పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన, అందమైన అనుభూతి. తమ స్థాయికి తగ్గట్టు ఉన్నంతలో గుర్తుండిపోయేలా ఈ వేడుకను జరుపుకొంటారు. సెలబ్రిటీల విషయానికొస్తే దాని గురించి చెప్పాల్సిన పనిలేదు. వందలాది ప్రముఖుల మధ్యలో అట్టహాసంగా, అంగరంగ వైభవంగా పది తరాలు గుర్తుండిపోయేలా నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది కరోనా, అందరి ప్లాన్స్‌ను తారుమారు చేసింది. కలిసి జీవితం పంచుకుందాం అనుకున్న జంటల్లో దుఃఖాన్ని, నిరాశను నింపింది.
ఈ వైరస్ కారణంగా చాలా మంది పెళ్లిలు వాయిదా పడగా మరికొందరు కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ తంతును ముగించారు. ఇందుకు సెలబ్రిటీల మినహాయింపు ఏం కాదు. వారు కూడా సాదాసీదాగా వివాహ వేడుకను జరుపుకోవాల్సి వచ్చింది. అలా సాధరణ రీతిలో అతి తక్కువ మంది సమక్షంలో ఈ ఏడాది పెళ్లిపీటలు ఎక్కిన సినీ తారలు ఎవరెవరంటే?
కాజల్ అగర్వాల్-గౌతమ్ కిచ్లూ
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. తన ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకోనున్నట్లు అక్టోబర్ 9న ప్రకటించి అందర్ని ఆశ్చర్యపరిచింది. అక్టోబర్ 30న ముంబయిలో కుటుంబసభ్యులు సమక్షంలో వివాహం చేసుకుంది.
రానా-మిహీకా
విలక్షణ నటుడు రానా దగ్గుబాటి.. ప్రేయసి మిహీకా బజాజ్‌ను కుటుంబసభ్యుల సమక్షంలో ఆగస్టు 8న వివాహమాడారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో ఇందుకు వేదికైంది. వారిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించినట్లు లాక్డౌన్ సమయంలోనే రానా ప్రకటించారు.
నిఖిల్ -పల్లవి
కథానాయకుడు నిఖిల్ వివాహం మే 13న హైదరాబాద్ సమీపంలోని శామీర్‌పేట్‌లో ఓ ప్రైవేట్ అతిథి గృహంలో జరిగింది. డా.పల్లవి వర్మను ఆయన ప్రేమించి పెళ్లాడారు.
నితిన్-షాలిని
టాలీవుడ్ హీరో నితిన్.. తాను ప్రేమించిన షాలినిని జులైలో వివాహం చేసుకున్నారు. లాక్డౌన్ కారణంగా నిబంధనలను పాటిస్తూ, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు.
శ్వేత అగర్వాల్-ఆదిత్య నారాయణ్
దాదాపు పదేళ్లు సహజీవనం చేసి, డిసెంబరు 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు నటి శ్వేత అగర్వాల్- ఆదిత్య నారాయణ్. ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ తనయుడే ఆదిత్య.
నిఖిల్ గౌడ-రేవతి
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ గౌడ.. ఏప్రిల్‌లో రేవతిని వివాహమాడారు. రామనగర జిల్లాలోని బిడాది ఫామ్‌హౌస్‌లో వీరి పెళ్లి జరిగింది.
దర్శకుడు సుజీత్
తెలుగులో 'రన్ రాజా రన్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సుజీత్.. రెండో సినిమాగా ప్రభాస్ 'సాహో'ను తెరకెక్కించారు. తాను ప్రేమించిన ప్రవళికను ఆగస్టు 2న హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నారు.
నిర్మాత దిల్‌రాజు రెండో పెళ్లి
లాక్‌డౌన్‌లోనే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు రెండో వివాహం చేసుకున్నారు. నిజామాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.
నిహారిక-చైతన్య
ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె, నటి నిహారిక వివాహం చైతన్యతో బుధవారం జరిగింది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకలో మెగా, అల్లు కుటుంబాలు పాల్గొన్నాయి. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గానూ మారాయి.
బాలీవుడ్
సనాఖాన్-ముఫ్తీ అనాస్
ఈ ఏడాది అభిమానులకు వరుసగా షాక్, సర్ప్రైజ్ను ఇచ్చింది బాలీవుడ్ నటి, హిందీ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సనాఖాన్. తొలుత సినీ పరిశ్రమ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఆమె.. నవంబరు 20న సూరత్‌కు చెందిన ముఫ్తీ అనాస్‌ను నిఖా(ముస్లిం పద్ధతిలో పెళ్లి) చేసుకుంది. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులే ఈ వేడుకకు హాజరయ్యారు.
నేహా కక్కర్-రోహన్ ప్రీత్ సింగ్
బాలీవుడ్ ప్రముఖ గాయని నేహా కక్కర్.. పంజాబీ నటుడు, గాయకుడు రోహన్ ప్రీత్ సింగ్‌ను అక్టోబర్ 24న దుబాయ్‌లో పెళ్లి చేసుకుంది. రెండు సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది.
హాలీవుడ్
లిల్లీ ఎలెన్-డేవిడ్ హార్బర్
'స్ట్రేంజర్ థింగ్స్' ఫేమ్ ప్రముఖ నటుడు డేవిడ్ హార్బర్.. ప్రముఖ గాయని లిల్లీ ఎలెన్‌ను సెప్టెంబరు 10న పెళ్లి చేసుకున్నారు. లాస్‌వెగాస్‌లోని ప్రఖ్యాత గ్రేస్లాండ్ చాపెల్ వీరి వివాహనికి వేదికైంది. కరోనా కారణంగా అతి తక్కువ మంది మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.
స్కార్లెట్ జాన్సన్-కొలిన్ జోస్ట్
అమెరికన్ ప్రముఖ గాయని, నటి స్కార్లెట్ జాన్సన్, హాస్యనటుడు కొలిన్ జోస్ట్.. ఈ అక్టోబర్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
ఇదీ చూడండి : నిహారిక పెళ్లి.. పవన్ కల్యాణ్ రాకతో సందడే సందడి