కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమ స్తంభించిపోయింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు, వాళ్ల బృందాలు ఇళ్లకే పరిమితమయ్యాయి. ఖాళీగా కూర్చోవడం తప్ప మరో వ్యాపకం లేకుండా పోయింది. ఓ రకంగా అందరికీ ఇది కష్టకాలమే. అయితే దర్శకులు మాత్రం ఈ విరామాన్నీ ఓ సదావకాశంగా మలుచుకున్నారు. కాదు కాదు.. కథావకాశంగా మలుచుకున్నారు. ఈ విరామంలో రెండు మూడు కథలు సిద్ధం చేసుకున్న దర్శకులు చాలా మందే ఉన్నారు. ఆ దర్శకులంతా ఇకపై విరామం లేకుండా సినిమాల్ని పట్టాలెక్కిస్తామని చెబుతున్నారు.
ఆమధ్య ఓ అగ్ర హీరో, దర్శకుడు కలిసి సినిమా చేయాలనుకున్నారు. కథా నచ్చింది. తీరా ఆ కథానాయకుడు సినిమా కోసం రంగంలోకి దిగాలనుకునేలోపు పూర్తిస్థాయి స్క్రిప్టు సిద్ధం కాలేదు. దాంతో మరో దర్శకుడు కథ సిద్ధం చేసే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి.
మరో దర్శకుడు ప్రత్యేకంగా ఓ హీరో కోసం కథను సిద్ధం చేసుకున్నాడు. ఆ కథానాయకుడికీ నచ్చింది. కానీ ఆయన చేస్తున్న మరో సినిమా ఎంతకీ పూర్తి కాలేదు. దాంతో సదరు దర్శకుడు ఆ హీరో కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది.
- చిత్రసీమలో నిత్యం జరిగే తంతే ఇది. దర్శకుల వల్ల హీరోలకు, హీరోలవల్ల దర్శకులకు విరామం వస్తూనే ఉంటుంది. ఇకపై ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు తక్కువంటున్నాయి పరిశ్రమ వర్గాలు. అందుకు కారణం... బోలెడన్ని కథలు సిద్ధం కావడమే! కరోనాతో వచ్చిన ఈ విరామంలో అగ్ర దర్శకులు, రచయితలు పలు కథలు సిద్ధం చేశారు. ఇకపైన హీరోలు ఒక కథ నచ్చలేదంటే, మరో దర్శకుడితో సినిమాను పట్టాలెక్కించొచ్చు. దర్శకులు కూడా ఓ హీరో బిజీగా ఉన్నాడంటే, అతని కోసం తయారు చేసిన కథను పక్కనపెట్టేసి.. అందుబాటులో ఉన్న మరో హీరోకు తగ్గ కథతో సినిమాను మొదలు పెట్టొచ్చు.
తొలి రోజు నుంచే...
దర్శకుల్లో ఒకొక్కరిది ఒక్కో శైలి. ఒక్కసారి కథ పక్కాగా సిద్ధమైంది అనుకున్నాక ఇక మళ్లీ అందులో వేలు పెట్టని దర్శకులు ఓ రకం. సెట్స్‌పైకి వెళ్లాక చివరి నిమిషంలోనూ అందులో మార్పులు చేసే దర్శకులు కొందరు. రెండో రకం దర్శకులు లాక్‌డౌన్‌తో వచ్చిన విరామంలో తమ స్క్రిప్టులకు ఫైన్ ట్యూనింగ్ పేరిట మరిన్ని మెరుగులు దిద్దుకున్నారు. అది పూర్తయిందనుకున్నాక మరో కథపై దృష్టిపెట్టారు. ఇక మొదట రకం దర్శకులైతే లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత రోజు నుంచే కొత్త కథల్ని సిద్ధం చేసుకోవడంపై దృష్టి పెట్టారు.
దర్శకుడు పూరీ జగన్నాథ్ లాక్‌డౌన్ తర్వాత ముంబయిలోనే గడుపుతున్నారు. ఆయన ఈ విరామంలో ఓ పాన్ ఇండియా స్థాయి కథను సిద్ధం చేసుకున్నారు. అది పూర్తయ్యాక పరిస్థితుల్ని బట్టి మరో కథనూ మొదలు పెడతానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఓ సినిమా చేస్తూనే, మరో సినిమాకు కథని సిద్ధం చేస్తుంటారు. అలాంటిది ఈసారి దాదాపు రెండు నెలలు ఏకధాటిగా విరామం రావడం వల్ల ఈ సమయాన్ని పూర్తిగా కథల కోసం సద్వినియోగం చేసుకున్నారు.
మరో దర్శకుడు శేఖర్ కమ్ముల చేస్తున్న 'లవ్‌స్టోరీ' ఇప్పటికే తుదిదశకు చేరుకుంది. తదుపరి చిత్రం కోసం ఆయన మరో కథను సిద్ధం చేశారు. అందులో ఓ అగ్ర హీరో నటించబోతున్నాడని, ఆ సినిమాను ఎక్కువగా సమయం తీసుకోకుండా పట్టాలెక్కిస్తానని చెబుతున్నారు. చిత్రీకరణలకు అనుమతులు రాగానే 'ఆచార్య' సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నారు కొరటాల శివ. ఆయన కూడా ఈ విరామంలో వేరే కథలపై దృష్టి పెట్టారు.
"సమయం దొరికితే రాసుకున్న కథలు మరింత మెరుగవుతుంటాయి. కొత్త ఆలోచనలు వస్తుంటాయి. వాటితో కొత్త కథలు పుడుతుంటాయి. ఈ విరామంలో రాయడం సహ ఎక్కువ సమయం గడుపుతున్నా" అని చెప్పారు కొరటాల శివ. తన తదుపరి సినిమాను ఆలస్యం చేయకుండా పట్టాలెక్కిస్తానని, ఇక నుంచి మరింత వేగంగా సినిమాలు చేయబోతున్నానని చెబుతున్నారు. మరో అగ్ర దర్శకుడు త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌తో చేయనున్న చిత్రం కోసం ఇప్పటికే స్క్రిప్టును సిద్ధం చేశారు. ఎన్టీఆర్ 'ఆర్‌ఆర్‌ఆర్' పూర్తవడానికి సమయం పడుతుంది కాబట్టి, ఇప్పుడాయన మరో కథపై దృష్టి పెడుతున్నారని తెలిసింది. దర్శకుడు సుకుమార్ 'పుష్ప' సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన ఒక పక్క ఆ సినిమా సన్నాహాలు చేసుకుంటూనే, మరోపక్క కొత్త కథలపై దృష్టి పెట్టారు. తన నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్‌లో సుకుమార్ కథలతోనే సినిమాలు రూపొందుతుంటాయి. బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో సినిమాను తిరిగి ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నారు. దాంతో పాటు తన దగ్గరున్న ఇతర కథలపైనా కసరత్తులు చేస్తున్నారు. దర్శకుడు పరశురామ్.. మహేశ్‌తోపాటు, నాగచైతన్య చిత్రం కోసం స్క్రిప్టులు సిద్ధం చేశారు. బాబీ, సుజీత్ తదితరులు చిరంజీవితో సినిమా కోసం కథలు, స్క్రిప్టులు సిద్ధం చేస్తున్నారు. అనిల్ రావిపూడి, మోహనకృష్ణ ఇంద్రగంటి రెండు మూడు కథలపై దృష్టి సారించారట. క్రిష్, హరీశ్ శంకర్... ఇలా అందరూ స్క్రిప్టులతో బిజీ బిజీ.
కథలు మారబోతున్నాయి
కరోనాతో వచ్చిన ఈ విరామం మన కథల తీరుతెన్నుల్ని మార్చేస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. "ఈ విరామంలో ఓటీటీల ద్వారా ప్రపంచ సినిమా దగ్గరైంది. దాంతో ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. అందుకు తగ్గట్టుగా దర్శకులు వైవిధ్యంగా కథలు తయారు చేస్తారు" అని అగ్ర దర్శకుడు రాజమౌళి చెప్పారు. 'ఆర్‌ఆర్‌ఆర్'ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టిన ఆయన.. తదుపరి సినిమాలకు సంబంధించిన కథలపైనా సమాలోచనలు జరుపుతున్నామని చెప్పారు. మరోవైపు రచయితలూ బిజీ బిజీగా గడుపుతున్నారు. యువ రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ ఈ విరామంలో నాలుగు కథల్ని సిద్ధం చేశారని తెలిపారు. "ఎలాంటి ఒత్తిళ్లు లేని సమయం దొరికింది. వాలీబాల్ దిగ్గజం అరికపూడి రమణారావు బయోపిక్‌తో పాటు ఓ పోలీస్ కథ, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే మరో కథను సిద్ధం చేశానని" అన్నారు ప్రసన్నకుమార్.
ఇదీ చూడండి... కరోనాపై పోరుకు బాలీవుడ్ స్టార్స్ 'లైవ్ షో'