆయన ముందుకు వెళ్లడమే తరువాయి అని ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఈ సినిమాలో మరో నందమూరి హీరో తళుక్కున మెరవనున్నారని చెబుతున్నారు. ఇక దర్శకుడు శ్రీవాస్ కూడా బాలకృష్ణకు కథ వినిపించారని, దానికి ఆయన పచ్చజెండా ఊపారని ప్రచారంలో ఉంది.
వెంకీ రీమేక్‌ల సందడి..
కథానాయకుడు వెంకటేష్ వరుస రీమేక్‌లతో సెట్స్‌పై సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలు చేస్తుండగా.. వాటిలో 'ఎఫ్ 3' మినహా 'నారప్ప', 'దృశ్యం 2' రెండూ రీమేక్‌లే. ఇప్పుడీ జాబితాలో 'డ్రైవింగ్ లైసెన్స్' చేరింది. సురేష్ ప్రొడక్షన్స్ ఈ మలయాళ చిత్ర హక్కుల్ని సొంతం చేసుకుంది. త్వరలో వెంకీతో దీన్ని పట్టాలెక్కించాలని ప్రణాళిక రచిస్తున్నారు. దీనితో పాటు వెంకటేష్ కోసం ఇప్పటికే మరో రీమేక్ హక్కులను కొని ఉంచారు నిర్మాత సురేష్‌బాబు. హిందీలో విజయవంతమైన 'దేదే ప్యార్ దే'ని తెలుగులో వెంకటేష్‌తో పునర్నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వీటిలో ముందుగా సెట్స్‌పైకి వెళ్లేది ఏది? వాటి దర్శకులెవరన్నది ఖరారు కావాల్సి ఉంది. ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇప్పటికే వెంకటేష్‌కి ఓ కథ వినిపించారు.