సరికొత్త చిత్రాలతో ఈ దీపావళి మరింత ప్రత్యేకం కాబోతోంది. ఒకప్పుడు పండగ సెలవులు వస్తే థియేటర్ల వైపు చూసే వాళ్లం. కరోనా వల్ల థియేటర్లు మూతపడటం వల్ల పెద్ద ప్రాజెక్టులను కూడా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో ఇంట్లోనే కూర్చొని ఇష్టమైన సినిమా చూసే వెసులుబాటు లభించింది. ఈ దీపావళికి అక్షయ్ కుమార్ 'లక్ష్మి', సూర్య 'ఆకాశం నీ హద్దురా!', కీర్తి సురేశ్ 'మిస్ ఇండియా' తదితర సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. నవంబరులో మనల్ని అలరించడానికి సిద్ధమైన సినిమాల జాబితా చూద్దాం..

మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి వ్యాపార రంగంలో రాణించాలని చిన్నతనం నుంచి కలకంటుంది. ఆర్థిక సమస్యల్ని దాటి.. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. 'మిస్ ఇండియా' అనే బ్రాండ్‌తో విదేశాల్లో ఛాయ్ కంపెనీ పెడుతుంది. ఈ కథాంశంతో వస్తోన్న సినిమా 'మిస్ ఇండియా'. కీర్తి సురేశ్ టైటిల్ రోల్ పోషించారు. నరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు, నదియా, నరేష్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. నవంబరు 4న నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా విడుదల కాబోతోంది.

ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా రూపొందించిన సినిమా 'ఆకాశం నీ హద్దురా!'. సూర్య కథానాయకుడిగా నటించారు. అతి తక్కువ ధరలతో ప్రతి భారతీయుడు విమాన ప్రయాణం చేసే విధంగా ఓ గ్రామానికి చెందిన యువకుడు కనే అసాధ్యమైన కలే ఈ చిత్రం. సుధా కొంగర దర్శకురాలు. అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబరు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దక్షిణాదిలో హిట్ అందుకున్న 'కాంచన' ఉత్తరాదిలోనూ వినోదం పంచడానికి సిద్ధమైంది. ఈ సినిమా రీమేక్‌లో అక్షయ్ కుమార్ నటించగా.. రాఘవా లారెన్స్ తెరకెక్కించారు. మంచి సందేశంతోపాటు వినోదాత్మక కథతో రూపొందిన ఈ చిత్రానికి తొలుత 'లక్ష్మీ బాంబ్' అనే టైటిల్ పెట్టారు. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని 'లక్ష్మీ'గా మార్చారు. ఈ చిత్రం కోసం అక్షయ్ తొలిసారి చీరకట్టి.. మహిళ గెటప్‌లో కనిపించారు. నవంబరు 9న డిస్నీ+హాట్‌స్టార్‌లో చిత్రం విడుదల కాబోతోంది.

అనేక విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నయనతార అమ్మవారి పాత్రలో నటించిన సినిమా 'అమ్మోరు తల్లి'. ఎన్.జె. శరవణన్, ఆర్.జె. బాలాజీ దర్శకత్వం వహించారు. వినూత్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా నవంబరు 14న డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నయనతార ఇప్పటికే 'శ్రీరామరాజ్యం'లో సీతగా నటించి, మెప్పించారు. మరోసారి దేవత పాత్రలో కనిపించబోతున్నారు.

రాజ్ కుమార్ రావ్, నుస్రత్ బరుచా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఛలాంగ్'. స్పోర్ట్స్ కామెడీగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హరియాణాలోని ఒక గ్రామంలోగల ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వ్యాయామ ఉపాధ్యాయుడిగా రాజ్‌కుమార్ రావ్ కనిపించనున్నారు. నవంబరు 13న అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.

బాలీవుడ్ స్టార్స్ అభిషేక్ బచ్చన్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, ఆదిత్యా రాయ్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'లుడో'. అనురాగ్ బసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. నాలుగు కోణాల్లో సాగే నాలుగు విభిన్నమైన కథలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా..
'ఆర్‌ఎక్స్ 100'తో అందరి దృష్టిని ఆకర్షించిన కథానాయిక పాయల్ రాజ్‌పూత్ నటించిన సినిమా 'అనగనగా ఓ అతిథి'. చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. నవంబరు 13న ఆహాలో ఈ సినిమా విడుదల కాబోతోంది. డి. పద్మనాభం దర్శకత్వం వహించారు.

తమిళ స్టార్ విజయ్ సేతుపతి మరో విభిన్నమైన స్క్రిప్టుతో అలరించబోతున్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన 'పిజ్జా 2' నవంబరు 1న విడుదల కాబోతోంది. శ్రేయాస్ ఈటీలో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను డీవీ సినీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.

సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్ నటించిన సినిమా 'మా వింత గాధ వినుమా'. దీపావళి సందర్భంగా నవంబరు 13న ఆహాలో ఈ సినిమా విడుదల కాబోతోంది.

అర్జున్ దాస్, వినోద్ కిషన్, పూజా రామచంద్రన్, మిశా ఘోషల్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'అంధకారం'. వి. విఘ్నరాజన్ దర్శకుడు. ప్రియా అట్లీ, సుధన్ సుందరం, జయరాం, పూర్ణ చంద్ర నిర్మించారు. నవంబరు 24న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది.

సైకో థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం 'గతం'. భార్గవ, రాకేష్, పూజిత ప్రధాన పాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్‌లో నవంబరు 6న సినిమా విడుదల కాబోతోంది.
