"తొలి సినిమా చేసే కథానాయకులు కథల గురించి ఎలాంటి కలలు కంటుంటారో అలాంటి కథే నాకు 'జాంబీరెడ్డి' రూపంలో దక్కింది" అంటున్నాడు తేజ సజ్జా. బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు తేజ. 'ఓ బేబీ'లో ఓ కీలక పాత్రతో సందడి చేసిన ఇతడు, తాజాగా 'జాంబీరెడ్డి'తో కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా తేజ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించాడు. ఆ విషయాలివీ...
"దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన రెండు సినిమాల తర్వాత అగ్ర హీరోలతో ఆయన సినిమా కూడా ఖరారైంది. కానీ అది కాస్త ఆలస్యం అవుతుందని తెలియడం వల్ల.. మధ్యలో ఓ క్రేజీ కాన్సెప్ట్‌తో సినిమా చేయాలనుకున్నారు. అదే... 'జాంబీరెడ్డి'. ఇందులో నేను కథానాయకుడు కావడమే చాలా సంతోషానిచ్చింది. ఇదొక పక్కా వాణిజ్య చిత్రం. యాక్షన్, కామెడీకి అదనంగా ఓ కొత్త రకమైన జాంబీలను ఈ కథలోకి తీసుకొచ్చాం. కడుపుబ్బా నవ్విస్తూనే థ్రిల్‌ని పంచుతుందీ చిత్రం."
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"కరోనా నేపథ్యంలో సాగే కథే ఇది. గతేడాది ఫిబ్రవరిలో సినిమాని మొదలుపెట్టాం. అప్పటికే చైనాలో కరోనా మొదలైంది. చిత్రీకరణ మొదలు పెట్టాక కొన్నాళ్లకి లాక్‌డౌన్ వచ్చింది. అప్పుడు మరికొన్ని మార్పులు చేసి ఈ కథకి మరిన్ని కామెడీ హంగులు జోడించాం. వైరస్‌కి మందు చేసే ప్రయత్నాల్లో ఉండగా, జాంబీ వైరస్ తయారవుతుంది. ఆ జాంబీలు మన ఫ్యాక్షన్ వర్గాల మధ్యకి వచ్చాక ఏం జరిగిందనేది తెరపైనే చూడాలి. చాలా రకాల జాంబీ జోనర్ సినిమాలు వచ్చాయి కానీ.. ఫ్యాక్షన్ నేపథ్యంలో జాంబీల్ని మాత్రం ఇందులోనే చూడబోతున్నారు".
"ప్రశాంత్ వర్మ, నేను మంచి స్నేహితులం. ఒక స్నేహితుడు దర్శకుడైనప్పుడు తన కథా నాయకుల్ని ఎలా చూపిస్తారనేది చాలా సినిమాల్లో చూశాం. నేను తెరపై ఎలా కనిపిస్తే బాగుంటుంది? ఏది ఎలా చేస్తే బాగుంటుందో ప్రశాంత్ వర్మకి తెలుసు. ఆయన ఏం కావాలో నాకూ చాలా బాగా తెలుసు. ఇందులో నేను ఫైట్లు చేశా. ఆ సన్నివేశాల గురించి చెప్పినప్పుడు మొదట భయపడ్డా. తెరపై ఓ బాల నటుడిగా కనిపించిన నేను, ఇప్పుడు తెరపై ఒకరిని కొడుతుంటే చూసి ప్రేక్షకులు ఏమనుకుంటారని ఆలోచించా. కానీ ఈ కథలో నేనే కాదు, కథానాయిక, హాస్యనటులు కూడా ఫైట్లు చేస్తారు. జాంబీలు మీద పడిపోతుంటే చిన్న పిల్లలైనా కొడతారు కదా. అలాగని కొడితే గాల్లోకి ఎగిరిపోయే సన్నివేశాలేమీ ఉండవు".
"నటుడిగా నాకు మంచి గుర్తింపే ఉన్నా.. అవకాశాలు మాత్రం అంత సులభంగా రాలేదు. ప్రతి సినిమా అవకాశం కూడా నేను ప్రయత్నించి తెచ్చుకున్నదే. ప్రస్తుతం సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థలో 'ఇష్క్'తోపాటు, మరో ఫాంటసీ ప్రేమకథలో నటిస్తున్నా".