కరోనా వ్యాప్తి వేళ పరిమితులతో కూడిన అనుమతులు లభించినా సినిమా చిత్రీకరణలు ఇంకా ఊపందుకోలేదు. వైరస్ భయాందోళనల నడుమ సినీ పరిశ్రమ ఇప్పటికీ ధైర్యంగా అడుగు వేయలేకపోతోంది. లాక్‌డౌన్ తరహాలోనే ఇళ్లకే పరిమితమైన తారలంతా.. మరి కొన్నాళ్లు బయటికి రాలేమనే సంకేతాలు ఇస్తున్నారు. దర్శకనిర్మాతలు కలిసి చిత్రాలను పట్టాలు ఎక్కించడానికి చేస్తున్న సన్నాహాలు.. కొన్ని సినిమాల నిర్మాణానంతర పనులు మినహా చిత్ర పరిశ్రమలో సందడేమీ కనిపించడం లేదు. ఒకటి, రెండు పరిమిత వ్యయంతో కూడిన మూవీలు తప్ప ఇంకేవీ పునః ప్రారంభం కాలేదు. అగ్ర తారలు ఆగస్టు నుంచి రంగంలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నారు. అసలు సిసలు సందడి అప్పట్నుంచే మొదలుకానుంది.
ఇప్పట్లో థియేటర్లు తెరచుకునే పరిస్థితులైతే కనిపించడం లేదు. ఒక వేళ తెరుచుకున్నా ప్రేక్షకులు వస్తారో లేదో అనే సందేహం వెంటాడుతోంది. మూవీలను ఇప్పటికిప్పుడు సిద్ధం చేసి పెట్టుకున్నప్పటికీ వాటితో పెద్దగా ప్రయోజనమేమీ లేదు. పైగా కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సాహసం చేసి సెట్లోకి దిగడం కంటే మరికొన్నాళ్లు వేచి చూడటమే మంచిదన్న ధోరణిలో చిత్ర పరిశ్రమ కనిపిస్తోంది. ఫలితంగా చిత్రీకరణలు వాయిదా పడుతూనే ఉన్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మొదట అవే అనుకొన్నప్పటికీ..
'ఆర్ ఆర్ ఆర్', 'ఆచార్య' సినిమాల చిత్రీకరణలు మొదట ఆరంభం అవుతాయనే సంకేతాలు వచ్చాయి. వాటిని మిగతా మూవీలు అనుసరించేలా కనిపించింది. అయితే, ఇప్పటికీ అవి ఆరంభం కాలేదు. కరోనా విజృంభణ, నిబంధనల పరంగా తలెత్తుతున్న సమస్యల కారణంగా ఈ సినిమాలు సెట్స్‌పైకి వెళ్లడానికి సమయం పడుతుందని సమాచారం.
రెండింతల ప్రయాస
అసలు ఇప్పటిదాకా మొదలు కాని సినిమాలు మాత్రం మరింత ఆలస్యంగా సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. కొద్దిమంది హీరోలు చిత్రీకరణలకి సుముఖంగానే ఉన్నప్పటికీ.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే తారలు, సాంకేతిక నిపుణులు, వాళ్ల బస, ప్రయాణాల విషయంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. పరిమిత సిబ్బందితో చిత్రీకరణలూ కష్టతరమే. దాంతో కరోనా ఉద్ధృతి తగ్గే వరకు వేచి చూడటమే మంచిదని దర్శకనిర్మాతలు, నటీనటులు భావిస్తున్నారు. కొంతమంది తారలేమో కరోనా తగ్గినా తగ్గకపోయినా ఆగస్టు నుంచి రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. అందుకే దర్శకనిర్మాతలు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.
"ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో చిత్రీకరణలు అనుకున్నా, అందుకోసం ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలు పెట్టాలి. అప్పట్లోపు ఇతర నటీనటుల్ని, సాంకేతిక బృందాన్ని ఒక చోటుకి తీసుకురావాలి. లొకేషన్లు, ఇతర ఏర్పాట్లు సిద్ధం చేయాలి. ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు ప్రతి విషయంలోనూ రెండింతల ప్రయాస ఎదురవుతోంది" అని చిత్రీకరణల కోసం ఏర్పాట్లలో ఉన్న ఓ ప్రముఖ నిర్మాత చెప్పారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇప్పటి నుంచే ఏర్పాట్లు
పవన్‌కల్యాణ్ 'వకీల్‌సాబ్', ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్', చిరంజీవి 'ఆచార్య', నాగార్జున 'వైల్డ్ డాగ్', అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాల షూటింగులను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవి ఎప్పుడైనా సెట్స్‌పైకి వెళ్లొచ్చు. అన్నీ సర్దుకున్నా వీటి చిత్రీకరణలు ఊపందుకునేది ఆగస్టు నుంచే.
* పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా, నాగచైతన్య 'లవ్‌స్టోరీ', రవితేజ 'క్రాక్', రానా 'విరాటపర్వం' చిత్రీకరణలకీ సిద్ధమవుతున్నాయి.
* ప్రభాస్- రాధాకృష్ణ కుమార్ చిత్రం, నితిన్ 'రంగ్‌దే', నాని 'శ్యామ్ సింగరాయ్', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', గోపీచంద్ 'సీటీమార్', రవితేజ - రానాల రీమేక్, బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న వరుణ్ చిత్రాలు ఆగస్టు నుంచి షురూ అవుతాయి.