సైరా: నరసింహారెడ్డి సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం ముంబయిలో జరిగింది. చిరంజీవి, రామ్‌చరణ్ సహా సినిమాలో నటించిన ఇతర నటీనటులు ఇందులో పాల్గొన్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ టీజర్లు విడుదల చేసింది చిత్రబృందం.
1992లో వచ్చిన ఆజ్ కా గుండా రాజ్ తర్వాత హిందీలో ఎందుకు నటించలేదని రిపోర్టర్ అడగ్గా.. సరైన కథ దొరకలేదని చెప్పాడు చిరు.
"ఎందుకు గ్యాప్ వచ్చిందో నాకు అర్ధం కావడం లేదు. బహుశా బాలీవుడ్లో నటించేందుకు సరైన కథ దొరకలేదనుకుంటా. ఈ సినిమాతో మళ్లీ మీ ముందుకు రాబోతున్నా. రాజకీయాల వల్ల సినిమాలకు పదేళ్లు విరామం తీసుకున్నా. 2016లో రీ ఎంట్రీ ఇచ్చా." -చిరంజీవి
ఇద్దరు మెగాస్టార్లు(అమితాబ్, చిరంజీవి) తొలిసారిగా నటిస్తున్నారు. దీనిపై మీ ఫీలింగ్ ఏంటన్న ప్రశ్నకు.. బిగ్ బీనే నిజమైన మెగాస్టార్ అని చిరు చెప్పాడు.
"అమితాబ్ బచ్చన్.. నా రియల్‌లైఫ్ మెంటర్. నా దృష్టిలో ఒకే ఒక్క మెగాస్టార్. అది బిగ్ బీ మాత్రమే. ఆయనతో నన్ను పోల్చినందుకు మీకు థ్యాంక్స్. ఆయనతో కలిసి పనిచేయడం మర్చిపోలేను. సినిమాలో హీరో గురువు పాత్ర ఉందని అడగ్గానే ఆయన సరే అని చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. నిజమైన మెగాస్టార్ అమితాబ్ బచ్చనే." -చిరంజీవి.
హిందీ ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని హీరో ఫర్హాన్ అక్తర్ తీసుకురానున్నాడు. అమిత్ త్రివేది సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటించారు. అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషించాడు.
ఇది చదవండి: సైరా: ఆంగ్లేయులను వణికించిన రేనాటి సూర్యుడి కథ