ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్.. బుధవారం 50 ఏళ్లు నిండక ముందే తుదిశ్వాస విడిచాడు. చాలా తక్కువ వయసులోనే మరణించాడు. అయితే ఇతడే కాకుండా చాలా మంది తెలుగు సినీ ప్రముఖులు ఇలానే ఆకస్మికంగా మృతి చెందారు. ఈ జాబితాలో అలనాటి సావిత్రి, రియల్ స్టార్ శ్రీహరి, ఆర్తి అగర్వాల్, దివ్యభారతి, ఉదయ్ కిరణ్, సౌందర్య తదితరులు ఉన్నారు.
ఉదయ్ కిరణ్- హీరో
ప్రేమకథా చిత్రాలతో గుర్తింపు పొందిన ఉదయ్‌కిరణ్.. 34 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు. కారణాలు ఏమైనప్పటికీ తక్కువ వయసులోనే మరణించాడు. చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే సినిమాలతో ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు.
సౌందర్య-హీరోయిన్
1990-2000 మధ్యలో టాలీవుడ్ అగ్రహీరోలందరితో నటించిన హీరోయిన్ సౌందర్య. అయితే 2004లో భాజపా తరఫున ప్రచారం చేస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో తక్కువ వయసులోనే (32 ఏళ్లు) మరణించింది.
రియల్ స్టార్ శ్రీహరి- నటుడు
పలు చిత్రాల్లో హీరోగా, సహాయపాత్రల్లో, విలన్‌గా నటించిన శ్రీహరి.. 49 ఏళ్ల వయసులోనే కన్నుమూశాడు. 2013లో 'రాంబో రాజ్ కుమార్' షూటింగ్ కోసం ముంబయి వెళ్లిన ఈ నటుడు.. అక్కడే అనారోగ్యం పాలయ్యాడు. చికిత్స పొందుతూ లీలావతి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు.
మహానటి సావిత్రి
మహానటి సావిత్రి.. కేవలం 45 ఏళ్ల వయసులో లోకాన్ని విడిచి వెళ్లింది. కానీ ఆమె నటించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. 1935లో జన్మించిన సావిత్రి.. 1981లో కన్నుమూసింది. ఈమె జీవితం ఆధారంగా 'మహానటి' సినిమా తెరకెక్కింది.
ఆర్తి అగర్వాల్- హీరోయిన్
హీరోయిన్ ఆర్తి అగర్వాల్ 31 ఏళ్ల వయసులో మృతి చెందింది. బరువు తగ్గిందేకు లైపో ఆపరేషన్ చేస్తుండగా విఫలమై ఆమె చనిపోయిందనే ప్రచారం ఉంది. 2014లో ఈ కథానాయిక మరణించింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆర్తి.. ఆ తర్వాత అగ్ర హీరోల సరసన పలు హిట్ సినిమాలెన్నింటిలోనో నటించింది.
చక్రి-సంగీత దర్శకుడు
టాలీవుడ్లో ఎన్నో హిట్ సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన చక్రి.. 2014 డిసెంబర్‌లో గుండెపోటుతో మరణించాడు. అప్పుడు ఆయన వయసు 40 ఏళ్లే.
దివ్యభారతి- హీరోయిన్
తెలుగులో 'బొబ్బిలిరాజా' సినిమాతో గుర్తింపు పొందిన హీరోయిన్ దివ్యభారతి.. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఆకస్మికంగా మృతి చెందింది. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఈమె మరణం.
సిల్మ్ స్మిత- నటి
ప్రత్యేక గీతాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి సిల్మ్ స్మిత.. 36 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. ఈమె ఆత్మహత్య చేసుకోవడం అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. ఈ నటి జీవితం ఆధారం 'డర్టీ పిక్టర్' అనే సినిమా వచ్చింది.
యశో సాగర్- హీరో
ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో... మంచి నటుడిగా గుర్తింపు పొందిన యశో సాగర్.. కారు ప్రమాదంలో ఆకస్మిక మరణం చెందాడు.
వేణు మాధవ్-హాస్య నటుడు
టాలీవుడ్లో హాస్యనటుడిగా పేరు సంపాదించుకున్న వేణు మాధవ్ 1969లో జన్మించాడు. 50 ఏళ్లు నిండకముందే తుదిశ్వాస విడిచాడు. నాల్గవ ఏట నుంచే మిమిక్రీ చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు చిన్న వయసులోనే అందర్నీ విడిచి వెళ్లిపోయాడు.