విజయ్, కార్తి ఇద్దరూ తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు. కేవలం తమిళంలోనే కాదు.. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌కూ పరిచయం అక్కర్లేని నటులు. వారిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. ఒకరికొకరు కొత్త కాకపోయినా.. ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన సెట్‌కు వచ్చిన కార్తిని విజయ్ గుర్తుపట్టలేకపోయాడు. ఆయనే కాదు.. విజయ్‌తోపాటు ఉన్నవారెవరూ కార్తిని గుర్తుపట్టలేదు. ఇంతకీ కార్తిని గుర్తించలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా..? అసలేం జరిగిందంటే..!
ఒకే స్టూడియోలో..
కార్తి హీరోగా నటిస్తున్న 'సర్దార్', విజయ్ నటిస్తున్న 'బీస్ట్'.. రెండు చిత్రాల షూటింగ్ చెన్నైలోని ఒకే స్టూడియోలో జరుగుతోంది. 'సర్దార్' చిత్రంలో కార్తి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఒక పాత్రలో పొడవాటి జుట్టు, గుబురు గెడ్డంతో కాస్త వయసుపైబడిన వ్యక్తిగా కనిపించనున్నాడు. అయితే.. విజయ్ కూడా అదే స్టూడియోలో ఉన్నాడని తెలుసుకున్న కార్తి ఆయనను కలుద్దామని వాళ్ల సెట్‌కు బయలుదేరాడట. అయితే.. రెగ్యులర్ లుక్‌లో కాకుండా కాస్టూమ్స్‌తోనే సెట్‌కు వెళ్లాడట. దీంతో అక్కడికి వెళ్లిన కార్తిని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. కాసేపు సెట్లో అటూ ఇటూ తిరిగాడు. 15 నిమిషాల పాటు తిరిగిన తర్వాత చివరగా విజయ్ దగ్గరకు వెళ్లాడు. అయితే.. విజయ్ కూడా కార్తిని గుర్తుపట్టలేకపోయాడట. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత విజయ్‌కు విషయం అర్థమైందట. ఇంకేముంది ఇద్దరూ.. ముసిముసి నవ్వులు నవ్వుకున్నారట. దాదాపు అరగంట పాటు సినిమా ముచ్చట్లు చెప్పుకొన్నారు.
పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తి కథానాయకుడిగా 'సర్దార్' తెరకెక్కుతోంది. రాశీఖన్నా, రజిషా విజయన్ కథానాయికలు. ప్రిన్స్ పిక్చర్స్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. 'సర్దార్' తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అలాగే.. నెల్సన్ దర్శకత్వంలో విజయ్ హీరోగా 'బీస్ట్' రూపొందుతోంది. ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం పంచుకుంది. విజయ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.