ETV Bharat / sitara

'వెంకన్న స్వామికి అన్నమయ్య ఎలానో.. శివుడికి 'భరణి' అలానా?' - మిథునం సినిమా వార్తలు

రచయితగా, నటుడిగా, దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికే నిలచిపోయే పేరు తనికెళ్ల భరణి. తన రచనతో ఎన్నో చిత్రాలకు పనిచేయడం సహా నటనతోనూ ప్రేక్షకులను రంజింపజేశారు. ఆ తర్వాత దర్శకునిగా రూపొందించిన ఏకైక చిత్రం 'మిథునం'తో ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే 'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'అలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన తనికెళ్ల భరణి.. ఆయన సినీ ప్రయాణంలో కొన్ని విశేషాలను పంచుకున్నారు.

tanikella bharani in alitho saradaga show
'వెంకన్న స్వామికి అన్నమయ్య ఎలానే.. శివుడికి 'భరణి' అలా!'
author img

By

Published : Jan 6, 2021, 12:56 PM IST

హరుడు.. ప్రేక్షకుడు.. ఆయనకు రెండు కళ్లు. కలం, చలన చిత్రం ఆయనకు పంచప్రాణాలు. తాను పోషించిన పాత్రలతో ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచారు. తాను రాసిన మాటలతో.. తీసిన చిత్రాలతో.. ఎందరో ప్రేక్షకులను నవ్వించారు.. ఏడిపించారు.. ఆలోచింపజేశారు. తన పాండిత్యంతో పరమశివుడినే పరవశింపజేసి విలక్షణ నటనకు మారుపేరుగా నిలిచి, అశేష ప్రేక్షక ప్రపంచాన్ని రంజింపజేసిన బహుముఖ ప్రజ్ఞా పండితుడు తణికెళ్ల భరణి. 'ఈటీవీ'లో ఆలీ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నో విశేషాలు ఆయన ప్రేక్షకులతో పంచుకున్నారు.

వెల్‌కమ్‌ టూ 'ఆలీతో సరదాగా'. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

తణికెళ్ల భరణి: థాంక్యూ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరంతా ఆయురారోగ్యాలు.. ఐశ్వర్యాలతో.. పరమానందంగా జీవించాలని.. ఈ కరోనా బాధను తట్టుకున్నాం కాబట్టి దాన్ని తరిమి కొడదామని ప్రమాణం చేస్తూ.. శుభం భుయాత్‌.

చంటి.. అలియాస్‌ తణికెళ్ల భరణి.. ఇదేనా మీ పూర్తి పేరు?

తణికెళ్ల భరణి: తణికెళ్ల దశ భరణి శేషప్రసాద్‌ (నవ్వుతూ..)

ఇంత పొడుగు పేరు పెట్టుకున్నారు?

తణికెళ్ల భరణి: మేము ఏడుగురం అన్నదమ్ములం. నేను పుట్టిన తర్వాత బహుశా ఇక పుట్టరేమోనని చంటి అని పిలిచారు. కానీ.. ఆ తర్వాత మరో ముగ్గురు. అంటే.. అనగనగా ఓ రాజు.. ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు.(నవ్వులు)

నాన్నగారు ఏం చేసేవారు..?

తణికెళ్ల భరణి: రైల్వే ఉద్యోగి. 1934లో పశ్చిమగోదావరిలోని ఏలూరు దగ్గరున్న గుండుగోలను నుంచి హైదరాబాద్‌ వచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆయన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రైలు దిగి.. ఓ హోటల్‌లోకు వెళ్లారు. ఆయన దగ్గర రూపాయి(నాలుగు పావలా బిల్లలు) మాత్రమే ఉందట. మెట్లు ఎక్కుతుంటే ధర్మం చేయండని ఓ యాచకుడు అర్థించగా.. ఒక పావలా వేశారు. ఆ తర్వాత టిఫిన్‌ చేసి కాఫీ తాగారు.. బిల్లు 80 పైసలొచ్చింది. ఆయన దగ్గర ఉన్నది 75పైసలే. కౌంటర్‌లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లగా ఆయన.. 'అదేంటి మీ దగ్గర 75పైసలు ఉన్నాయి. బిల్లు 80పైసలు వచ్చింది. మరి ఏం చేస్తావు' అని అడిగాడట. 'అదే తెలియట్లేదు' మా నాన్న చెప్పారట. 'మరి.. ఇందాక జమిందారులాగా అక్కడ పావలా వేశావు. అది నేను చూశాను. అయినా.. అలా వేసేవాళ్లు ఎంతమంది ఉంటారయ్యా చాలా సంతోషం' అన్నారట. అప్పటి నుంచి ఆయన హోటల్‌ ఓనర్‌తో మా నాన్నకు స్నేహం ఉండేది. ఒక రూపాయితో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన మా నాన్న ఇక్కడ విస్తృత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు(నవ్వుతూ..) సామ్రాజ్యం అంటే ఏడుగురు కొడుకులు, ఏడుగురు కోడళ్లు, మనవళ్లు.. అందర్నీ చూసి 94ఏళ్ల వయసులో ఆయన వెళ్లిపోయారు.

శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు.. మీకు శివుడు ఆజ్ఞ ఇచ్చాకే ఈ కార్యక్రమానికి వచ్చారా..?

తణికెళ్ల భరణి: బహుశా.. అది నిజమే అయ్యుండొచ్చు. చాలా కాలంగా అనుకుంటున్నా రకరకాల కారణాల వల్ల కుదరట్లేదు. ఏదేమైనా కొత్త సంవత్సరం మనతో ప్రారంభమవుతుంది కదా.(నవ్వుతూ..)

వేంకటేశ్వరస్వామికి అన్నమయ్య ఎలాగో.. శివుడికి తణికెళ్ల భరణి అలాగేనా..?

తణికెళ్ల భరణి: అలా అని ఏం లేదు. నాకన్నా మహాశివభక్తులు చాలా మంది ఉన్నారు. నేను రాసిన పాటలు. సినిమా నటుడిగా నాకున్న పేరు వల్ల బహుశా ఎక్కువ ప్రచారం జరిగి ఉండవచ్చు.

మీ కుటుంబంలో ఎవరైనా కళాకారులున్నారా..?

తణికెళ్ల భరణి: రచయితలున్నారు. మా వంశంలో పాండిత్యం కలిగిన వాళ్లు ఉన్నారు. మా అన్న.. నాకంటే ముందువాడు సూరిబాబు. ఇప్పుడు లేరు. బ్రహ్మాండమైన రచయిత. ఇంగ్లీష్‌ నవలను ముందు పెట్టుకొని వెంటనే తెలుగులో అనువాదం చేసేవాడు. అలా ఇంట్లో అందరికి సాహిత్యంతో అనుబంధం ఉంది.

అలాంటి పండిత కుటుంబం నుంచి వచ్చిన భరణి.. రచయిత అవుతాడని అనుకున్నారా..? మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు..?

తణికెళ్ల భరణి: నాకు 10వ తరగతి నుంచి స్నేహితుడు ఉండేవాడు. దేవరకొండ నరసింహకుమార్‌. 'నువ్వు బాగా రాస్తావ్‌ రా.. నీలో ఏదో శక్తి ఉంది.. ఏదో ఒక కథ రాయ్‌.. ఒక పాట రాయ్‌.. ఒక పద్యం రాయ్‌..' అని బాగా ప్రోత్సహించేవాడు. టైపింగ్‌లో వాడు బాగా స్పీడ్‌. అందుకే నాకంటే ముందు ఉద్యోగం వచ్చింది. రోజూ ఉదయాన్నే వెళ్లి కంపెనీ బస్సులో వాడిని నేను ఎక్కించడం.. వాడు నాకు రెండు సిగరెట్లు ఇప్పించడం. అలాంటివాడు ఓ రోజు గండిపేటలో...(మరణించాడు). ఆ రోజు వాళ్ల అమ్మ నాతో.. "ఓరేయ్‌ వాడు పోయాడు. నువ్వేలా ఉన్నావ్‌రా" అని అడిగింది. అంత గొప్ప స్నేహితులం మేం. వాడికి అక్క ఉంది. వాళ్ల నాన్నేమో స్పృహలో లేరు. ఆఖరికి నేను దహన సంస్కారాలు చేశాను.

ఇండస్ట్రీకి రాకముందు మీరు పెద్ద దాదా అట..?

తణికెళ్ల భరణి: మాది రైల్వే కాలనీ. దాని పక్కనే అమాల్‌ బస్తీ అని ఉండేది. అంతా కొంచెం రఫ్‌ అండ్‌ టఫ్‌గా ఉండేవాళ్లు. మావాళ్లంతా బాగా చదువుకున్నవాళ్లు. మనకేమో చదువు అబ్బలేదు. అలా.. గ్యాంగులతో తిరగడం.. చిన్నచిన్న దొంగతనాలు చేయడం.

దొంగతనాలా..! ఏంటీ..?

తణికెళ్ల భరణి: సినిమా కోసం. ఇంట్లో నుంచి పేపర్లు తీసుకెళ్లి అమ్మేవాళ్లం. ఈ బ్యాచ్‌ కొంచెం టఫ్‌. 'గుండాల్లా వెళ్లి.. హేయ్‌.. సిగరేట్‌ తే' అలా ఉండేవాళ్లం. అలా మాకు హీరోలా ఫీల్‌ అయ్యేవాళ్లం. రాత్రిళ్లు సినిమాలు చూడటం.. చదువు మర్చిపోయి.. దాదాపు జీవితం తగలడిపోవడానికి సరిగ్గా సిద్ధంగా ఉన్న సమయంలో గురువుగారు రాళ్లపల్లి మా జీవితంలోకి వచ్చారు. ఆ సమయంలో ఒక నాటక వేశాం. నేనే రాశాను. పేరు 'అద్దె కొంప'. రైల్వే క్వార్టర్స్‌ నుంచి బయటికి వెళ్లిన తర్వాత ఎదురైన అనుభవంతో రాసింది ఆ కథ. మొదటి బహుమతి వచ్చింది. దాంతో మమ్మల్ని మామూలు మనుషుల్లో నుంచి తీసేసి దేవతల్లా చూడటం ప్రారంభించారు. అప్పటి నుంచి నాటక సమాజం పెట్టాలనుకున్నాం. నలుగురు మిత్రులు.. ఆనంద్‌, రాధాకృష్ణ కాళిదాస్‌, అనంత్‌, సుబ్రహ్మణ్యం.. కలిసి 'నవీన్‌ కళామందిర్' పెట్టాం. రాళ్లపల్లి వెంకట నరసింహారావు దగ్గరికి వెళ్లి.. 'గురువుగారు మీరు మా అసోసియేషన్‌ ప్రారంభించాలి' అని కోరాం. మా జీవితాల్లోకి ఆయన అలా వచ్చారు. ఇక అక్కడి నుంచి ఒక దశ వచ్చేసరికి నేను మా ఇంట్లోకంటే వాళ్లింట్లోనే ఎక్కువగా ఉండేవాడిని ఒక కొడుకు కంటే ఎక్కువగా నన్ను చూసుకునేవారు. ఇప్పటికైనా సరే ఆయన 'లివింగ్‌ గాడ్‌'. మీకు కూడా తెలుసు.

ఈ రౌడీయిజం చేయడం వల్లే 'యమలీల'లో ఆ క్యారెక్టర్‌ వచ్చిందా..?

తణికెళ్ల భరణి: దానికి దీనికి సంబంధం లేదు(నవ్వుతూ). అది దర్శకుడు కృష్ణారెడ్డిగారి గొప్పతనం. కాకపోతే ఇక్కడ పుట్టిపెరగడం.. తెలంగాణ యాస వల్ల ఆ క్యారెక్టర్‌ వచ్చింది.

తణికెళ్ల భరణి అంటే తోట రాముడు. తోట రాముడు.. అంటే తణికెళ్ల భరణి!

తణికెళ్ల భరణి: నాకో బుల్లి చెల్లి.. దానికి గల్లీలో పెళ్లి.. నా చెల్లి పెళ్లి జరగాలి మళ్లీమళ్లీ(నవ్వుతూ..)

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ డైలాగ్‌ మీదేనా..?

తణికెళ్ల భరణి: నేను తెలంగాణ యాస బాగా మాట్లాడతాను కాబట్టి చాలామంది ఆ డైలాగ్‌ నేనే రాశాననుకుంటారు. కానీ.. ఆ డైలాగ్‌లోని ఒక్క అక్షరం కూడా నాది కాదు. మొత్తం రైటర్‌ దివాకర్‌బాబుదే. కాకపోతే నేను బాగా ఓన్‌ చేసుకున్నాను. నిజానికి ఆ సినిమాలో అంతపెద్ద క్లైమాక్స్‌ ఉందన్న విషయం కూడా నాకూ తెలియదు. అప్పుడు కృష్ణారెడ్డి ప్రభ వెలిగిపోతోంది. ఆయన సినిమాల్లో ఇంకా అప్పటికి నేను చేయలేదు. 'పల్నాటి పౌరుషం' సినిమాకు డేట్లు ఇచ్చేశాను. నాకు కృష్ణారెడ్డి గారి నుంచి ఫోన్‌ వచ్చింది. రేపు పొద్దున ఫలానా నంబర్‌కు ఒకసారి ఫోన్‌ చేయమని చెప్పారు. అప్పట్లో కృష్ణారెడ్డి గారి నుంచి ఫోన్‌ వస్తే అదే గొప్ప. వెళ్లి ఫోన్‌ చేశాను. "భరణి గారు ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నా. అందులో మీరో వేషం చేయాలి. చాలా మంచి వేషం అది. డేట్లు ఫలానా" అని చెప్పారు. వెళ్లి చూస్తే.. ఆ డేట్లు అప్పటికే వేరేవాళ్లకు ఇచ్చేశాను. 'పల్నాటి పౌరుషం'లో ప్రధాన ప్రతినాయకుడిని. ముత్యాల సుబ్బయ్యగారు డైరెక్టర్‌. మోహన్‌గారు నిర్మాత. కృష్ణారెడ్డిగారి సినిమా మిస్సయ్యానని ఫీల్‌ అయ్యాను. చాలా నిరుత్సాహపడ్డాను. ఇంతలో మళ్లీ ఫోన్‌.. 'ఏం ఫరవాలేదు. మేం పాటలు తీస్తాం. ఆ తర్వాత వచ్చి మీరు జాయిన్‌ అవ్వండి' అన్నారు. అది నేను ఊహించలేదు. అలా 'యమలీల'లో తోటరాముడు వచ్చింది. షూటింగ్‌ జరుగుతోంది. కృష్ణారెడ్డిగారి కంపెనీలో ఎలా ఉంటుందంటే.. బయటి నుంచి కూడా వచ్చి భోజనం చేసి వెళ్లేవాళం(నవ్వుతూ..) సాధారణంగా 6గంటలకు ప్యాకప్‌ ఉంటుంది. ఒకరోజు సాయంత్రం 6 అయింది. డ్యాన్సర్లు మొత్తం లోపలికి వస్తున్నారు. మన పని అయిపోయింది కదా. ప్యాకప్‌ అనుకొని కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్లాను. 'గురువుగారు.. నా పని అయిపోయింది. నేను వెళ్లొచ్చా' అని అడిగాను. 'పాటే మీదే' అని అన్నారాయన. 'నా మీద పాటనా..!' అనుకున్నాను. ఆ సినిమా విడుదలయ్యాక.. ఆ ఏడాది దాదాపు 26 సినిమాలు చేశాను. నటుడిగా అయితే.. నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు.

రచయితగా మొదటి సినిమా..?

తణికెళ్ల భరణి: నాటకాలు వేస్తున్న రోజుల్లో ఒక నిర్మాత నా నాటకం చూసి.. మీరు సినిమాకు రాస్తే బాగుంటుందని చెన్నైకి తీసుకెళ్లారు. ఆ సినిమా 'కంచు కవచం'. సుమన్‌ హీరో. రాజశేఖర్‌రెడ్డి డైరెక్టర్‌. కేరళలో షూటింగ్‌. ఇక్కడ నాటకాల్లో చాలా వైభవంగా చూసుకున్న నాకు సినిమా వాతావరణం నచ్చలేదు. మధ్యలోనే వచ్చేశాను. ఈ సినిమా డైలాగ్‌లు ఎడిటింగ్‌ చేస్తున్న సత్యంగారు మళ్లీ ఫోన్‌ చేశారు. రేపు పొద్దున విమానంలో మద్రాసుకు వెళుతున్నామన్నారు. సరే అన్నాను. 'పట్నం పిల్ల.. పల్లెటూరి చిన్నోడు' మౌళి డైరెక్టర్‌. భానుచందర్‌, సుహాసిని హీరోహీరోయిన్లు. అది కూడా మానేసి మధ్యలో వచ్చేశాను. మూడోది 'లేడీస్‌ టైలర్‌'. డైరెక్టర్‌ వంశీని గురువు రాళ్లపల్లిగారు పరిచయం చేశారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. రైటర్‌గా మొదటి సినిమాలోనే పోలీస్‌ వేషం వేశాను. ఆ తర్వాత 'కనకమహాలక్ష్మి'లో పెద్ద పాత్ర పోషించాను.

వంశీ గారు మీతో కన్నీళ్లు పెట్టించారట..?

తణికెళ్ల భరణి: అప్పటి పరిస్థితి(నవ్వుతూ). ఆరంభదశ కదా.. ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉంటుంది. అప్పట్లో చిన్నమాట అంటేనే ఏడ్చేవాళ్లం. 'ఏమిటయ్యా నువ్వు.. నిన్న రాయమంటే.. ఇప్పుడు సెట్లో స్క్రిప్టు రాస్తావేంటి' అనగానే నిజంగానే ఏడ్చాను. తమాషా ఏంటంటే.. ఇంకు పెన్నుతో రాసేవాణ్ని. కన్నీళ్లు కారుతున్నాయి.. సీన్‌ రాస్తున్నా.. రాసింది మొత్తం చెరిగిపోయింది. అప్పటి నుంచి బాల్‌ పెన్నుతో రాయడం ప్రారంభించాను(నవ్వుతూ). ఇప్పటికీ మేం స్నేహంగానే ఉంటాం. నా జీవితాన్ని మలుపుతిప్పిన సంస్థ స్రవంతి, డైరెక్టర్‌ వంశీ.

పేకాట ఆడటం బాగా అలవాటుందట..?

తణికెళ్ల భరణి: అందులో నేను జీరో. పేకలో ఎన్నిముక్కలుంటాయో కూడా తెలియదు. అలాంటిది 'పేకాట పాపారావు' రాయమంటే.. మా శిష్యుడు ఉన్నాడు మహర్షి.. వాడు పేకాటలో మాస్టర్‌. కూర్చొంటే నీ ఆస్తంతా వాడు పేకలో కొట్టేయగలడు. తమిళంలో కమెడియన్‌ నగేశ్‌ ఉన్నారుగా.. ఒకసారి నా దగ్గరికి వచ్చి.. "మీ వాడికి రచన హాబీ.. పేకాట వృత్తి. నా దగ్గర రూ.6వేలు కొట్టేశాడయ్యా" అన్నారు(నవ్వుతూ) అయితే, మావాడి దగ్గర మంచి గుణం ఏంటంటే. ఆ కొట్టేసిన డబ్బు అందరికీ ఇచ్చేస్తాడు. ఇంటికి తీసుకెళ్లడు.

నెగెటివ్‌ పాత్రలు చేస్తున్నప్పుడు 'రేప్‌' సీన్స్‌లో పరకాయ ప్రవేశం చేసేవారట..?

తణికెళ్ల భరణి: నీకు దండం పెడతా.. రేప్‌ సీన్స్‌ కాదు. సంసారాలు చెడగొట్టకు(నవ్వుతూ). నాకు మొదటి నుంచి నెగెటివ్‌ పాత్రలంటే ఇష్టం. అందుకనే 'నువ్వు నేను', 'సముద్రం' చిత్రాలకు అవార్డులు వచ్చాయి. మంచి వాడి వేషం అనుకో.. హీరో తండ్రి.. లేకుండా హీరోయిన్‌ తండ్రి.. ఒకటే ఉంటుంది. అదే విలన్‌ అనుకో వాడి గెటప్‌ మారిపోతుంది. డిక్షన్‌ మారిపోతుంది 'సముద్రం'లో చూస్తే.. పిచ్చి పెళ్లాం ఉంటుంది. పెళ్లాం మీద ఈగ వాలినా చంపేస్తాడు. అలా వైవిధ్యం చూపించే అవకాశం విలన్‌కే ఉంటుంది కాబట్టి నెగెటివ్‌ పాత్రలు ఎక్కువగా చేశా. అతి తక్కువ రేప్‌లు చేసిన విలన్‌ నేను(నవ్వుతూ..)

భరణి అనే కుర్రోడు వచ్చాడు. నేనింకా నాటకాలు రాయను అని ఒక గొప్ప రచయిత అన్నారు. ఎవరాయన..?

తణికెళ్ల భరణి: మహాకవి ఆత్రేయ గారు. సినిమాల్లోకి వచ్చే ముందు ఆయన చాలా గొప్ప నాటక రచయిత. అంటే అదొక తమాషా సంఘటన. నా జీవితంలో ఎంతో గర్వించాల్సిన సంఘటన. నేను రాసిన నాటకం 'గో గ్రహణం'. ఆంధ్రాక్లబ్‌లో వేశారు. కార్యక్రమానికి వచ్చిన ఆత్రేయగారు నా నాటకం చూశారు. ఫలితాలు ప్రకటించాలి. దానికి ముందే ఆయన.. లేచి నిల్చొని.. నేను "గో గ్రహణం' నాటకం చూశాను. నాకు చాలా నచ్చింది. ఇన్ని రోజులు నేను నాటకాలు రాస్తాను.. రాస్తాను అంటున్నాను కదా.. ఇక నేను రాయను(సినిమాల్లోకి వచ్చాక ఆయనను చాలామంది మళ్లీ నాటకాలు రాయండి అని అడిగేవారు). రాయక్కర్లేదు. వాడొచ్చాడు. పేరు తణికెళ్ల భరణి" అని చెప్పి రూ.500 మా సంస్థకు ఇచ్చారు. అందులో 400 మేము వివరణ అక్కర్లే(నవ్వుతూ). మిగిలిన 100 మీద మాత్రం ఆత్రేయ అని రాసుకున్నాను.

మీరు చాలా నిజాయితీగా మాట్లాడుతున్నారు. చాలా మంది ఇమేజ్‌ దెబ్బతింటుందని అన్ని విషయాలు చెప్పుకోరు.

తణికెళ్ల భరణి: మనం పురుషోత్తములమని ఎవరూ నమ్మట్లేదు(నవ్వుతూ..)

అప్పట్లో ఒక అమ్మాయి మిమ్మల్ని చంపేస్తానని పబ్లిక్‌గా ప్రకటించింది..?

తణికెళ్ల భరణి: 'ఆమె' సినిమాలో పరమ దుర్మార్గమైన బావ పాత్ర నాది. ఆ వేషం వేసిన తర్వాత ఒకరు కాదు.. నన్ను చాలా మంది చంపేస్తామన్నారు. అందులో ఈవిడ ఒకరు. ఒకసారి నేను కూర్చొని పేపర్‌ చదువుతున్నా. అప్పటికే 'మాతృదేవోభవ' సినిమా విడుదలైంది. ఒక కూరలమ్ముకునే ఆమె వచ్చి.. 'ఏం సారు అట్ల సంపుతావ్‌.. కత్తితోని పొడిసి' అంది. అది సినిమా అని నేను చెప్తే.. 'సినిమా అయితే మాత్రం అన్నిసార్లు పొడిసి సంపుతావ్‌..' అందామె. ఒకసారి అమెరికా వెళ్లాను. వేలాది మంది ప్రేక్షకులున్నారు. ఒకమ్మాయి లేచి 'మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా?' అంది. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఓ సినిమా చూశాను సర్‌ మీది. అప్పుడు మిమ్మల్ని చంపేద్దామనుకున్నా అంది. అమ్మ ఇప్పుడు చంపకు నాకు పెళ్లాం పిల్లలున్నారు. పైగా ఇక్కడి నుంచి తీసుకెళ్లడం కష్టం అన్నాను(నవ్వుతూ).

అమితాబ్‌తో 'సర్కారు' సినిమా ఎలా వదులుకున్నారు.?

తణికెళ్ల భరణి: రామ్‌గోపాల్‌ వర్మకు ఇప్పటికీ నేనంటే మంచి అభిప్రాయం. అప్పుడప్పుడు ఫోన్‌ చేస్తుంటారు. 'సర్కార్‌' సినిమా కోసం ఫోన్‌ చేసి రమ్మన్నారు. గడ్డం అతికించుకోవడం నాకు నచ్చదు. కో-డైరెక్టర్‌ ఎవరో ఫోన్‌ చేసి.. 'మీరు పాత్ర కోసం డూప్లికెట్‌ గడ్డం పెట్టుకోవాలి' అన్నారు. నాకు ఇప్పటికే గడ్డం ఉంది. కావాలంటే ఇంకా పెంచుతాను అని చెప్పాను. వాళ్లేమో.. అది చాలదు ఇంకా కావాలన్నారు. నేను.. క్షమించండి.. అని చెప్పి తప్పుకొన్నాను. ఆ తర్వాత 'జీవా' చేశారు. ఈసారి గెడ్డం వేషం వస్తే వదులుకోకూడదని అనుకున్నా. 'బాహుబలి'లో శంఖం పట్టుకొని ఎంతపెద్ద గడ్డంతో ఉంటాను కదా.. అక్కడ కూడా గడ్డం పెంచుకొని వెళ్లా. అయినా డుప్లికేట్‌ గడ్డం పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ సినిమాలో అతి తక్కువరోజులు నటించింది నేను కావచ్చు. కేవలం 11 రోజులే. చివరి దశలో కేరళకు రమ్మన్నారు. ఇంకా ఒకరోజు ఇక్కడ చేయడానికి డేట్‌ అడిగారు. మామూలుగా రాజమౌళి ఒక డేట్‌ అడిగితే ఫుల్‌ డే తీస్తారు కదా.. ఆరోజు మధ్యాహ్నమే అయిపోయింది. 'థ్యాంక్స్‌ రాజమౌళి తర్వాతి సినిమాకు కూడా నిన్నే డైరెక్టర్‌గా పెట్టుకుంటా' అని చెప్పాను. 'థ్యాంక్స్‌ అండీ ఇంతమందితో చేశాను. కానీ.. ఎవరూ నాతో ఈ మాట చెప్పలేదు' అని ఆయన అన్నారు. సినిమా సక్సెస్‌ ఎలా ఉంటుందంటే.. నేను జపాన్‌ వెళ్తే ఎవరో 'బాహుబలి' అన్నాడు. ఎలా గుర్తుపట్టాడా అని ఆశ్చర్యపోయాను. కొంతమంది అమ్మాయిలు వాళ్ల జపాన్‌ భాషలో ఒక లెటర్‌ రాసి ఇచ్చారు. లవ్‌ లెటర్‌ కాదులే(నవ్వుతూ..) అంటే బాహుబలి జనాల్లోకి అంతలా చొచ్చుకుపోయింది.

మీ దర్శకత్వంలో కె.రాఘవేందర్‌రావు హీరో.. నలుగురు హీరోయిన్లు అసలేంటీ విషయం.?

తణికెళ్ల భరణి: బ్యాక్‌డ్రాప్‌ ఏంటంటే.. నా అదృష్టం కొద్దీ ఒకే ఒక సినిమా డైరెక్ట్‌ చేశాను. 'మిథునం' బాలుగారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. దీనికి కూడా మహర్షి కారణం. ఒకరోజు నాదగ్గరికి ఒక కథ తీసుకొచ్చాడు. ఇది రాఘవేందర్‌రావుగారికి చెబుదామనుకుంటున్నాను అన్నాడు. 'ఆయన సినీ ముని..' నోట మాటే మాట్లాడరు. ఆయన నటించడమంటే అసలే ఒప్పుకోరు అన్నాను. మా వాడు వెళ్లాడు. ఆయన అసలే వినలేదు. వచ్చాక నాకు కథ చెప్పాడు. కథ చాలా బాగుంది. కొత్త కథ. నేను రాఘవేందర్‌రావుగారికి ఫోన్‌ చేశాను. "గురువుగారు.. మీరు ఈ సినిమా చేయకండి. కానీ.. ఇలాంటి పాత్ర మీరే చేయాలి" అన్నాను. "అవునా.. సరే రమ్మను కథ వింటా" అని అన్నారాయన. విన్న తర్వాత కథ ఆయనకు కూడా నచ్చింది. డైరెక్టర్‌ ఎవరూ అని అడిగారు. మహర్షి నా పేరు చెప్పాడట. కథ ఓకే అయింది. మీరే డైరెక్టర్‌ అని చెప్పాడు. నేను షాక్‌ అయ్యా. వంద సినిమాల కంటే ఎక్కువే డైరెక్ట్‌ చేసిన గొప్ప డైరెక్టర్‌ని నేను డైరెక్ట్‌ చేయడం నిజంగా ఆ పరమేశ్వరుడి కృప అనుకున్నాను.

ఆయన ఎలా చేసినా ఓకే అంటారా..? వన్‌మోర్‌ అంటారా..?

తణికెళ్ల భరణి: ముందు వన్‌మోర్‌ అంటా..(నవ్వుతూ). ఆయన ముందే చెప్పారు. 'ఏమోయ్‌.. నేను ఎలా చేసినా ఓకే అనాలి' అన్నారు. అది మా ఇద్దరి మధ్య ఒప్పందం.

ఇంత సరదాగా ఉండే మీ లైఫ్‌లో మీకు శత్రువులున్నారా..?

తణికెళ్ల భరణి: నాకు తెలియకుండా ఉన్నారేమో..? నువ్వు ఎవరి గురించి అడుగుతున్నావో డైరెక్ట్‌గా అడుగు..?(నవ్వుతూ).. ఇంతలో తెరపై ఎల్‌బీ శ్రీరామ్‌ కనిపించారు.

ఏంటీ మీ మధ్య శత్రుత్వం?

తణికెళ్ల భరణి: నాటకాల్లో వాళ్లదో జట్టు. మాదో జట్టు. ఒకసారి వాళ్లది బెస్ట్‌. ఇంకోసారి మాది బెస్ట్‌. బయటికి ఎలా ఉన్నా లోపల మాత్రం కొంచెం కసి ఉండేది. అలా.. సినిమాలకు వచ్చాం. మేం ఎంత మంచి మిత్రులం అంటే.. వాళ్ల గృహప్రవేశానికి ఉదయం 6గంటల నుంచే చుట్టాలను నేను ఆహ్వానించాను. ఒకసారి మాట్లాడుకునే సమయంలో.. 'ఓరేయ్‌ సినిమాలో ఏదైనా కొత్త ప్రయోగాలు చేయాలి' అన్నాడు. అప్పుడు ఈ 'మిథునం' కథ రమణ గారు రాశారు. నేను(భరణి) డైరెక్టర్‌.. నువ్వు(ఎల్‌బీ శ్రీరామ్‌) యాక్టర్‌.. అని మొదలు పెట్టి ప్రొడ్యూసర్‌ను సెట్‌ చేశాం. మొత్తం అంతా అయిపోయింది.. రెండు నెలల్లో సినిమా మొదలుపెడుతున్నాం అనగా.. ప్రొడ్యూసర్‌ ఫోన్‌ చేసి ఇంత ఖర్చు పెడుతున్నాం కదా..(బడ్జెట్‌ రూ.కోటి) అక్కినేని నాగేశ్వరరావుగారిని హీరోగా పెడదాం అన్నారు. ఆయన వేయని వేషం ఏమైనా ఉందా.. పైగా అంతటి నటుడిని నేను హ్యాండిల్‌ చేయలేను అని చెప్పాను. 'ఆయన ఉంటే పెద్ద హీరోయిన్‌ను తీసుకొస్తా. అది పెద్ద సినిమా అయి.. బోలెడంత డబ్బు వస్తుంది' అన్నారు. 'డబ్బు కోసమే అయితే.. ఇంతకుముందే చేసేవాడిని కదా సర్‌' అని నేను అన్నాను. కట్‌ చేస్తే.. ప్రొడ్యూసర్‌కు ఫోన్‌ చేసి సినిమా వద్దు ఫ్రెండ్స్‌గా ఉందాం అని చెప్పాను. ఇతనేమో(ఎల్బీశ్రీరామ్‌) 'నేను లేకపోతే ఏంటి.. సినిమా తీసెయ్‌' అంటున్నాడు. 'లేదు మాటంటే మాటే.. నీతోనే తీస్తా అని నేను. అలా ఆ ప్రాజెక్టును వదిలేశాం. కొంతకాలానికి ఇంకొక ప్రొడ్యూసర్‌ వచ్చారు. బాలుగారి దగ్గరికి వెళ్లడం.. ఆయన ఒప్పుకోవడం అలా జరిగిపోయింది. మేమిద్దరం మిత్రులమా.. శత్రువులమా అంటే మేం నిజంగా మంచి మిత్రులం.

ఎల్బీ శ్రీరామ్‌.. మీకు రెండు అద్భుతమైన పాత్రలు రాశారు..? రెండింట్లోనూ నేనే హీరో.. మీకు గుర్తుందా..?

తణికెళ్ల భరణి: పిట్టల దొర. అది భలే వేషం. ఇంకొకటి 'నల్లపూసలు'. అదీ ఎల్బీ రాసిందే. అంత దుర్మార్గమైన పాత్ర నా జీవితంలో వేయలేదు. ఎందుకంటే.. హీరో చచ్చిపోయిన తర్వాత హీరోయిన్‌ పిండాలు తీసుకొని నది దగ్గరికి వస్తుంది. కట్‌ చేస్తే.. నదిలో నుంచి నేను లేచి ఆమె దగ్గరికి వచ్చి ఆ పిండం తింటా. చూస్తుంటే నాకే భయమేసింది. టెర్రిఫిక్‌ క్యారెక్టర్‌.

'మిథునం' సినిమాకు ఎస్పీబీతో యాక్ట్‌ చేయించారు. జే.ఏసుదాసు ఎందుకు పాడించాలని అనిపించింది..?

తణికెళ్ల భరణి: దాని కథ ఏంటంటే..? ఈ సినిమా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన సినిమా. ఒక రిటైర్డ్‌ స్కూల్‌ మాస్టారు. బాలసుబ్రహ్మణ్యంగారి గొంతు ప్రపంచమంతా తెలుసు. ఆయన గొంతు వింటే ప్రేక్షకులకు ఎస్పీ బాలునే కనిపిస్తారు. సినిమా ఫీల్‌ మిస్సవుతుంది. అందుకే.. 'మీరు పాడొద్దు సార్‌..' అని కండిషన్‌ పెట్టాను. అందుకే ఏసుదాసుగారితో పాడించాను. ఒక కామెడీ సాంగ్‌మాత్రం బాలుగారితో పాడించాను. బాలు గారు చాలా సహకరించేవారు. చాలా ఆత్మీయులు. నా హీరో(బాధ పడుతూ). వ్యక్తిత్వం చాలా మంచిది. మేం దెబ్బలాడుకున్నాం కూడా.

ఒక షాట్‌ అయిపోయిన తర్వాత మళ్లీ తలపై నీళ్లు పోసుకోమన్నాం. సీన్‌ చేసే సమయంలో "ఏమయ్యా.. నీళ్లు పోసుకుంటున్నానయ్యా.. ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు"(బాలు). అప్పుడు ఒకసారి కాకుండా మూడుసార్లు పోస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఈ సీన్‌ను బాలుగారికి వివరించండి అని అసిస్టెంట్‌ డైరెక్టర్‌లకు చెప్తే.. 'అమ్మో.. మేం వెళ్లం సర్' అని వాళ్లు అన్నారు. నేనే వెళ్లి.. 'గురువుగారు.. ఈ షాట్‌ మళ్లీ చేస్తే.. బాగుంటుంది' అన్నాను. 'నేనేం చెప్పాను నీకు.. ఏం చెప్పాను.. పదా'(కోపంగా) అన్నారాయన. దీంతో ఆయనతో మాట్లాడటం మానేశాను. షూటింగ్‌ అయిపోయింది. ఆయన ఊరెళ్లిపోతున్నారు. వెనక నుంచి వచ్చి చొక్కాపట్టి లాగారు. నేను వెనక్కి తిరిగా.. కౌగిలించుకున్నారు. వెంటనే కన్నీళ్లు వచ్చాయి. ఆశీర్వదించండి అన్నాను. 'చిన్న చిన్న విషయాలు ఇవి.. నువ్వు చాలా గొప్ప సినిమా చేశావు' అన్నారు. ఎప్పుడైనా నా జీవిత చరిత్ర రాయాల్సి వస్తే 'మిథునం'కు ముందు దానికి తర్వాత..(భావోద్వేగం)

సాయంత్రం అయితే.. తల తిరుగుతోంది అని మీ నాన్నగారు అనగానే మీరేమన్నారు..?

తణికెళ్ల భరణి: తల తిరిగిపోతుండేది ఆయనకు. ఎప్పుడెళ్లినా తలతిరుగుతోందిరా అని అంటుండేవారు. 'అదృష్టవంతుడివి నాన్న అణా ఖర్చు లేకుండా తలతిరుగుతోంది. మా తల తిప్పుకోవడానికి బోలెడెంత డబ్బు తగలెయ్యాల్సి వస్తోంది' అనేవాడిని(నవ్వుతూ..). అంటే మా నాన్న చాలా సరదా మనిషి. ఈ బాలసుబ్రహ్మణ్యం క్యారెక్టర్‌ మొత్తం మా నాన్నదే. చెప్పులు కూడా కుట్టుకునేవారు. మా చెప్పులు తెగిపోతే పిన్ను పెట్టుకునేవాళ్లం. పొద్దున్న లేచి చూసేసరికి ఆయన కుట్టి ఉంచేవారు. ఆశ్చర్యపోయేవాళ్లం. కాకపోతే.. ఎర్రటి చెప్పు ఉంటే దానికి ఆకుపచ్చ పట్టీ వేసేవాళ్లు. ఇదేంటి నాన్న అని అడిగితే.. చెప్పులు నెత్తికి వేసుకుంటావా.. అని అనేవారు. ఏం చేస్తాం.. పెద్దాయన కదా. అంటే ఒక మధ్య తరగతి జీవితాన్ని.. నవ్వుతూనే ఏమీ లేవనిపించుకోకుండా నడిపాడు. ఆ మధ్యతరగతి కుటుంబం అంటే నాకు ఇష్టం.

ఎవరైనా పెద్ద ఇల్లు కట్టుకుంటారు.. మీరేంటి పెద్ద బాత్రూమ్‌ కట్టుకున్నారు..?

తణికెళ్ల భరణి: మా ఇంట్లో ఏడుగురం అన్నదమ్ములకు ఒకటే బాత్రూం ఉండేది. క్యూ పద్ధతి. నిరుద్యోగిని కదా.. అందరి తర్వాత ఆఖరికి నాకు అవకాశం వచ్చేది. నీళ్లు వేడిగా ఉండేవీ కావు.. చల్లగానూ ఉండేవి కావు.. అప్పుడు నేను అనుకునే వాడిని.."పరమేశ్వరుడు వచ్చి నీకేం కావాలని అడిగితే.. నా జీవితంలో ఒక కోరిక.. 'హోటల్‌లో కూర్చొని నీళ్లు పోసుకోవాలె" అంటాననుకునేవాడిని వెంటనే ఆయన తథాస్తు అన్నారు. ఆ తర్వాత ఎక్కడికెళ్లినా హోటల్‌లో దిగడం వేడి నీళ్లు పోసుకోవడం. ఇప్పుడు మా ఇంట్లో ఏడు బాత్రూమ్‌లున్నాయి. అన్నింట్లో చేయలేం కదా.

మీ వివాహం పెద్దలు కుదిర్చిందా.. లేక ప్రేమ వివాహమా..?

తణికెళ్ల భరణి: రెండూ. ఆమె మా మేనమామ కూతురే. షూటింగ్‌ కోసం తమ్ముడు సత్యం, రవిరాజా పినిశెట్టి ముగ్గురం కారులో జగన్నాథపురం బయలుదేరాం. 'అరె.. మా అమ్మ పుట్టిన ఊరండీ ఇది. లోకేషన్‌కు వచ్చాం కదా. ఒకసారి వెళ్లి వద్దాం' అని వెళ్లి ఆమెను చూశాను. విచిత్రంగా.. కొన్ని రోజుల తర్వాత మా అమ్మ ఒక ఫొటో చూపించి.. పెళ్లి అంటున్నావ్‌ నేనో ఫొటో చూపిస్తా అని చూపించింది. నేను.. 'నీ ఇష్టం' అన్నాను. అలా.. పెద్దలు కుదిర్చారు. తర్వాత లవ్‌(నవ్వుతూ)

శివ సినిమాకు స్క్రిప్టు అంతా చేసి ఇచ్చిన తర్వాత ఎందుకని మిమ్మల్ని తీసేశారు?

తణికెళ్ల భరణి: వర్మ అంతకుముందు నేనే రాసిన 'రావుగారి ఇల్లు' సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌. కళ్లద్దాలు పెట్టుకొని అలా తిరుగుతుండేవారు. సెట్లో అందరూ ఆయన్ను 'ఇంగ్లీష్‌ మీడియం.. ఇంగ్లీష్‌ మీడియం' అనేవారు. నేను మాత్రం ఆయనతో సరదాగా ఉండేవాడిని. ఒకరోజు నాకు ఫోన్‌ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్‌కు రమ్మన్నారు. 'ఓ సినిమా తీస్తున్నా మీరు స్క్రిప్టు రాయాలి' అని వర్మ అన్నారు. నిజానికి అందులో డైలాగులు రాసినా.. ఇంకేం రాసిన ఆ గొప్పతనం వర్మదే. ఆ రోజు పెద్ద వర్షం పడింది. నేను చెన్నైలో ఉంటున్నా కదా.. పొద్దున్నే ఫ్లైట్‌కు వెళ్లాలి. అందుకనే సాయంత్రం లోపల స్క్రిప్టు అందించలేకపోయా. నా మిత్రుడు సీవీఎల్‌కు ఇచ్చి వర్మగారి ఆఫీస్‌లో ఇవ్వమని చెప్పాను. నేను వెళ్లిపోయాను. 3-4 నెలలైంది. కట్‌ చేస్తే.. 'శివ' మొదలైంది. ఆ సినిమాలో నా పేరు లేదని తెలిసింది. ఇంతలో ఆ సినిమా కో-డైరెక్టర్‌ శివనాగేశ్వర్‌రావు ఫోన్‌ చేశారు. 'ఒకసారి వర్మకు ఫోన్‌ చేయొద్దు కదా' అన్నారు. 'వద్దనుకున్నాక ఎందుకులేండి' అని నేనన్నాను. 'లేదులేదు ఒకసారి చేసి చూడు' అని చెప్పారు. అప్పుడు నేను చెన్నైలో ఉన్నాను. సరే ఒకసారి ఫోన్‌ చేశా.

ఫోన్‌లో ఆర్జీవీ.. 'ఎస్‌.. మిస్టర్‌ భరణి' అన్నారు. ఏం లేదండీ ఊరికే అభినందించడానికి చేశానంతే అని నేను చెప్పాను. వెళ్లే ముందు మీ ఇంటికి వస్తా.. అని అన్నారాయన. వర్మ అన్నీ విచిత్రమే. అప్పుడు మా ఆవిడ ఇంట్లో లేదు. ఉన్నట్టుండి వర్మ కారులో నుంచి దిగారు. నేను ఆశ్చర్యపోయాను. రాడనుకున్నాను. వచ్చారు. చాయ్‌ కావాలన్నారు. నేనే పెట్టా. చాయ్‌ ఇచ్చాను. 'నాకు కోపమొచ్చింది. స్క్రిప్టును ఫ్రెండ్‌తో పంపించావని. స్క్రిప్టు అంటే ఏంటయ్యా.. స్క్రిప్టు అంటే ప్రాణం. పైగా ఇది నా తొలి సినిమా' అన్నారు. నా పరిస్థితి ఇదీ అని ఆయనకు వివరించాను. సరే.. రేపు వచ్చేయండి నాతో పాటు అన్నారు. ఆ వెంటనే.. నా వెనకాల ఉన్న శ్రీదేవి చిత్రాన్ని చూస్తూ.. అబ్బా ఎప్పటికైనా శ్రీదేవితో సినిమా తీయాలయ్యా' అన్నారు. ఆ తర్వాత శివ పెద్ద హిట్టయింది. ఆ తర్వాత వర్మ ఏం తింటాడు.. ఎక్కడ పడుకుంటాడు.. ఏం చేస్తాడు.. దాదాపు ఏడాది పాటు శివరాత్రే.

మీ స్క్రిప్టును చూసిన ఓ డైరెక్టర్‌.. ఇదేం కథయ్యా.. ఎవరు చూస్తారు అని అన్నారట.. ఎవరాయన..?

తణికెళ్ల భరణి: లేదు లేదు. కృష్ణవంశీతో నాకిలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. ఆయనతో నాకున్న అనుబంధం ఒకటే. 'సముద్రం'. ఒకసారి ఫోన్‌ వచ్చింది. విలన్‌ కావాలి. చాలా టఫ్‌గా ఉండాలి. 40మందిని చూశాను. నువ్వు గుర్తొచ్చావు అన్నారు. 'చేపల కృష్ణ' పాత్ర పేరు. ఈ పాత్రకు నాకు నందీ పురస్కారం వచ్చింది.

శివ సినిమా రాసేటప్పుడు ఏమైనా కామెడీ రాశారా అందులో..?

తణికెళ్ల భరణి: నేను అప్పటికే 'లేడీస్‌ టైలర్‌', 'కనకమహాలక్ష్మి..' ఇలా పాపులర్‌ కామెడీ రచయితగా పాపులారిటీ వచ్చింది. ఏ సినిమాలోనైనా కొంచెం కామెడీ ఉండేది. ఏ స్క్రిప్టు రాసినా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండాలనేది నా ఉద్దేశం. వర్మ నాకీ సినిమా ఇచ్చినప్పుడు కూడా.. మొత్తం కాలేజీ కామెడీ రాశా. చదివి వినిపిస్తే.. 'ఇదేంటీ ఇన్ని జోకులున్నాయ్‌. నాకు ఒక్క జోక్‌ కూడా ఉండటానికి వీల్లేదు' అన్నారు. సినిమా ఆడదని వెంటనే అనుకున్నా.(నవ్వుతూ)

ఆటగదరా శివ.. ఒక నాలుగు లైన్లు మా కోసం..

తణికెళ్ల భరణి: తప్పకుండా.. 1999లో 'అయ్యప్ప శిఖరం కూలి 200 మంది తెలుగువాళ్లు మరణం' వార్త. రాళ్లపల్లితో కలిసి దాదాపు పది సార్లు వెళ్లా అక్కడికి. మన కళ్ల ముందు ఆ శిఖరం కూలిపోవడం ఏంటని అనుకున్నా.. చాలా దుఃఖం వచ్చింది. డైరెక్ట్‌గా శివుడితో ఇలా అనుకున్నా.. 'అయ్యప్ప కొండకు వచ్చారు. ఎన్నో కోరికలు. ఆశయాలు. సరే వాళ్లక్కడ చచ్చిపోతే పుణ్యం వచ్చిందో.. మోక్షం వచ్చిందో అనుకుందాం.. మరి వాళ్ల కుటుంబం సంగతేంటి..? పిల్లలు.. భార్య.. చాలా అన్యాయం'.. అని ఆటగదరా శివా.. ఆటగద కేశవా.. ఆటగదరా నీకు అమ్మతోడు.. అప్రయత్నంగా వచ్చేసింది. 23 రోజులు నిద్రలేదు. కనిపించకపోవచ్చు.. కానీ అనిపించాడు. ఏదో ఒక ఆలోచన రావడం. పెన్ను, పెన్సిల్‌ పక్కనే పెట్టుకొని పడుకునేవాడిని. రాగానే రాస్తుండేవాడిని. మా ఆవిడకు భయమేసింది. మీకు పిచ్చిపట్టిందని చెప్పబోయింది. శివుడి పిచ్చి పట్టడం కంటే మోక్షం ఉంటుందా అని నేను అన్నాను. అలా మొత్తానికి ఒక పాట అయిపోయింది. నేను ఎవరికి చూపించాలి.. వేటూరి గారికి చూపించాను. పరమాద్భుతంగా ఉందన్నారాయన. అక్కడి నుంచి దాదాపు.. నేను అమెరికా, ఆస్ట్రేలియా, ఒమన్‌, సౌదీ అరేబియా, యూరప్‌, నేను వెళ్లిన ప్రదేశాలన్నింటిలోని సభల్లో ఇదే పాట. అప్పట్లో మనదగ్గర అంత డబ్బు లేదు కదా. వీణాపాణి గారు మ్యూజిక్‌ డైరెక్టర్‌. మృదంగం వాయించింది వేణు.. తంబూర వాయించింది డా.శ్రీనివాస్‌, సుదర్శన్‌గారు. ఈ గ్రూప్‌తో ప్రపంచం మొత్తం వెళ్లి వచ్చాం. ఇప్పుడు ఇవాళ.. రికార్డింగ్‌ మొత్తం అయిపోయింది. ఇక్కడి నుంచి వెళ్లగానే చేతికి రికార్డింగ్‌ వచ్చేస్తుంది. శివరాత్రికల్లా ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో అప్‌ చేస్తాం.

పెద్ద సినిమా రచయిత ఒకాయన ఎక్కడ మిమ్మల్ని కొడతారని చెప్పి ఆయనకు కనిపించకుండా ఒక సంవత్సరం దాక్కున్నారట ఏంటీ..?

తణికెళ్ల భరణి: అది తలచుకుంటే చాలా నవ్వొస్తుంది. ఏంటంటే.. 'కోనసీమ కుర్రాడు'. రవిరాజ పినిశెట్టి డైరెక్టర్‌. నన్ను హైదరాబాద్‌ నుంచి పిలిపించారు. సినిమాకు ఇంకో రైటర్‌ ఉన్నాడని అప్పుడు నాకు చెప్పలేదు. కథ విన్నాక బాగుందని చెప్పాను. సాయంత్రం దివాకర్‌బాబు ఫోన్‌ చేశాడు. 'ఏం దివాకర్‌' అని అడిగితే.. 'ఏం లేదు. నేను చెన్నై వచ్చాను. ఒక సినిమా రాస్తున్నా' అన్నాడు. ఏం సినిమా అని అడిగాను. 'కోనసీమ కుర్రాడు' అన్నాడు. అవునా.. నేను రాస్తున్నా.. నువ్వు రాస్తున్నావ్‌ ఎంతమంది రాస్తారయ్యా అన్నాను. అవునా.. ఈ విషయం నాకు తెలియదు.. అది మామూలేనండి ఇండస్ట్రీలో అన్నాడు. సరే.. అని రాయడం మొదలుపెట్టాను. మొత్తం స్క్రిప్టు అయిపోయింది. ఇంకో మాట అన్నాడు. 'భరణిగారు.. సినిమా రాయండి.. సీరియస్‌ సీన్లయితే నేను చేయగలను. కామెడీ నాకు కొంచెం ఇబ్బంది' అన్నారు. అప్పుడు నేను.. 'ఎడమ చేత్తో రాస్తాను' అన్నాను. అయితే, అంతకుముందే సత్యమూర్తి ఒక వెర్షన్‌ రాసేశారట. ఆ విషయం నాకు చెప్పలేదు. ఆయన రాసిన సీన్స్‌ తీసేని నేను రాసినవి వాడారు. ఆయన చాలా కోపిష్టి. నేనమో తెలియకుండా రాశాను. ఎప్పుడైనా సత్యమూర్తి నుంచి ఫోన్‌ వస్తే నాకు టెన్షన్‌. ఆయన పేరంటేనే నాకు భయం వేసేది. ఆత్రేయగారి సన్మాన సభకు వెళ్తే, అక్కడకు సత్యమూర్తి వచ్చారు. ఆయన మాట్లాడుతుంటే నేను కారేసుకొని ఉరుకు(నవ్వుతూ).. ఓ హోటల్‌లో కూర్చున్నాను. ఒకాయన వచ్చి 'మన సత్యమూర్తి గారు కిందనే ఉన్నారు' అని చెప్పారు. ఇంకేముంది.. వచ్చి ఏమైనా చేస్తే ఎలా..? బాత్రూమ్‌కు కుండే ఊచ చేతిలో పట్టుకొని కూర్చున్నాను. తర్వాత తెలిసింది ఆయన అటునుంచి అటే వెళ్లిపోయారని. తర్వాత మురారి గారి ఆఫీస్‌నుంచి ఫోన్‌ వస్తే, వెళ్లాను. లోపల సత్యమూర్తిగారు కూర్చొని ఉన్నారు. ఏం చేయాలో తెలియక ఆయన కాళ్లు పట్టుకున్నా.. (నవ్వుతూ). 'అన్నా నాకేం తెలియదు. మీ పేరు చెప్పలేదన్నా' అన్నాను. 'ఇవన్నీ చిన్న విషయాలయ్యా.. ఎప్పుడైనా సరే నీకు ఫోన్‌ చేసి భలే రాసవయ్యా అని చెబుదామనుకుంటే నువ్వేంటి అసలు కనపడటం లేదు. ఏడాది నుంచి ట్రై చేస్తున్నా' అన్నారు. ఏడాది నుంచి ఆయన ట్రై చేస్తున్నారని ఇందుకా అనుకున్నాను. చావు కంటే చస్తామనే భయం ఇంకా భయకరమైంది.

చస్తామనే అంత భయం ఉన్న మీరు మర్డర్‌ కేసులో ఎలా ఇరుక్కున్నారు..?

తణికెళ్ల భరణి: ఇది మర్డర్‌ కేసు కాదు. నేను అమృతవాణి అని క్రైస్తవ కమ్యునికేషన్‌ సెంటర్‌లో పనిచేశాను. అక్కడ ఓ మిత్రుడు రికార్డిస్టు చేశాడు. అతను అప్పటికే పెళ్లయి.. ఇంకో అమ్మాయిని ప్రేమించాడు. ఎందుకయ్యా ఇవన్నీ అంటే.. బాగా తాగేవాడు. ఆఖరికి ఉద్యోగం కూడా మానేశాడు. ఇలా అన్నీ అయిపోయాయి. ఒకరోజు అతని పరిస్థితి బాగాలేకపోతే ఇంటి దగ్గర దింపమని నన్ను అడిగాడు. అతడిని తీసుకెళ్లి ఇంట్లో దించాను. అప్పటికే లేట్‌ అయిపోయింది. అక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్లు వెళ్లాలి. సర్లే.. అని చెప్పి. ఆయనతో కూర్చొని కాసేపు కాలక్షేపం చేసి పడుకున్నాం. తెల్లారి చూసే సరికి ఆయన లేరు. ఎక్కడ వెతికినా కనిపించలేదు. మూడో రోజు పేపర్‌లో.. ఫలానా వ్యక్తి రైలు కిందపడి చనిపోయాడు అని వార్త. పోలీసులు వచ్చారు. ఇంకా చూసుకో.. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు బయట నుంచి ఏదైనా బండి శబ్దం వినిపిస్తే.. గడగడలాడిపోయేవాడిని.

లక్కీగా. అదే ఆఫీసులో పనిచేస్తున్న నా మిత్రుడి తండ్రి పోలీస్‌ ఆఫీసర్‌. మేం మార్చురీకి వెళ్లి.. డెడ్‌బాడీని చూశాం. వాడే.. అయ్య బాబోయ్‌.. ఇదేంటీ అనుకున్నాం. వాడి జేబులో ఒక ఫొటో. ప్రేయసిది. దానికి వెనకాల నా చావుకు కారణం ఎవరూ కాదని రాసి పెట్టాడు. లేకుంటే నాపని అయిపోయేది. అంటే మన మధ్యతరగతి కుటుంబాల్లో ఎలా అంటే.. పోలీస్‌స్టేషన్‌ అన్నా.. కోర్టులన్నా కుటుంబం మొత్తం షేక్‌ అయిపోతుంది. మధ్యతరగతి లక్షణం అది.

మీ 'మిథునం' అమితాబ్‌ బచ్చన్‌ అక్కడ నటిస్తున్నారని విన్నాను.

తణికెళ్ల భరణి: అసలేం జరిగిందంటే.. అమితాబ్‌ బచ్చన్‌కు కొత్త కథలంటే ఇష్టం కదా. పైగా నాకు ఇంకో కోరిక ఏంటంటే అమితాబ్‌, రేఖ కలిసి 'మిథునం' చేస్తే.. అంతర్జాతీయంగా గొప్ప సినిమా అవుతుందని భావించి.. రిలయన్స్‌ వాళ్ల ద్వారా వెళ్లాం. ఇదంతా ఆరు సంవత్సరాల క్రితం. ఈ మధ్య బాలుగారు జరిగిపోయిన తర్వాత కన్నడలో డబ్‌ చేస్తామని ఒకరు వచ్చారు. కన్నడలో డబ్‌ అవుతున్న సమయంలో.. మరి ఎలా వెళ్లిందో వెళ్లింది.. ఎవరో పెద్దవాళ్లకే వెళ్లిందట. ఆయన సినిమా చూశారో.. చూస్తారో తెలియదు. ఒకవేళ అది జరిగితే చాలు. ఇటు సౌత్‌లో రాఘవేంద్రరావుగారితో చేయడం.. నార్త్‌లో అమితాబ్‌తో చేయడం అంతకంటే ఇంకేం కావాలి. హిందీ సినిమాతో చర్చలంటే ఆర్నెల్లు పడుతుంది. ఈలోపు ఈ సినిమా అయిపోతుంది.

హిందీలో మీ షూటింగ్‌ జరిగేటప్పుడు నాకు ఒకసారి ఫోన్‌ చేయండి. అమితాబ్‌, రేఖ మధ్యలో నిల్చొని ఒక ఫొటో దిగాలని నా కోరిక.

తణికెళ్ల భరణి: నేను రేఖ మీద ఒక పద్యం రాశాను. ఇప్పుడు వద్దులే(నవ్వుతూ..)

దేవుడిని అరేయ్‌.. ఒరేయ్‌.. అంటుంటారు..?

తణికెళ్ల భరణి: నిజానికి నవవిధ భక్తులనేవి ఉంటాయి. అందులో దాస్యం ఉంటుంది. స్నేహం కూడా ఉంటుంది. దేవుడితో స్నేహం చేస్తా. అందుకే దేవుడ్ని నేను అరేయ్‌ అంటాను. దేవుడు కూడా నన్ను ఒరేయ్‌ అంటాడు.

'దళపతి' సినిమాలో అమ్రిష్‌పురి గారి పాత్ర మీరు చేయాల్సిందట కదా..?

తణికెళ్ల భరణి: మణిరత్నం మహానుభావుడు.. గమ్మత్తు ఏంటంటే.. సుహాసిని అంటే నాకు బాగా పరిచయం. ఆమె నటించిన చాలా సినిమాలను నేను రాశాను. మద్రాసులో సుహాసిని ఉండే భవనంలోనే అందులో సెవంత్‌ మూవీస్‌ ఆఫీస్‌ ఉండేది. అక్కడికి మణిరత్నం కూడా ఒకసారి వచ్చారు. ఒకసారి మణిరత్నం మాకు కారు పంపించారు. మీరెప్పుడు వస్తున్నారు అని అడిగారు. నాకేమో షూటింగ్‌ ఉంది. నేను రేపు వస్తానని ఏదో సర్దిచెప్పి పంపించాను. మూడు రోజుల పాటు అలా కారు వచ్చింది. చివరకు వెళ్లాను. అలా దళపతి కథను ఇంగ్లిష్‌లో వివరించారు. నేను భిన్నమైన పాత్ర చేయాలని చెప్పాను. మణిరత్నం విధానం వేరే ఉంటుందిగా.. నన్ను ఫొటోలు తీశారు. భరణి మీరు వయసులో ఉన్నారు. ఈ పాత్రకు వయసున్న వ్యక్తి కావాలన్నారు. మేకప్‌ వేసుకుంటా సర్‌ అన్నాను. మీకు తెలుసు కదా.. నా సినిమాల్లో మేకప్‌ ఎక్కువ ఉండదు అని ఆయన అన్నారు. సారీ.. అన్నారు. ఆ తర్వాత సినిమా చూస్తే.. అమ్రిష్‌ పురి చేశారా పాత్ర. న్యాయం కూడా. సారా సామ్రాజ్యానికి కింగ్‌ ఆయన. దర్శకుడికి ఆ లక్షణం ఉండాలి.

మీరు చేసే ప్రతిపనిలో విజయం సాధించాలి. నటుడిగా.. డైరెక్టర్‌గా.. రచయితగా.. భవిష్యత్తులో నిర్మాతగా.. ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నా..

తణికెళ్ల భరణి: థ్యాంక్స్‌.(నవ్వుతూ)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.