కాలానికి ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లడమే తెలుసు.. కానీ, సినిమా భవిష్యత్తును ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తుందో... గతాన్నీ అంతే చక్కగా కళ్లకు కడుతుంది. ప్రేక్షకుల్ని టైమ్ మిషన్ ఎక్కించేసి అటూ ఇటూ తిప్పుతూ, ఓ సరికొత్త అనుభూతిని పంచుతుంది. ప్రస్తుతం తెలుగులో తీస్తున్న పలు చిత్రాలు అదే లక్ష్యంతోనే ముస్తాబవుతున్నాయి. ఓ హీరో రాజుల కాలంలోకి తీసుకెళ్లబోతున్నాడు. ఇంకో ఇద్దరు స్వాతంత్య్ర సమరంలో ప్రేక్షకుల్ని భాగం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి చరిత్ర లోతుల్లో నుంచి వెలికితీస్తున్న ఆ కథలేంటి?
చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథలు, అమర చిత్ర కథల్లో కనిపించిన రాజ్యాలు ఆసక్తిని రేకెత్తించేవే. అలా ప్రేక్షకుల్ని ఒక ప్రత్యేకమైన ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో రాటుదేలారు అగ్ర దర్శకుడు రాజమౌళి. 'మగధీర', 'బాహుబలి' సినిమాలతో అదే ప్రయత్నం చేసి ప్రేక్షకులకు వినోదం పంచాడు. ఆయన సినిమాలు చూస్తే అప్పట్లో జీవితాలు ఇలాగే ఉండేవేమో కదా అనిపిస్తుంది. మరో దర్శకుడు క్రిష్ చరిత్రపై మక్కువ ప్రదర్శిస్తుంటాడు. ఆ నేపథ్యంలో కథల్ని అల్లుతూ ప్రేక్షక లోకాన్ని పలుమార్లు టైమ్ మిషన్ ఎక్కించేశారు. 'కంచె', 'గౌతమీపుత్ర శాతకర్ణి', 'మణికర్ణిక' చిత్రాలే అందుకు ఉదాహరణ. ఇప్పుడీ ఇద్దరు అగ్ర దర్శకులు మరోసారి కాలాన్ని వెనక్కు తిప్పి చారిత్రక కథలను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
'ఆర్‌ఆర్‌ఆర్'తో తొలి స్వాతంత్య్ర సంగ్రామం రోజుల్లోకి తీసుకెళ్లబోతున్నాడు రాజమౌళి. కల్పిత కథతోనే తీస్తున్న ఈ చిత్రంలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ దర్శనమిస్తారు. కథరీత్యా ఇది 1920నాటి పరిస్థితులకు తగ్గట్లుగా సాగుతుందని సమాచారం. అందుకోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకమైన సెట్స్‌ను తీర్చిదిద్ది ఆ నేపథ్యంలోనే చిత్రీకరణ జరిపినట్లు సమాచారం. దాదాపు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కాబోతుంది. క్రిష్.. మరోసారి ప్రేక్షకుల్ని గతంలోకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ హీరోగా, ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం.. చారిత్రక కథాంశంతోనే ముస్తాబవుతోన్నట్లు సమాచారం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుందీ చిత్రం.
70ల్లోకి ప్రభాస్.. 90ల్లోకి రానా
'బాహుబలి' చిత్రాలతో అలుపెరుగని పోరాటాలు చేసిన ప్రభాస్, రానా మరోసారి ప్రేక్షకుల్ని వేర్వేరు కాలాల్లోకి తీసుకెళ్లబోతున్నారు. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ఒక ప్రత్యేకమైన ప్రపంచంలో సాగే కథ. యూరప్ నేపథ్యంలో సాగే ఆ సినిమా కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకమైన సెట్స్‌ను తీర్చిదిద్దారు. 70వ దశకంనాటి యూరప్ వాతావరణ పరిస్థితులను కళ్లకు కట్టనున్నట్టు సమాచారం. రానా కథానాయకుడిగా వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న 'విరాటపర్వం' 1990 దశకం నేపథ్యంలో సాగబోతోంది. తెలంగాణలోని అప్పటి రాజకీయ, సామాజిక పరిస్థితుల కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రానా నక్సలైట్‌గా కనిపించబోతున్నట్టు వినికిడి. అతడికి జోడీగా సాయి పల్లవి సందడి చేయబోతోంది. తుది దశ చిత్రీకరణలో ఉంది. వేసవి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాన్ ఇండియా చిత్రంగా విడుదలై జాతీయ స్థాయిలో ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న 'కేజీఎఫ్' కొనసాగింపు చిత్రం 'కేజీఎఫ్ ఛాప్టర్ 2'.. సినీ ప్రియుల్ని 70ల కాలంలోకి తీసుకెళ్లబోతుంది. కోలార్ బంగారు గనుల మాఫియా నేపథ్యంతో సాగే పీరియాడికల్ కథగా తొలి చిత్రాన్ని తీశారు. కొనసాగింపు.. ఇదే పంథాలో సాగనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్, కడప ప్రాంతాల్లో కీలకమైన సెట్లు నిర్మించినట్లు తెలిసింది. ఇందులో బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ ప్రతినాయకుడిగా అధీరా పాత్రలో కనిపిస్తారు. రవీనా టాండన్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీగా కీలక పాత్రలో మెరవబోతుంది. ఈ ఏడాది ద్వితియార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
అగ్ర హీరోల చిత్రాలతో పాటు పరిమిత వ్యయంతో తెరకెక్కుతున్న 'పలాస' లాంటి సినిమాలూ ప్రత్యేకమైన నిర్దేశిత కాలం నేపథ్యంలో సాగేవే. వాస్తవ సంఘటనల స్ఫూర్తితోనూ, బయోపిక్‌లుగా రూపొందే సినిమాలూ ఎక్కువగా నాటి పరిస్థితుల్ని కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తుంటాయి. ప్రేక్షకులకు ఆయా కథలు ఎంత థ్రిల్‌ను పంచుతాయో, తెరపై కనిపించే నాటి వాతావరణమూ అదే తరహాలో అబ్బుర పరుస్తుంటుంది. అందుకే పీరియాడికల్ సినిమాలపై దర్శకులు మక్కువ ప్రదర్శిస్తుంటారు.