వరుస సినిమాలతో బిజీగా ఉండే టాలీవుడ్ హీరోలు నిర్మాణ రంగంపై తమదైన ముద్రవేస్తున్నారు. అటు హీరోలుగా సినిమాల్లో నటిస్తూనే ఇటు నిర్మాతలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ అగ్ర, యువ హీరోలు నిర్మాతలుగా మారి మంచి విజయాలను అందుకున్నారు. మరికొందరు నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. నిర్మాతలుగా మారిన హీరోలపై ఓ లుక్కేద్దాం!
తండ్రి హీరోగా తనయుడు నిర్మాతగా
'ఖైదీ నంబర్ 150' చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంతో రామ్‌చరణ్ నిర్మాతగా మొదటి అడుగు వేశాడు. దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.170 కోట్లకు పైగా వసూలు చేసిందని సినీ విశ్లేషకులు అంచనా. చిరంజీవి 'సైరా'కు చెర్రీనే నిర్మాత. ఇందుకోసం దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌ను పెట్టాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి చిరు-కొరటాల శివ మూవీ 'ఆచార్య'కు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

'శ్రీమంతుడు'తో మొదలు పెట్టి
'శ్రీమంతుడు'తో నిర్మాతగా మారాడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ (ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్) పతాకంపై తెరకెక్కిన ఆ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 'బ్రహ్మోత్సవం' మహేశ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇటీవల విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు'తో కథానాయకుడిగానే కాకుండా నిర్మాతగానూ బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు అడివి శేష్ 'మేజర్'కు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

యువ దర్శకులను ప్రోత్సహించేందుకు
విభిన్నకథతో తీసిన చిత్రం 'అ!'తో నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. వాల్ పోస్టర్ సినిమా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. కాజల్, రెజీనా, నిత్యామేనన్, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా.. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ మేకప్ విభాగాల్లో జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. విశ్వక్‌సేన్ 'హిట్'తో ఈ ఏడాది నిర్మాతగా నాని మంచి విజయాన్ని అందుకున్నాడు. మంచి కథలతో వచ్చే యువ దర్శకులను ప్రోత్సహించడానికి తాను ముందుంటానని ఇటీవలే చెప్పుకొచ్చాడు నాని.

సరికొత్త ప్రయత్నం
'అర్జున్ రెడ్డి'తో అభిమానుల రౌడీగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత 'కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్' పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించి 'మీకు మాత్రమే చెప్తా'ను నిర్మించాడు. 'పెళ్లి చూపులు'తో తనను హీరోగా పరిచయం చేసిన తరుణ్ భాస్కర్‌ను కథానాయకుడిగా పరిచయం చేశాడు.

రీఎంట్రీతో రెండు బాధ్యతలు
'అహం బ్రహ్మస్మి' సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్నాడు కథానాయకుడు మంచు మనోజ్. 'ఒక్కడు మిగిలాడు' సినిమా తర్వాత దాదాపు మూడేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్.. గతేడాది ఎంఎం ఆర్ట్స్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ప్రస్తుతం అతడు హీరోగా 'అహం బ్రహ్మస్మి' చిత్రాన్ని ఈ బ్యానర్‌పైనే మంచు నిర్మలా దేవి, మంచు మనోజ్ నిర్మిస్తున్నారు.

కథ నచ్చితే
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు కింగ్ నాగార్జున. తాను నటించే సినిమాలే కాకుండా తన తనయులకు సంబంధించిన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అంతేకాదు, కథాబలమున్న 'నిర్మలా కాన్వెంట్', 'ఉయ్యాల జంపాలా' చిత్రాలను తీసి, మంచి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం 'వైల్డ్‌డాగ్'తో పాటు బాలీవుడ్‌లో 'బ్రహ్మస్త్ర'లో నటిస్తున్నాడు.

తనకోసమే కాదు.. తమ్ముడి కోసం
'అతనొక్కడే' సినిమాతో కల్యాణ్‌రామ్ హీరోగానే కాకుండా నిర్మాతగాను మంచి విజయాన్ని అందుకున్నాడు. యన్.టి.ఆర్ ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి తన సినిమాలతోపాటు ఎన్టీఆర్ 'జైలవకుశ'ను నిర్మించాడు. 'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు కల్యాణ్‌రామ్ ఓ నిర్మాత.

అభిరుచి గల నటుడు
'బొమ్మలాట'.. విభిన్న కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి రానా సహ నిర్మాతగా వ్యవహరించాడు. 2004లో విడుదలైన ఈ సినిమా.. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. వెంకటేశ్ మహ దర్శకత్వం వహించిన 'కేరాఫ్ కంచరపాలెం'కు రానా సమర్పకుడు. 2018లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. దీంతోపాటు బుల్లితెరలో ప్రసారమయ్యే 'నెం1 యారీ' షోకు రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

అన్నీ తానై
'బిచ్చగాడు'గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ. అతడు ప్రధాన పాత్రలో నటించిన 'నన్' సినిమాతో విజయ్ ఆంటోనీ నిర్మాతగా మారాడు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై తాను కథానాయకుడిగా తెరకెక్కిన ప్రతి సినిమాకు విజయ ఆంటోనీనే నిర్మాతగా వ్యవహరించాడు. నిర్మాతగానే కాకుండా తన సినిమాలకు విజయ్ మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్‌గానూ పనిచేశాడు.

త్రిపాత్రాభినయం
'పల్నాడు'తో నిర్మాతగా మారాడు కోలీవుడ్ నటుడు విశాల్. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో 2013లో నిర్మాణ సంస్థను స్థాపించి.. తాను హీరోగా నటించిన 'పందెంకోడి 2', 'డిటెక్టివ్' లాంటి చిత్రాలను నిర్మించాడు. ప్రస్తుతం అతడు నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం 'డిటెక్టివ్ 2'. దీనికి దర్శకత్వం వహించడం మరో విశేషం.

దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలూ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సల్మాన్‌ఖాన్‌కు 'సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్', షారుక్‌కు 'రెడ్ చిల్లీస్', అక్షయ్ కుమార్‌కు 'హరి ఓమ్ ఎంటర్‌టైన్‌మెంట్', బిగ్‌బికి 'అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్' పేరుతో నిర్మాణ సంస్థలు ఉన్నాయి.
ఇదీ చూడండి : అల్లు అయాన్‌కు విషెస్ చెప్పిన బాలీవుడ్ హీరో