తాను ప్రేమలో ఉన్నానంటూ ఎన్నో సందర్భాల్లో వార్తలు వచ్చాయని.. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు అనన్య పాండే. తను చెప్పడానికంటే ముందే అమ్మవాళ్లకి ఆ రూమర్స్ గురించి తెలుసని పేర్కొన్నారు. జీవితంలో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం వల్ల తనని పూర్తిగా నమ్ముతారని వెల్లడించారు. తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
"స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో నటిగా వెండితెరకు పరిచయమయ్యాను. అది మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత నటించిన 'పతీ పత్నీ ఔర్ ఓ' సినిమా కూడా ప్రేక్షకులను బాగా అలరించింది. అలా వెంట వెంటనే తొలి రెండు సినిమాలతో హిట్ అందుకున్నా. హ్యాట్రిక్ గురించి ఎలాంటి ఒత్తిడి లేదు. నటిగా మంచి గుర్తింపు పొందేందుకు ఎంతో శ్రమిస్తున్నా. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నా. నటిగా రాణించేందుకు ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నా.".
"ఇషాన్ ఖట్టర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'కాలీ పీలీ' చిత్రంలో నటిస్తున్నా. కేవలం ఒక్కరోజు షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమాను జూన్ నెలలో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కాకపోతే పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. విడుదల తేదీలో మార్పులుంటాయి. దీనితోపాటు షాకున్ బత్రా చిత్రంలో నటించాల్సి ఉంది. ఆయన చెప్పిన కథ బాగా నచ్చింది షూటింగ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు" వెల్లడించిందీ బాలీవుడ్ భామ.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫైటర్'(వర్కింగ్ టైటిల్) చిత్రంతో తెలుగువారిని పలకరించేందుకు సిద్ధమైంది అనన్య. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా కనిపించనున్నారు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముంబయిలో జరిగిన షెడ్యూల్లో హీరోహీరోయిన్లపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
ఇదీ చూడండి... మహేశ్‌కు పోటీగా గౌతమ్.. ఎవరు గెలిచారు!