ప్రస్తుత తరం హీరోయిన్లు కేవలం నటనతోనే కాక విభిన్న రంగాల్లో సత్తాచాటుతున్నారు. సింగర్స్, నిర్మాతలుగానూ రాణిస్తున్నారు. టాలీవుడ్‌లోనూ కొంతమంది మల్టీ ట్యాలెంటెడ్ హీరోయన్లు ఉన్నారు. యాక్టింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాక వారి గాత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో సింగర్స్‌గా మెప్పిస్తోన్న హీరోయిన్లు ఎవరో చూద్దాం.
రాశీఖన్నా
తన అందం, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది రాశీ ఖన్నా. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన 'జవాన్' చిత్రంలో 'బంగారూ' అనే పాటను ఆలపించి మెప్పించింది. అలాగే కొన్ని లైవ్ పర్ఫామెన్స్‌లు కూడా ఇచ్చింది. 'హుషారు' చిత్రంలోని 'ఉండిపోరాదే' కవర్ వెర్షన్‌తో వావ్ అనిపించింది.
శ్రుతి హాసన్
స్టార్ నటుడు కమల్ హాసన్ కూతురిగా సినీరంగ ప్రవేశం చేసినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతి హాసన్. నటిగా మారక ముందు నుంచే శ్రుతి హాసన్ మంచి గాయని.. సంగీత దర్శకురాలు కూడా. పలు ప్రైవేటు ఆల్బమ్స్‌లో పాటలు పాడటంతోపాటు.. తన తండ్రి నటించిన 'ఈనాడు' చిత్రానికి సంగీతం కూడా అందించింది. ఇటీవల 'ఎడ్జ్' అనే వీడియో సాంగ్‌తో విమర్శకుల ప్రశంసలూ అందుకుంది.
నిత్యా మేనన్
విభిన్నమైన కథల్ని ఎంచుకుంటూ తనలోని నటిని ప్రేక్షకులకు పరిచయం చేసిన నిత్యా మేనన్ మంచి గాయని కూడా. మలయాళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ పలు పాటలు పాడింది. 'ఇష్క్'తో పాటు 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రాల్లో తన గాత్రాన్ని సవరించుకుంది.
స్వాతి రెడ్డి
'అష్టా చెమ్మా', 'స్వామిరారా', 'కార్తికేయ' వంటి చిత్రాలతో టాలీవుడ్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది స్వాతి. కానీ ఆ తర్వాత వెండితెరకు దూరమైంది. ఈమె మంచి గాయని కూడా. '100% లవ్', 'కథా స్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పలరాజు', 'స్వామి రారా' వంటి చిత్రాల్లో పాటలు పాడింది.
లక్ష్మీ మంచు
మోహన్‌బాబు కూతురిగా వెండితెరకు పరిచయమై నటిగా గుర్తింపు తెచ్చుకుంది లక్ష్మీ మంచు. నిర్మాతగా, యాంకర్‌గానూ రాణిస్తోంది. క్లాసికల్ సింగింగ్‌లో పరిచయమున్నా ఎప్పుడూ పాటలు పాడలేదు. అయితే 'దొంగాట'లో ఓ సాంగ్‌తో ప్లేబ్యాక్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.