కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని తమిళ సినీ హీరో విజయ్ తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామికి విజయ్ ఓ అభ్యర్థన చేశారు. ప్రస్తుతం విజయ్ కథానాయకుడిగా నటించిన 'మాస్టర్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది. సంక్రాంతికి కానుకగా ఈ సినిమాను అభిమానుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 2021 జనవరి 7 నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభించనున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో.. థియేటర్లపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను సడలించి, 100శాతం ప్రేక్షకులను అనుమతించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని విజయ్ కోరారు. అయితే.. విజయ్ అభ్యర్థనపై ముఖ్యమంత్రి ఎలా స్పందించారనేది ఇంకా తెలియరాలేదు.
ఈ చిత్రం ఇటీవల సీబీఎఫ్‌సీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) నుంచి యూ/ఏ సర్టిఫికెట్‌ను కూడా పొందింది. తొలుత 'మాస్టర్' ఓటీటీ వేదికగా విడుదలవుతుందన్న వార్తలు వినిపించాయి. అయితే.. 'అలాంటిదేం లేదు, సినిమాను కచ్చితంగా థియేటర్‌లోనే విడుదల చేస్తాం' అని చిత్రబృందం స్పష్టం చేయడం వల్ల అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన మాళవికా మోహన్ నటించింది. అర్జున్ దాస్, సిమ్రన్, ఆండ్రియా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత అందించారు. ఎక్స్‌బీ ఫిల్మ్స్, సెవన్ స్క్రీన్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాన్ని విడుదల కానుంది.