చిత్ర పరిశ్రమలో జంతువులు ప్రధాన పాత్రల్లో అనేక సినిమాలు తెరకెక్కాయి. వీటిలో చాలా వరకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. తెలుగులో 'రాజేంద్రుడు గజేంద్రుడు' చిత్రమే ఉదాహరణ. మామూలు సినిమాలతో పోల్చితే జంతువులతో సినిమా చిత్రీకరణ జరపడం కాస్త కష్టం. అందుకే ఈ తరహా చిత్రాలు చేయడానికి దర్శక, నిర్మాతలు త్వరగా సాహసం చేయరు.
కానీ, తాజాగా రానా కథానాయకుడిగా తెరకెక్కిన 'అరణ్య' కోసం మాత్రం ఆ చిత్రబృందం అనేక కష్టనష్టాలను కోర్చి మరీ ఓ అద్భుత దృశ్య కావ్యాన్ని తెరపై చూపించేందుకు సిద్ధమైంది. అడవిని నమ్ముకుని ఉన్న ఓ ఆదివాసి కథతో రూపొందుతోంది ఈ చిత్రం.
ఈ చిత్ర కథా నేపథ్యం దృష్ట్యా ఇందులో రానాతో పాటు కొన్ని ఏనుగులు ప్రధాన పాత్రలుగా నటించాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్‌లో ఆ ఏనుగులతో కలిసి రానా చేసిన సాహసాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ‘అరణ్య’లో నటించిన ఏనుగులకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.
"ఏనుగులతో ఒక భాషలో సినిమా చేయడమే కష్టం. అలాంటిది 30 ఏనుగులతో మూడు భాషల్లో ఒకేసారి ఓ సినిమా తెరకెక్కించడమంటే ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి. ఇలాంటి కష్టమైన ప్రయాణాన్ని మేం రెండేళ్ల పాటు ఎంతో సంతోషంగా ఆస్వాదించాం. ముఖ్యంగా ఇలాంటి చిత్రాన్ని ఒప్పుకున్నందుకు రానాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ సినిమా కోసం ఆయన తనని తాను ఓ ‘అరణ్య’గా మార్చుకున్నాడు. సినిమాలో నటించడానికి ముందు ఏనుగులతో కలిపి ట్రైనింగ్ ఇచ్చాం. రానాతో అవి మచ్చిక కావడానికి చాలా సమయమే పట్టింది. ఈ ఏనుగులను ఎంపిక చేసుకోవడానికి చాలా కష్టాలే చూశాం. ముఖ్యంగా లీడర్ ఏనుగు కోసం ప్రత్యేక ఆడిషనే నిర్వహించామంటే దీని కోసం మేమెంత కష్టపడ్డామో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు చిత్రీకరణ చేస్తుంటే ఒళ్లు నొప్పులొచ్చేసేవి. చిత్రబృందంలోని ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎన్నో త్యాగాలు చేశారు."
-చిత్రబృందం ట్వీట్.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోన్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది హిందీలో ‘హాథీ మేరే సాథి’, తమిళ్‌లో ‘కాందన్’ పేరుతో విడుదల కానుంది.
"అసోంలో జరిగిన ఓ వ్యక్తి నిజ జీవితం ఆధారంగా ‘అరణ్య’ను రూపొందించారు.ఆయన పేరు జాదవ్ ప్రియాంక్. పద్మశ్రీ అవార్డు అందుకున్న ఆయన తన జీవిత కాలంలో దాదాపు 1300 ఎకరాల అడవిని నాటాడు. బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతంలో ఆయన చేసిన ఈ పని వల్ల అక్కడి భూమి నది కోత నుంచి పరిరక్షించబడింది. ఈ చిత్రం కోసం పని చేసిన రెండేళ్లలో చాలా విషయాలు నేర్చుకున్నా. జీవితం విలువ తెలిసింది."
-రానా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : బల్దేవ్గా రానా 'అరణ్య' పోరాటాలు చూశారా.?