సినిమాల్లో తమ అందం, అభినయంతో మనల్ని అలరించే తారలు.. నిజజీవితంలో చిన్నపాటి రైతులుగా మారారు. ఆరోగ్య పరిరక్షణకు ఆకుకూరలు, కాయగూరలు పండిస్తూ తమ ఆసక్తిని చాటుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పాఠాలు - సమంత
వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకునే విలక్షణ నటిగా, అక్కినేని వారింటి కోడలిగా ఆమె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సమంతకు సామాజిక, ఆరోగ్య స్పృహ కాస్త ఎక్కువే. వ్యాయామంపైనే కాదు.. ఆహారం విషయంలోనూ జాగ్రత్త అవసరం అంటోంది. అందుకే ఇంటికి కావలసిన కాయగూరల్ని సేంద్రియ పద్ధతిలో తానే పండించుకుంటూ ఆహా అనిపిస్తోంది. అంతేనా? అందరినీ అదే బాటలో నడిపించడానికి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పాఠాలూ చెబుతోంది. విత్తనాలు నాటే విధానం నుంచి, వాటిపై తీసుకోవలసిన శ్రద్ధ వరకు తరచూ ఏదో ఒక విషయాన్ని ఫాలోవర్లతో పంచుకుంటోంది. ముల్లంగి, క్యారెట్, క్యాబేజ్, బ్రకోలీ, పాలకూర, లెట్యూస్.. ఇలా చాలానే హైడ్రో ఫోనిక్స్ విధానంలో పెంచుతోంది. ఇంటి పంటను ఓ ఉద్యమంలా చేసేందుకు 'గ్రోవిత్‌మీ' పేరుతో ప్రచారమూ నిర్వహించింది. తనలా హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో మొక్కలు పెంచమని రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఛాలెంజ్ కూడా విసిరింది. దాన్ని స్వీకరించిన రకుల్ కూడా సామ్ బాటలోనే వెళుతోంది.
ఆ సవాల్ తీసుకుని.. -రకుల్ ప్రీత్ సింగ్
సమంత 'గ్రోవిత్‌మి' ఛాలెంజ్ తీసుకున్న రకుల్ ప్రీత్ సింగ్...కూడా మిద్దెతోట సాగుని మొదలుపెట్టింది. హైడ్రోఫోనిక్స్ విధానంలో పండిస్తోన్న విధానాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూంది. 'ఇదో గొప్ప అనుభూతి.. విత్తనాలు మొలకెత్తిన దగ్గర్నుంచి పంటకోసే వరకు ప్రతి దశలో ఎంతో సంతోషాన్ని పొందుతున్నా' అంటోంది రకుల్. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయనీ.. అందుకే మనం ప్రకృతిలో మమేకమవ్వాలనీ సూచిస్తోంది.
పిల్లలకూ తెలుస్తుంది.. -సమీరారెడ్డి
బాలీవుడ్ నటి, తెలుగమ్మాయి సమీరారెడ్డి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటుంది. అత్తగారితో కలిసి పలు వీడియోలు చేస్తూ.. సందడి చేస్తుంది. తను పెరటితోట పెంపకంపైనా దృష్టిపెట్టింది. ఇందుకోసం గోవాలోని తన ఇంటి ఆవరణలో కూరగాయల సాగుచేస్తోంది. అక్కడ పిల్లలతో కలసి తోట పనులు చేస్తూ, కూర గాయల్ని కోస్తూ తన సంతోషాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. 'మనం పండించిన పంటల్ని.. మనమే తింటే ఆ సంతోషమే వేరు కదా! అనే సమీర.. ఇది పిల్లలకూ గొప్ప అనుభవం' అని అంటోంది.
ఆసక్తితోనే మొదలుపెట్టా.. -సుహాసిని
నిన్నటి తరం అందాల నటి సుహాసిని.. ఆరోగ్య పరిరక్షణకు సేంద్రియ విధానంలో ఆకుకూరలు, కాయ గూరల పెంపకం కీలకమని చెబుతోంది. అందుకే ఇంటి మిద్దెపైనే హైడ్రోఫోనిక్స్ విధానంలో వీటిని పెంచడానికి అవసరమైన ఏర్పాటూ చేసుకుంది. అప్పుడప్పుడూ తన మిద్దె సాగు వీడియోలను విడుదల చేస్తోంది. పాలకూర, గోంగూర, కొత్తిమీర వంటివే కాదు టొమాటో, వంకాయ, పొట్ల కాయ, గుమ్మడి కాయ, ముల్లంగి, క్యాబేజీ, బీన్స్ వంటి రకరకాల కాయగూరల్నీ పెంచుతోంది. ఆసక్తి ఉంటే.. చిన్న స్థలంలోనే ఎన్నో పెంచుకోవచ్చని సుహాసిని చెబుతోంది.
ప్రపంచాన్ని జయించినంత సంతోషం.. -ప్రీతీజింటా
బాలీవుడ్ నటి ప్రీతి జింటా పెరట్లోనే సేంద్రియ సాగుకి శ్రీకారం చుట్టారు. ఆ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. 'నా ప్రతి అడుగులోనూ అమ్మ పాత్ర ఎంతో. ఇప్పుడు కూరగాయల్నీ పెంచమన్న తన సలహాతోనే.. ఇదంతా మొదలుపెట్టాను. ఇప్పుడు నా ఇంటికి కావాల్సిన కూరగాయాలను నేనే పండించుకొంటున్నాను. దీంతో ప్రకృతికి, భూమాతకు చేరువయ్యాను. ఇప్పుడు ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలుగుతోంది. ఇదిగో నా ఇంటిలో పండిన క్యాప్సికమ్' అంటూ వాటిని తెంపుతూ ప్రీతి జింటా ఓ వీడియోను పోస్టు చేశారు. జైమాతాది, సేంద్రియ వ్యవసాయం, షిమ్లా మిర్చి, టింగ్ అనే హ్యాష్ ట్యాగ్‌లతో పోస్టును పెట్టి ఆనందం వ్యక్తం చేసింది.
గర్వంగా ఉంది.. -ఆండ్రియా
బహుభాషా నటి, ప్రముఖ గాయని ఆండ్రియా జెరేమియాకు బేకింగ్‌తో పాటు, మొక్కల పెంపకమూ ఇష్టమట. తను కూరగాయలను మిద్దెతోటలో గ్రోబ్యాగ్‌ల్లో పెంచుతోంది. లాక్‌డౌన్‌లో ప్రారంభించిన వంట.. టెర్రస్ గార్డెనింగ్ చేసేలా ప్రోత్సహించింది అని చెబుతోంది. 'బెండ, కొత్తిమీర, పచ్చిమిర్చి.. ఇలా చాలానే నా తోటలో ఉన్నాయి. వాటి సంరక్షణతో రోజు హాయిగా మొదలవుతుంది. సమయం అస్సలు తెలియదు. పంట చేతికొస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. దీనికి ఎక్కువ స్థలం, శ్రమ కూడా.. అక్కర్లేదు. మీరూ చేయగలరు, ప్రయత్నించండి' అంటూ అందరినీ ప్రోత్సహిస్తోంది ఆండ్రియా.
ఆనందం కోసం.. -జూహీచావ్లా
అందం, అద్భుత అభినయంతో ఆకట్టుకున్న బాలీవుడ్ నటి జూహీచావ్లా గుర్తుందా? ఇప్పుడు తను మట్టితో సావాసం చేస్తోంది. ఇంటి చుట్టూ కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుతోంది. వాడాలో ఓ పొలం కొని.. అక్కడ ప్రకృతిలో సేద తీరుతుంటుంది. తోటపనితో మానసిక ఆనందం, ఆరోగ్యం సొంతమవుతాయనీ.. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమ ఖాతాల్లో పంచుకుంటోంది. 'మా పిన్ని రోజూ మాకు తోటపని నేర్పిస్తుంది. మట్టిలో గడపడం, మొక్కలకు నీళ్లు పోయడం, కత్తిరించడం.. ఇవన్నీ ఎంతో సంతోషాన్నీ, సరదాతో కూడిన శ్రమను ఇస్తున్నాయి. ఆ పంట ఆరోగ్యాన్ని ఇస్తుంది' అంటోంది జూహీచావ్లా.
ఖాళీ సమయంలో.. -నభా
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు వారిని అలరించిన నటి నభా నటేశ్. షూటింగ్‌లు ఆగిపోవడంతో తనకు ఇష్టమైన సాగు బాట పట్టింది. ఇంటి చుట్టూ ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ ఖాళీ సమయాన్ని గడిపేస్తోంది. వంట కోసం ఆకుకూరలు కోస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇవీ చదవండి: