'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలోని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ ఇద్దరితో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రమిది. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవిత కథలను స్ఫూర్తిగా తీసుకుని రూపొందిస్తున్న సినిమా కావడం వల్ల అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అల్లూరిగా చెర్రీ, భీమ్‌గా తారక్ కనిపించనున్నారు. వీరు సినిమాలో ఎలా ఉంటారో అని ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో సందేహం మొదలైంది. చిత్రీకరణ దాదాపు 70శాతం పూర్తైనా ఇప్పటివరకు ఫస్ట్‌లుక్స్ విడుదల చేయలేదు. అయితే వీరిద్దరి ఫస్ట్‌లుక్స్ త్వరలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం.
ఇంతకాలం వేచి చూసిన అభిమానులు పండగ చేసుకునేలా చెర్రీ, తారక్ లుక్స్ సిద్ధం చేస్తుందట చిత్రబృందం. ఈ ఇద్దరి నాయకుల పుట్టిన రోజు సందర్భంగా వారి లుక్స్ రిలీజ్ చేయనున్నారట. మార్చి 27న అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, మే 20న కొమురం భీమ్‌గా తారక్ దర్శనమివ్వనున్నారని ప్రచారం సాగుతుంది. కొన్ని రోజుల్లో 'ఆర్‌ఆర్‌ఆర్' బృందం నుంచి ఈ విషయం అధికారికంగా వినిపించనుంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, అలియా భట్ నాయికలు. 2021 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి: 'సింగిల్ కింగులం.. మేమే గబ్బర్ సింగులం'