ప్రముఖ కథానాయికలు శ్రుతిహాసన్, తమన్నా మంచి స్నేహితులు. శ్రుతి అంటే తనకెంతో ఇష్టమని మిల్క్‌బ్యూటీ ఇప్పటికే పలు సందర్భాల్లో తెలియజేసింది. తాజాగా ఆమె మరోసారి శ్రుతి అంటే తనకెంత ఇష్టమో వివరిస్తూ.. తనకి బాగా నచ్చిన విషయాన్ని అందరితో పంచుకుంది. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
"ఇండస్ట్రీలోని నటీనటులందరి కంటే నాకు శ్రుతిహాసన్ ఎక్కువ ఇష్టం. తనే నా బెస్ట్ ఫ్రెండ్. ముంబయిలో మా ఇంటికి దగ్గర్లోనే వాళ్ల ఇళ్లు కూడా. కాబట్టి మేము తరచూ కలుసుకునేవాళ్లం. ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. మేమిద్దరం ఒకచోట కలిస్తే సాధారణంగా మా జీవితాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. శ్రుతికి నెగిటివిటీ అంటే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్లకు కాస్త దూరంగా ఉంటుంది. ఆ గుణమే మేమిద్దరం మంచి స్నేహితులమయ్యేలా చేసింది. అంతేకాకుండా ఇప్పటికీ తను నన్ను ఓ చిన్నపిల్లలానే చూస్తుంది" అని తమన్నా తెలిపింది.
పెళ్లి చేసుకునేదాన్ని..!
గతంలో తమన్నా గురించి ఆసక్తికరంగా మాట్లాడింది శ్రుతి. "నేనే గనక అబ్బాయిగా పుట్టి ఉంటే తప్పకుండా తమన్నానే పెళ్లి చేసుకునేదాన్ని. ఎందుకంటే ఆమె చాలా మంచిది. అలాంటి అమ్మాయిని ఎవరు వదలుకుంటారు" అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సేల్‌తో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించిన శ్రుతి... ఆ తర్వాత విడిపోయినట్లు వార్తలు వచ్చాయి.
గోపీచంద్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'సిటీమార్’లో తమన్నా నటిస్తోంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు శ్రుతిహాసన్ సైతం 'క్రాక్' చిత్రంతో బిజీగా ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ కథానాయకుడు.