సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో అరెస్టు చేసిన రియా చక్రవర్తిని ఇకనైనా విడుదల చేయాలని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ డిమాండ్ చేశారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి రియాకు మద్దతుగా మాట్లాడారు. జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని అన్నారు.
"సుశాంత్ కేసులో రియాను ఇకపై చిత్రహింసలు పెట్టకుండా స్వేచ్ఛగా వదలండి. ఆయన మరణం మమ్మల్ని కూడా ఎంతో బాధించింది. కానీ ఓ మహిళను నిందితురాలిగా అభివర్ణించడం వల్ల మనం ఆయనకి గౌరవం ఇచ్చినట్లు కాదు. రియా చక్రవర్తి అమాయకురాలని నేను ఇంతకు ముందే చెప్పా. మరింత వేధింపులకు గురిచేయకుండా ఆమెను విడుదల చేయాలి, రియా రాజకీయ కుట్రకు గురైంది."
- అధీర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ సీనియర్ నేత
ఈ నేపథ్యంలో అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ స్వరా భాస్కర్ స్పందించారు. 'చాలా బాగా చెప్పారు సర్.. రియా చక్రవర్తిని విడుదల చేయండి' అని ఆమె ట్వీట్ చేశారు.
జూన్ 14న తన ఇంట్లో సుశాంత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. డ్రగ్స్ చాటింగ్ జరిగిందని గుర్తించారు. దీంతో ఎన్సీబీ రంగంలోకి దిగి.. రియాతోపాటు 18 మందిని అరెస్టు చేసింది. ఆమె బెయిల్ మంజూరు దరఖాస్తుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. రియా డ్రగ్స్ తన ఇంట్లో భద్రపరిచి, సుశాంత్‌కు ఇచ్చేవారని.. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే కేసు విచారణకు సమస్యలు ఏర్పడతాయని ఎన్సీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కాగా సుశాంత్‌ది ఆత్మహత్యని, హత్య కాదని ఎయిమ్స్ శనివారం వెల్లడించింది. అతడి శరీరంపై ఎటువంటి గాయాలు, గాట్లు లేవని స్పష్టం చేసింది.