స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్న చిత్రం 'సైరా'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. వచ్చే నెల 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు (సెప్టెంబర్ 22) ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తోంది చిత్రబృందం. అయితే ఈ తేదీకి ఓ ప్రాముఖ్యత ఉండటం విశేషం.
ఈరోజునే పునాది..
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి.. నటుడిగా తన ప్రయాణం ప్రారంభించింది సెప్టెంబర్ 22నే. అప్పటి నుంచి ఇప్పటివరకు తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగించాడు. తన ప్రతిభతో డేరింగ్, డాషింగ్, సుప్రీం హీరో, మెగాస్టార్‌గా ఎదిగాడు.
తొలి చిత్రం విడుదల
చిరంజీవి నటించిన తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. అంటే ఇండస్ట్రీలోకి వచ్చి ఈరోజుకి సరిగ్గా 41 ఏళ్లు పూర్తయింది.
100వ చిత్రం
మెగాస్టార్ నటించిన 100వ చిత్రం 'త్రినేత్రుడు'. ఈ సినిమా కూడా 1988 సెప్టెంబర్ 22న విడుదలైంది. చిరు కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఇలాంటి ప్రత్యేకమైన రోజునే 'సైరా' ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తం కుదిరింది.
ప్రతిష్టాత్మకంగా సైరా
చిరు పునరాగమనం తర్వాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'సైరా'. ప్రీ రిలీజ్ వేడుకను అంతే ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసింది చిత్రబృందం. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియం వేదికగా భారీ హంగులతో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, కొరటాల శివ, వి.వి వినాయక్ తదితరులు హాజరుకానున్నారు.
ఇవీ చూడండి.. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్...?