చిత్రసీమలో ఏ కథ ఎవరికి రాసిపెట్టుందో ఎవరూ చెప్పలేరు. ఎవరికోసమో ఓ కథ సిద్ధం అవుతుంది. ఆ సమయంలో వాళ్లు చేయడం కుదరలేదంటే.. అందులో ఇంకొకరెవరో నటిస్తుంటారు. అలా హీరోలు మారిన కథలెన్నో! పాత్రలు కూడా అంతే. ప్రత్యేకంగా ఒకర్ని దృష్టిలో ఉంచుకుని రాసిన పాత్రలైనా సరే.. ఆయా నటులకి డేట్లు కుదరకో లేక, పారితోషికం నచ్చలేదంటేనో అనూహ్యంగా మరొకరు ఎంపికవుతుంటారు. అలా కొద్దిమంది కథానాయికలూ ఇటీవల అనుకోకుండా అవకాశాల్ని సొంతం చేసుకున్నారు. ముందు ప్రచారంలోకి వచ్చింది ఒకరైతే... ఆ అవకాశం సొంతమైంది మరొకరికి!
తొలిసారి ప్రభాస్‌తో
తెలుగు యువతరం స్టార్ కథానాయకుల్లో ప్రభాస్‌తో తప్ప అందరితోనూ నటించానని చెప్పేవారు శ్రుతిహాసన్. ప్రభాస్‌తో కలిసి నటించాలని ఉందన్న ఆమెకి ఆ అవకాశం 'సలార్'తో రానే వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో కథానాయికగా పలువురు బాలీవుడ్ భామల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఎవరూ ఊహించని రీతిలో, అప్పటిదాకా రేసులో లేని శ్రుతిహాసన్ ఆ అవకాశాన్ని సొంతం చేసుకుంది.
చివరి నిమిషంలో
ఒక కథానాయిక ఎంపికైంది. ఆమె కెమెరా ముందుకీ వచ్చింది. కానీ చివరి నిమిషంలో ఆమె స్థానంలో మరొకరు వచ్చారు. ఇదంతా ప్రగ్యా జైశ్వాల్ ముచ్చటే. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆ చిత్రం కోసం మలయాళ భామ ప్రయాగ మార్టిన్‌ని ఎంపిక చేశారు. ఆ తర్వాత సాయేషా సైగల్ పేరు తెరపై కొచ్చింది. వాళ్లిద్దరూ కాకుండా అనూహ్యంగా ప్రగ్యా జైశ్వాల్ అవకాశాన్ని సొంతం చేసుకుంది.
పవన్ చిత్రం కోసం
కథానాయికలకి పవన్‌కల్యాణ్ చిత్రంలో అవకాశం అంటే వాళ్ల కెరీర్ మరో మెట్టు ఎక్కినట్టే లెక్కగా భావిస్తుంటారు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నిధి అగర్వాల్ ఓ కథానాయికగా ఎంపికైంది. ఈ చిత్రం విషయంలోనూ బాలీవుడ్‌లో నటిస్తున్న అగ్ర కథానాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటిదాకా యువ హీరోలతోనే నటించిన నిధి, తొలిసారి ఓ అగ్ర కథానాయకుడి సినిమా సొంతం చేసుకున్నట్టైంది.
సిద్ధకి జోడీగా
'ఆచార్య'లో రామ్‌చరణ్‌కి జోడీగా పూజాహెగ్డే నటించనుంది. ఈ పాత్ర కోసం మొదట రష్మిక మందన్న, కియారా అడ్వాణీ తదితరుల్ని సంప్రదించారు. చివరికి ఆ పాత్ర వరుస అవకాశాలతో జోరుమీదున్న పూజాహెగ్డే సొంతమైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే పూజా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.