ఆరడగుల అందగాడు కాదు.. ఆరు పలకల దేహం లేదు.. అదిరిపోయే డ్యాన్సులు చేయలేడు.. ఓ బక్కపలచటి రూపం.. ఆ రూపానికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు.. చిన్న మేనరిజానికే ఈలలు, గోలలతో మైమరిచిపోతారు ప్రేక్షకులు. అతడే శివాజీ రావ్ గైక్వాడ్.. కానీ అందరికి సూపర్ స్టార్ రజనీకాంత్ అంటేనే గుర్తుకువస్తాడు. స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రజనీని సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా ఆయన జీవిత ప్రయాణాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం.
బాలచందర్ చెక్కిన శిల్పం..
రజనీ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. 1950 డిసెంబరు 12న కర్ణాటకలో జన్మించారు. కొన్నాళ్లు కండక్టర్‌గా పనిచేసి.. నటనపై మక్కువతో చెన్నైకి వెళ్లారు. మద్రాసు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి యాక్టింగ్‌లో డిప్లొమా చేశారు. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన 'అపూర్వ రాగంగల్'లో తొలి అవకాశం అందుకొన్నారు.
అంతులేని కథతో తెలుగులో అరంగేట్రం..
అనంతరం కన్నడలో కథా సంగమ అనే చిత్రం చేశారు. తెలుగులో మళ్లీ బాలచందర్ దర్శకత్వంలోనే అంతులేని కథ, తమిళంలో మూడ్రు ముడిచు అనే చిత్రాలు చేసి తిరుగులేని నటుడిగా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో వరుసగా నటిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆరంభంలో విలన్‌గా భయపెట్టి..
1977లో రజనీకాంత్ 15 సినిమాలు చేస్తే అందులో ఎక్కువగా వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్రలే చేశారు. మొదట ప్రతినాయకుడిగా నటించి పేరు తెచ్చుకొన్న ఆయన ఆ తరువాత కథానాయకుడిగా వరుస విజయాలు అందుకొన్నారు. 80, 90వ దశకాల్లో చేసిన సినిమాలు ప్రభంజనం సృష్టించాయి.
తెలుగులోనూ సూపర్‌స్టార్..
దళపతి, నరసింహ, బాషా, ముత్తు, పెదరాయుడు, అరుణాచలం తదితర చిత్రాలు తమిళంతో పాటు, తెలుగులోనూ విశేష ఆదరణని సొంతం చేసుకొన్నాయి. చంద్రముఖి, శివాజీ, రోబో తదితర చిత్రాలు రజనీ స్థాయిని మరింత పెంచాయి. 2.ఓ ప్రపంచవ్యాప్తంగా సంచలనాల్ని సృష్టించింది. రజనీ కథానాయకుడిగా భారతదేశంలోనే అత్యధిక వ్యయంతో చిత్రం తెరకెక్కిందంటే ఆయన స్థాయి అర్థం చేసుకోవచ్చు.
నిరాడంబరంగా ఉండేందుకే ప్రాధాన్యం..
కథానాయకుడిగా కోట్లాది మంది గుండెల్లో ఉన్నా.. తిరుగులేని స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకొన్నా.. సాధారణ జీవితాన్ని కొనసాగించడానికే ఇష్టపడతారు రజనీకాంత్. తన బాల్యమిత్రుడి ఇంటికి వెళ్లి వాళ్లతో కలిసి సాధారణంగా గడపడం, వీలైనప్పుడల్లా హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేయడం ఆయనకు అలవాటు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన తత్వం ఆయన అభిమానులకు మరింతగా నచ్చుతుంటుంది.
అవార్డులు దాసోహం..
1981లో లతను వివాహం చేసుకొన్న రజనీకాంత్‌కు ఐశ్వర్య, సౌందర్య కుమార్తెలు. 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాల్ని స్వీకరించారు రజనీ. దేవుడి శాసించినప్పుడు రాజకీయాల్లోకి వస్తానని చెబుతూ వచ్చిన రజనీకాంత్ 2017 డిసెంబరు 31న రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించారు. వచ్చే జనవరిలో పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి పెడుతూనే, మరోపక్క వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్‌ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం 'అన్నాత్తే'లో నటిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రజనీ పలికిన పంచ్ డైలాగ్‌లు..
'నాన్నా.. పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది', 'బాషా ఒక్కసారి చెబితే.. వందసార్లు చెప్పినట్టే', 'ఆ దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు', 'నా దారి రహదారి..' ఇలాంటి సంభాషణలతో బాక్సాఫీసుని హోరెత్తించారు రజనీకాంత్. భారతదేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ ఆయనకు అభిమానులున్నారు. రజనీ సినిమా వస్తోందంటే దాని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే ఆయనకున్న ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.