డాక్టర్ కావాలని యాక్టర్ అయిన నటులు చాలామంది ఉన్నారు. అయితే ఈ తారలు మాత్రం క్రీడల్లో మెరిసి, నటనలోకి వచ్చారు. ఇంతకీ వాళ్లెవరూ... ఆడిన ఆటలు ఏంటంటే?
వారానికోసారి గోల్ఫ్: రకుల్
చిన్నప్పుడు దిల్లీలో ఉండేవాళ్లం. అక్కడ మేమున్న ఆర్మీ క్వార్టర్స్‌లో గోల్ఫ్ మైదానాలు ఉండేవి. గోల్ఫ్ ఆడమని నాన్న ప్రోత్సహించడం వల్ల అయిష్టంగానే మైదానంలో అడుగుపెట్టా. క్రమంగా ఆటపై ఇష్టం పెరిగి ఆపై వ్యసనంగా మారింది. దాంతో సమయం దొరికితే గోల్ఫ్ కోర్టులోనే ఉండేదాన్ని. అలా స్కూల్ స్థాయితో మొదలుపెట్టి జాతీయస్థాయి వరకూ పలు ఛాంపియన్‌షిప్పుల్లో ఆడి ఎన్నో పతకాలు అందుకున్నా. అందుకే ఇంటర్‌లో స్కూల్ స్పోర్ట్స్ కెప్టెన్ అయ్యా. ఇప్పటికీ వారానికోసారి గోల్ఫ్ ఆడతా.
బ్యాడ్మింటన్‌లో ఛాంపియన్‌ను: సుధీర్‌బాబు
నాకు చిన్నప్పట్నుంచీ బ్యాడ్మింటన్ అంటే ఇష్టం. ఆ ఆసక్తితోనే శాయ్‌లో స్కాలర్‌షిప్పుకు ఎంపికయ్యా. దాంతో శాయ్ హాస్టల్‌లో ఉంటూనే చదువుకున్నా. ఇంజినీరింగ్ కోసం మాత్రం బెంగళూరు వెళ్లా. అక్కడ ప్రకాశ్ పదుకొణె అకాడమీలో పుల్లెల గోపీచంద్‌తో కలిసి సాధన చేసేవాడిని. ఇద్దరం సింగిల్స్, డబుల్స్ ఆడేవాళ్లం. నేను జూనియర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఛాంపియన్‌ను. తను మెన్స్ విభాగంలో ఛాంపియన్. అయితే సినిమాల్లోకి రావడంతో ఆటకు దూరమయ్యా. ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లో గోపీగా కనిపించబోతున్నా. అందుకే మళ్లీ రాకెట్ పట్టుకుని కోర్టులో అడుగుపెట్టా.
టెన్నిస్ ఇష్టం: నాగశౌర్య
చిన్నప్పట్నుంచీ చదువుకంటే ఆటల్నే ఎక్కువగా ఇష్టపడేవాడిని. అందుకే హీరోనయ్యాక క్రీడల నేపథ్యంలో ఓ సినిమా అయినా చేయాలనుకున్నా. ఇప్పుడు నా 20వ చిత్రంలో విలువిద్య క్రీడాకారుడిగా కనిపించబోతున్నా. ఈ లాక్‌డౌన్‌లో కష్టపడి కండల్ని పెంచాను. ఇందుకు జిమ్‌లో వ్యాయామాలూ, ఆహారంతోపాటూ చిన్నప్పుడు నేను ఆడిన టెన్నిస్ నాకెంతో ఉపయోగపడింది. స్కూల్‌లో ఉన్నప్పుడు బాగా ఆడేవాడిని. మా టీచర్లు కూడా ఎంతో ప్రోత్సహించేవారు. అందుకే జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొనగలిగా. హీరోనయ్యాకా ఆటమీద ఇష్టంతో ఆడుతూనే ఉన్నా.
రాకెట్‌బాల్ ఆడతా: అవసరాల శ్రీనివాస్
అమెరికా, జపాన్, కొరియా, కెనడాల్లో బాగా ఆడే రాకెట్‌బాల్‌కు మన దగ్గర ఆదరణ చాలా తక్కువ. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఈ ఆటపై ఆసక్తి కలిగింది. తెల్లవారుజామున నాలుగ్గంటలకే లేచి ఎనిమిదింటి వరకూ సాధన చేసేవాడిని. కొన్నాళ్లకు ఒక్లహామా రాకెట్‌బాల్ అసోసియేషన్‌లో చేరి అక్కడ జాతీయస్థాయి ఛాంపియన్‌షిప్పుల్లోనూ పాల్గొన్నా. యాక్టింగ్ కోర్సు నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాక నాతో కలిసి ఈ ఆట ఆడేవాళ్లే కరవయ్యారు. 2014లో దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్పులో పాల్గొన్నా. అంతకు ముందు జరిగిన ఓ పోటీలో స్వర్ణం అందుకున్నా. ప్రస్తుతం మనదేశంలోని రాకెట్‌బాల్ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో నేనూ ఒకడిని.
బాక్సింగ్ వదల్లేదు: రితికా సింగ్
'గురు'లో కిక్‌బాక్సర్‌గా కనిపించిన నేను నిజజీవితంలోనూ బాక్సర్‌నే. మార్షల్ ఆర్ట్స్‌లోనూ ఎక్స్‌పర్ట్‌ను. చిన్నతనం నుంచి వాటిని నాన్న నేర్పించేవారు. 2009లో ఏషియన్ ఇండోర్ గేమ్స్‌లో ఆడి పతకం అందుకున్నా. పలు బాక్సింగ్ లీగ్‌ల్లోనూ పాల్గొనేదాన్ని. అప్పుడే 'గురు'ను మూడు భాషల్లో తీసిన సుధ కొంగర నన్ను చూసి ఆ సినిమా కోసం ఎంపిక చేశారు. అందుకు నాకు భాషకొకటి చొప్పున మూడు జాతీయ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి. ఇక అప్పట్నుంచీ తెలుగు, మలయాళం, తమిళంలో సినిమాలు చేస్తూనే ఉన్నా. అలాగని బాక్సింగ్‌ను పక్కన పెట్టలేదు. ఇప్పటికీ రోజూ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటా.