అందాల కిరీటాన్ని గెలుచుకొన్న భామలు ఎంతోమంది ఉన్నారు. వాళ్లల్లో కథానాయికగా తెరపైకి అడుగుపెట్టి రాణిస్తున్నవాళ్లూ చాలామందే కనిపిస్తారు. అందులో సుస్మితా సేన్ ప్రత్యేకం. అత్యంత అందమైన కథానాయికగానే కాదు... స్టైల్‌లోనూ ఆమెకు ప్రత్యేకమైన స్థానం ఉంది. నేడు (నవంబరు 19) ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం...
హైదరాబాద్ అమ్మాయే..
సుస్మితా సేన్ మూలాలు బెంగాల్లో ఉన్నాయి. పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. తండ్రి సుభేర్ సేన్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో వింగ్ కమాండర్‌గా పనిచేసేవారు. ఉద్యోగరీత్యా కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి స్థిర పడింది. తల్లి శుభ్రా సేన్ ఆభరణాల డిజైనర్. ముంబయిలో దుబాయ్‌కు చెందిన ఓ షాపు యజమానిగా వ్యవహరిస్తున్నారు. సుస్మితాకు నీలమ్, రాజీవ్ అనే ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. సికింద్రాబాద్‌లోని సెంట్ ఆన్స్ హై స్కూల్‌లో విద్యాభ్యాసం చేసింది. ఆ తర్వాత పై చదువులుపై ఆసక్తి చూపలేదు. దిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్‌స్టిట్యూట్‌లో ఎక్కువగా గడిపేది.

తొలి కిరీటం...
పదిహేనేళ్ల వయసులోనే అందాల ప్రపంచంతో అనుబంధం ఏర్పరుచుకొంది. స్కూల్‌లో ఉన్నప్పుడే బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొనేది. ఆ సమయంలోనే అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. 1994లో మిస్ యూనివర్స్‌గా నిలిచింది. ఆ కిరీటాన్ని దక్కించుకొన్న తొలి భారతీయ యువతిగా రికార్డు సృష్టించింది.
దస్‌తక్‌తో...
మిస్ యూనివర్స్ కిరీటంతో అడుగుపెట్టగానే... ఆమెకి సినిమా అవకాశాలు స్వాగతం పలికాయి. దస్‌తక్‌తో కెరీర్‌ను ప్రారంభించింది. ఆ చిత్రం అంతగా పేరు తీసుకురాలేకపోయింది. దీంతో... తెలుగు తమిళ భాషల్లో నాగార్జునతో కలిసి ఓ సినిమా చేసింది. తెలుగులో రక్షకుడు పేరుతో రూపొందింది ఆ చిత్రం. సినిమా అనుకొన్నంత ఆదరణ పొందలేకపోయినా.. సుస్మితాసేన్ పేరు మాత్రం మార్మోగిపోయింది.
హిందీలో హవా..
అటు విమర్శకుల్ని, ఇటు ప్రేక్షకుల్ని మెప్పించి... సుస్మితాసేన్‌కు గుర్తింపును తీసుకొచ్చిన చిత్రం సిర్ఫ్‌తుమ్. 1999లో విడుదలైన ఈ సినిమా చక్కటి వసూళ్లు రాబట్టింది. ఆమెను నటిగా మరిచిపోలేకుండా చేసింది. దానికి కొనసాగింపుగా బివి నెం.1 చేసింది. అది కూడా విజయవంతం అవ్వడం వల్ల హిందీలో అందాల రాణి హవా మొదలైంది. స్టార్ కథానాయకులు సైతం ఆమెతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపారు.
అవే నిలబెట్టాయి..
గ్లామర్ లేడీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకొన్న సుస్మితా సేన్... వెండితెరపై కూడా రెచ్చిపోయింది. ఫ్యాషన్స్ పోకడల్ని తన పాత్రలకి అన్వయిస్తూ తెరపై దర్శనమిచ్చింది. దీంతో ఆమె అందం ప్రేక్షకులపై చెరగని ముద్రవేసింది. ఆంఖే, మై హూనా, పైసా వసూల్, మైనే ప్యార్ క్యోకియా, ఫిల్హాల్, సమయ్, చింగారి, జిందగీ రాక్స్, ఆగ్, డు నాట్ డిస్టర్బ్, నో ప్రాబ్లెమ్ తదితర చిత్రాలు సుస్మితాను నటిగా నిలబెట్టాయి.

ఐటెమ్ అదుర్స్..
షకలక బేబి.. షకలక బేబి... లుక్కులివ్వ తోచలేదా? అంటూ ఒకేఒక్కడులో సుస్మితాసేన్ చేసిన సందడిని తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ తరహా పాటలతో హిందీలోనూ సందడి చేసింది. ఆమె చేసిన ప్రత్యేకగీతాలు విశేషంగా ప్రాచుర్యం పొందాయి. ఒకేఒక్కడు, ఫిజా, నాయక్, కిస్నా, అలగ్ తదితర చిత్రాల్లో ఐటెమ్ పాటలు చేసి అదరగొట్టింది.
పెళ్లి కాకుండా తల్లి..
సుస్మిత ఎంత అందమో... ఆమె హృదయం అంతకంటే అందమైనదని చెప్పొచ్చు. 25 యేళ్ల వయసులో రెనీ అనే ఓ చిన్నారిని దత్తత తీసుకొంది. పెళ్లి చేసుకోని మహిళలు పిల్లలను సంరక్షించలేరన్న అభ్యంతరం రావడం వల్ల న్యాయస్థానంలో పోరాటం చేసింది. అందులో గెలిచి పాపని దత్తత తీసుకొంది. ఇప్పటికీ అదొక చరిత్రగా చెబుతుంటారు. అలాగే 2010లోనూ అలిషా అనే మరో చిన్నారిని కూడా దత్తత తీసుకొంది. ఇప్పుడు ఆ ఇద్దరు చిన్నారులు సేన్ సంరక్షణలోనే ఉన్నారు. అలా పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లయిందన్నమాట.

మరిన్ని విశేషాలు ఆమె మాటల్లో
- నా జీవితంలో మరిచిపోలేని విషయాలు చాలానే ఉన్నాయి. అయితే వాటన్నిటికంటే నేను తల్లిని అయిన క్షణమే నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. రెనీని నాకు అప్పజెబుతూ కోర్టు తీర్పునిచ్చిన సమయంలో నా సంతోషానికి ఆకాశమే హద్దు.
- తల్లినయ్యాక నాలో చాలా మార్పొచ్చింది. రెనీ నా జీవితంలోకి రాగానే నాకు నేనుగా చాలా నిర్ణయాలు తీసుకొన్నా. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాలనీ, ర్యాష్ డ్రైవింగ్‌ల్లాంటివి అస్సలు చేయకూడదని నిర్ణయించుకొన్నా. ఇప్పటికీ అదే రకంగానే జీవితాన్ని గడుపుతున్నా.
- నాకు బీచ్‌లంటే చాలా ఇష్టం. అందుకే సౌత్ అమెరికా దేశాలకు తరచుగా వెళుతుంటా. ముఖ్యంగా వెనిజులా, బ్రెజిల్‌లకి ఎన్నిసార్లు వెళ్లానో నాకే తెలియదు. అక్కడ నగరాలు చాలా విశాలంగా ఉంటాయి.
- నాకు రాత్రిళ్లు మేలుకొనే అలవాటు ఎక్కువ. అలాగని పబ్బులు, పార్టీలకు వెళ్లను. ఇంట్లోనే గడుపుతుంటా. మనసు కాస్త తేడాగా ఉందనిపిస్తే.. గట్టిగా మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ స్వాంతన పొందుతుంటా.
- శృంగారం గురించి మాట్లాడుకోవడానికి ఇప్పటికీ భయపడుతుంటారు. అదేంటో అర్థం కాదు. కామసూత్ర మన దేశంలోనే పుట్టింది. కానీ ఇప్పటికీ మనవాళ్లు ఆ విషయంలో రహస్యాలు పాటిస్తున్నారు. శృంగారం గురించి అందరికీ అవగాహన ఏర్పడాలి. మీడియా వల్ల ఇటీవల కొద్దిమందైనా మాట్లాడుకొంటుండడం సంతోషాన్నిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : అభిమాని 'ప్రేమలేఖ'కు సుస్మితాసేన్ ఫిదా